Share News

ముస్లిం సోద‌రుల‌కు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం

ABN , Publish Date - Mar 20 , 2026 | 07:12 PM

పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలతో ఆధ్యాత్మిక చింతన పెంచే ఈ పండుగ.. సోదరభావాన్ని పెంపొందించాలని కాంక్షించారు.

ముస్లిం సోద‌రుల‌కు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం
CM Revanth Reddy

ఇంటర్నెట్ డెస్క్: పవిత్ర రంజాన్(ఈద్-ఉల్-ఫితర్) పండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదర సోదరీమణులు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరితో సంతోషంగా రంజాన్ వేడుకలు నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలతో ఆధ్యాత్మిక చింతన పెంచుకునే ఈ పండుగ.. సోదరభావాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. ముస్లింల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, లౌకికవాదానికి పెద్దపీట వేస్తామని ఆయన పేర్కొన్నారు.


'రంజాన్ పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ ఉద్భవించిన రంజాన్‌ మాసంలో ముస్లింలు అనుసరించే కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయి' అని రేవంత్ రెడ్డి చెప్పారు. గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అని, ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా అల్లా దువా ఉండాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.


ఇవీ చదవండి:

అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు

మెడికల్‌ పీజీ సీట్ల భర్తీపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన యాజమాన్యాలు

Updated Date - Mar 20 , 2026 | 07:18 PM