Share News

త్వరలో శుభవార్త!

ABN , Publish Date - Jun 06 , 2026 | 04:28 AM

బచావత్‌ ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయిస్తే.. అందులో తెలంగాణకు 299 టీఎంసీలు చాలంటూ కేసీఆర్‌ రాసిన మరణ శాసనం సంక్లిష్టంగా మారింది. దానిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం.

త్వరలో శుభవార్త!

  • ప్రాజెక్టులపై ఏపీతో చర్చల్లో సత్ఫలితాలు రాబోతున్నాయి

  • కేసీఆర్‌ రాసిన మరణ శాసనాన్ని తొలగించబోతున్నాం

  • పాలమూరు-రంగారెడ్డి, డిండి పథకాలకు నికర జలాలకు

  • సమ్మతి తెలిపి, ఎన్వోసీ ఇస్తేనే తదుపరి చర్చలుంటాయ్‌

  • న్యాయమైన వాటా నుంచి చుక్క నీటిని కూడా వదులుకోం

  • జల వివాదాల పరిష్కారానికి చివరి దాకా ప్రయత్నిస్తా

  • పాలమూరు పంపులు, లిఫ్టులతో కేసీఆర్‌ ఇంట్లో కనక వర్షం

  • గతంలో భారీగా అప్పులు.. ఇప్పుడు అవసరమైనా తేలేని స్థితి

  • రెండేళ్లలో పాలమూరులో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం

  • పాలమూరు ప్రాజెక్టుల పరిశీలన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి

  • మోదీతో రాజీనామా చేయిస్తే రాహుల్‌ను ప్రధాని చేసుకుంటామని వ్యాఖ్య

హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): ‘‘బచావత్‌ ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయిస్తే.. అందులో తెలంగాణకు 299 టీఎంసీలు చాలంటూ కేసీఆర్‌ రాసిన మరణ శాసనం సంక్లిష్టంగా మారింది. దానిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రాజెక్టులపై పక్క రాష్ట్రంతో చర్చలు జరుగుతున్నాయి. సత్ఫలితాలు రాబోతున్నాయి. త్వరలో మంచి వార్తలు వినిపించ బోతున్నాం. 90 టీఎంసీల పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, 20 టీఎంసీల డిండి ఎత్తిపోతల పథకానికి నికర జలాలు ఇవ్వడానికి సమ్మతి తెలిపి.. ఎన్‌వోసీ ఇస్తేనే తదుపరి చర్చలు ఉంటాయి’’ అని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయమైన వాటా నుంచి ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం కరివెన రిజర్వాయర్‌ వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి ఆయన మాట్లాడారు. గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయని, ఆ మేరకు ప్రాజెక్టులు కట్టుకోవడానికి అనుమతులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ‘‘తెలంగాణ లో ప్రాజెక్టులు కట్టుకొని వాడుకున్న తర్వాత మిగిలిన నీళ్లు తీసుకొని పోతారా..? గోదావరి నుంచి బనకచర్లలో పోసుకుంటారా..? అది మన సమస్య కాదు. పక్కింట్లో కోడి కూర వాసన వస్తోందని ఆ ఇంట్లో బురదపోయం. కేసీఆర్‌లాగా చిల్లర మాటలు.. తొడలు గొట్టుడు.. మరచిపోవడం మాకు అలవాటు లేదు. మతి తప్పిన మాటలు మాట్లాడబోం. జల వివాదాలు పరిష్కరించుకోవడం కేసీఆర్‌కు ఇష్టం లేదు. పంచాయితీ కావాలా..? పరిష్కారం కావాలా అని నన్నడిగితే పరిష్కారం కోరుకుంటా. చర్చల ద్వారా సమస్యలన్నీ పరిష్కరిస్తాం. అందుకు చివరి నిమిషం దాకా ప్రయత్నిస్తాం’’ అని వివరించారు. కృష్ణా జలాల వివాదం 60 ఏళ్లుగా రావణకాష్టంలా రగులుతోందని, ఈ సమస్య పరిష్కరించుకొని నీటి వాటాలు సాధిద్దామంటే కేసీఆర్‌ అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్‌ ఆరోపించారు. ‘‘జలవివాదాల పరిష్కారం కోసం పక్క రాష్ట్రంతో చర్చలు జరుపుతుంటే బురద చల్లడానికి రెడీగా ఉంటారు. బురద చల్లినా, అడ్డుపడినా పక్క రాష్ట్రంతో చర్చలు జరిపి పాలమూరుకు 90 టీఎంసీలు, డిండికి 20-30 టీఎంసీలు నీటి వాటా సాధిస్తా’’ అని స్పష్టం చేశారు.

7.jpg


ఖర్చు పెట్టిన 27 వేల కోట్లూ పంపులు, మోటార్లకే

జిల్లా ప్రజలు అందించిన సహకారానికి కృతజ్ఞతగా కేసీఆర్‌ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేస్తారని ఆశించామని, అధికారంలో ఉన్న పదేళ్లలో ప్రాజెక్టులపై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. ఇందులో లక్ష కోట్లు ఒక్క కాళేశ్వరంపైనే పెట్టారని సీఎం రేవంత్‌ రెడ్డి తప్పుబట్టారు. పాలమూరు-రంగారెడ్డి పథకానికి రూ.27 వేల కోట్లు వెచ్చించినా.. పంపులు, లిఫ్టుల్లోనే ఆ డబ్బులను ఖర్చు పెట్టారని తెలిపారు. కేసీఆర్‌ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కాబట్టే పంపులు, లిఫ్టులకే పెట్టారని ఆరోపించారు. ‘‘ఎలక్ట్రికల్ మెకానిక్ కాంపోనెంట్‌లో నిధులు వెచ్చిస్తే 20, 30 శాతం మామూళ్లు వస్తాయి. అందుకే సివిల్‌ వర్కులకు నిధులు ఇవ్వలేదు. ఉన్నదంతా దోచుకొని పోయారు. పంపులు, లిఫ్టులకు వేల కోట్లు బిల్లులు చెల్లించి.. కోట్లు కొట్టేశారు. జూరాల మినహా జిల్లాలో అన్ని ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ అవినీతిపై నాగం జనార్దన్‌ రెడ్డి సుప్రీంకోర్టు దాకా వెళ్లి కొట్లాడారు’’ అని వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 26 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేవని తెలిపారు. పాలమూరు నిర్మాణ అంచనా వ్యయం రూ.57 వేల కోట్లలో రూ.27 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే.. 90 శాతం పనులు పూర్తయినట్లు ఎలా అవుతుందని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన 30 నెలల్లో అసలు కింద రూ.33 వేల కోట్లు, వడ్డీ కింద రూ.18,554 కోట్లు.. వెరసి పాపాల భైరవుడు అందించిన అప్పులకు రూ.52,121 కోట్లు తాము కట్టామని, ప్రాజెక్టుల నిర్మాణ పనులకు రూ.22 వేల కోట్లు చెల్లిస్తే.. అందులో రూ.8 వేల కోట్లను పాలమూరు-రంగారెడ్డి పథకానికే వెచ్చించామని ప్రకటించారు. గతంలో విపరీతమైన అప్పులు తేవడం వల్ల.. నిజంగా అవసరమున్నా అప్పులు తె చ్చుకునే పరిస్థితి లేకుండాపోయిందని వ్యాఖ్యానించారు. ‘‘కేసీఆర్‌ అంటే నీళ్లు.. నీళ్ల్లంటే కేసీఆర్‌ కాదు. సారా అంటే కేసీఆర్‌. ఆయన చేసిందంతా పేరు, ఊరు, అంచనాలు మార్చడం తప్ప సొంతంగా ఏ ప్రాజెక్టునూ చేపట్టలేదు’’ అని విమర్శించారు.


రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టుల పనులన్నీ పూర్తి

రాబోయే రెండేళ్లలో జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణ పనులన్నీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్‌ ప్రకటించారు. రాబోయే రోజుల్లో వేగంగా భూసేకరణ పనులు చేస్తామని, ఇందుకు సహకరించాలని కోరారు. తక్కువ భూసేకరణతో నీళ్లు ఎక్కువగా నిల్వ చేసే ప్రాజెక్టులు కడతామన్నారు. కృష్ణా, బీమా నదులపై చిన్న చిన్న బ్రిడ్జి కమ్‌ బ్యారేజీలు కడతామని, కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో నీటి నిల్వకు బ్యారేజీలు కట్టుకోనున్నామని వెల్లడించారు. కర్ణాటకలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉందని, సంయుక్తంగా ప్రాజెక్టులు కట్టుకుంటామని తెలిపారు. ఉదండాపూర్‌ దాకా పనులను 2027 జూన్‌కల్లా పూర్తిచేస్తామని ప్రకటించారు. అక్కడి నుంచి లక్ష్మిదేవిపల్లికి నీటిని తరలించే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

నేడు బెంగుళూరుకు సీఎం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం బెంగుళూరుకు వెళ్లనున్నారు. ఓ మీడియా సంస్థ నిర్వహించే కాన్‌క్లేవ్‌ లో పాల్గొంటారని తెలిసింది. సాయంత్రానికి తిరిగి హైదరాబాద్‌ చేరుకుని, కోహెడ మార్కెట్‌ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతారు. కాగా, ఈనెల 10న ఫ్యూచర్‌సిటీ డెవల్‌పమెంట్‌ అథారిటీ కోసం నిర్మించిన ‘ఎఫ్‌సీడీఏ’ భవనాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది.


మోదీతో రాజీనామా చేయిస్తే రాహుల్‌ను ప్రధాని చేసుకుంటా

‘‘ఇచ్చిన హామీలు అమలు చేయనందువల్ల ప్రధాని మోదీతో రాజీనామా చేయించండి. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసి, అన్ని హామీలు అమలు చేసుకుంటా. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇప్పించుకుంటా. రాష్ట్రంలో 71 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొంటే.. రూ.6-7 వేల కోట్ల అదనపు భారం పడింది. దీనిని భారంగా చూడటం లేదు. కేంద్రం సేకరించగా మిగిలిన ధాన్యాన్ని మీరు కొంటారా!?’’ అని బీజేపీ నేతలను సీఎం రేవంత్‌ ప్రశ్నించారు. మక్కలు ఒక్క గింజ అయినా కొన్నారా అని నిలదీశారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలున్నారని, రామగుండం యూరియా తెలంగాణకే ఇవ్వాలని అడిగే ధైర్యం కూడా లేదని విమర్శించారు.

పరీక్షలన్నీ అయ్యాకే కాళేశ్వరం పునరుద్ధరణ

జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎస్ఏ) నివేదిక ప్రకారం కాళేశ్వరం బ్యారేజీల్లో పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత, పునరుద్ధరణకు డిజైన్లు చేయించిన తర్వాతే మరమ్మతులు చేస్తామని సీఎం రేవంత్‌ తెలిపారు. కేసీఆర్‌ ఉరికిండనో... హరీశ్‌ రావు అరిచిండనో పనులు చేయబోమని స్పష్టం చేశారు. మహారాష్ట్రతో చర్చలు జరిపే ప్రక్రియను చేపడతామని, ఈ విషయంలో మహారాష్ట్ర సీఎం తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపించారు.

నాపై ఒక్క ఆరోపణ కూడా లేదు

‘‘నా చిత్తశుద్ధి జిల్లా ప్రజలకు తెలుసు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేస్తా. వాళ్ల లెక్క కమీషన్లు, కాంట్రాక్టర్ల కోసం పనిచేయను. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో నాపై ఏ చిన్న ఆరోపణ అయినా వచ్చిందా!? 20 ఏళ్లలో ఏనాడైనా లాలూచీ పడింది చూశారా...?’’ అని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు. చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తానని, దానిని బీఆర్‌ఎస్‌ కోసం చాటి చెప్పనని అన్నారు.

Updated Date - Jun 06 , 2026 | 04:28 AM