పెద్ద తిమింగలాల గుండెల్లో వణుకు పుట్టించడానికే.. హైడ్రా: సీఎం రేవంత్
ABN , Publish Date - Jun 07 , 2026 | 05:45 AM
జల వనరులను ఆక్రమించే పెద్ద తిమింగలాల గుండెల్లో వణుకు పుట్టించడానికే ‘హైడ్రా’ను ఏర్పాటు చేశామని, హిట్లర్ స్ఫూర్తితోనే ఆ పేరు పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఇప్పుడు చెరువులు ఆక్రమించే ధైర్యం ఎవరూ చేయట్లే
రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ బడులను 4 వేలకు కుదిస్తాం
విద్యార్థుల ఇంటికే బస్సు, ట్యూషన్ సౌకర్యం కూడా..
నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలతో ప్రీస్కూళ్లు.. పోషకాహారం
త్వరలోనే 5 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
అవినీతి, లీకేజీలను అరికట్టడంతో జీఎస్టీ రాబడి పెరిగింది
బెంగళూరులో ద హిందూ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): జల వనరులను ఆక్రమించే పెద్ద తిమింగలాల గుండెల్లో వణుకు పుట్టించడానికే ‘హైడ్రా’ను ఏర్పాటు చేశామని, హిట్లర్ స్ఫూర్తితోనే ఆ పేరు పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సీనియర్ ఐపీఎస్ నేతృత్వంలోని హైడ్రా కారణంగా ఇప్పుడు చెరువులను ఆక్రమించే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారన్నారు. బెంగళూరు వేదికగా శనివారం ‘ద హిందూ’ పత్రిక నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ‘ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క తెలంగాణలో సుపరిపాలన’ అనే అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ‘ద హిందూ’ గ్రూపు సంస్థల డైరెక్టర్ ఎన్.రామ్ ‘‘మీరు హైదరాబాద్‌లో చెరువుల రక్షణ, ఆక్రమణల తొలగింపు కోసం ’హైడ్రా‘ ద్వారా చాలా వేగంగా, దూకుడుగా చర్యలు తీసుకుంటున్నారు. అసలు ఈ ‘హైడ్రా’ అనే పేరు వెనుక ఉన్న ఆలోచన ఏమిటి? ఎక్కడ నుండి వచ్చింది?’’ అని ప్రశ్నించారు. ఇందుకు రేవంత్ రెడ్డి వివరణాత్మకంగా సంచలన సమాధానం ఇచ్చారు. ‘‘పేద ప్రజలు చెరువులు, నాలాలు ఆక్రమించారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, ఇటీవలి కాలంలో ధనవంతులు తమ వైభవం కోసం, ఫామ్‌హౌస్‌ల కోసం నీటి వనరులను ఆక్రమిస్తున్నారు. వారి డ్రైనేజీ కనెక్షన్లను నేరుగా చెరువుల్లోకి వదిలేస్తున్నారు. నేను వాటన్నింటినీ గమనించాను. అందుకే ఓ బలమైన టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాను. అలా హైడ్రా తీసుకొచ్చాను. అసలు హైడ్రా అనే పదం హిట్లర్‌కు చాలా ఇష్టమైన పదం. ఎవరినైనా మట్టుబెట్టగల తన కీలక బృందాన్ని ఆయన హైడ్రా అని పిలిచేవారు. నేను హిట్లర్ స్ఫూర్తితోనే ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో హైడ్రాను ఏర్పాటు చేశాను. 3000 మంది రిటైర్డు ఆర్మీ ఉద్యోగులు, ఇతర సిబ్బందిని టాస్క్‌ఫోర్స్‌లో చేర్చాను. ఈరోజు తెలంగాణలో కానీ, హైదరాబాద్‌లో కానీ ఒక్క చెరువును ఆక్రమించడానికి ఎవరైనా ధైర్యం చేస్తున్నారేమో ఎవరినైనా అడగండి. నేను అంతలా కూల్చివేతలు చేపట్టాను. కావాలంటే గూగుల్ చేసి చూడండి’’ అని వ్యాఖ్యానించారు. ఇతర మహా నగరాల్లో అక్కడి పర్యావరణ పరిస్థితులను బట్టి సొంత ఆక్రమణల నిరోధక మోడల్స్ అవసరమని అభిప్రాయపడ్డారు. యువతను పాడు చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించడానికి దేశంలోనే అత్యుత్తమమైన ‘ఈగల్ ఫోర్స్’ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.
27 వేల ప్రభుత్వ బడులు.. 4 వేలకు కుదింపు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదించనున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ‘‘గతంలో రవాణా సౌకర్యం లేనప్పుడు తండాల్లో, గ్రామాల్లో బడులు ఏర్పాటు చేశారు. వాటిలో ఇప్పుడు ఒకరిద్దరు విద్యార్థులు మాత్రమే ఉంటున్నారు. అనేక చోట్ల సింగిల్ టీచర్ బడులున్నాయి. 1-5 తరగతుల్లో కేవలం పది మంది మాత్రమే విద్యార్థులుంటే ఉపాధ్యాయులు ఎలా బోధిస్తారు? హేతుబద్ధీకరణలో భాగంగా ఇలాంటి బడులను తగ్గించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించా. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను అభివృద్ధి చేస్తున్నాం. విద్యార్థుల ఇంటికి స్కూల్ బస్సు పంపిస్తాం. ఉచితంగా పికప్, డ్రాప్ సౌకర్యం కల్పిస్తాం. చదువులో వెనకబడిన విద్యార్థులకు సాయంత్రం బడిలోనే ట్యూషన్ సౌకర్యం కల్పించనున్నాం’’ అని వివరించారు. ఇందుకు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో (సీఎస్ఆర్) భాగంగా సహకరించాలని ఇప్పటికే పలు కార్పొరేట్ కంపెనీలతో చర్చలు జరిపామని, దీనిద్వారా ఈ విద్యా సంవత్సరంలో లక్ష మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ‘‘ప్రభుత్వ బడుల్లో పీహెచ్‌డీ చదివిన ఉన్నత విద్యావంతులు ఉపాధ్యాయులుగా ఉన్నారు. అయినా, సర్కారు బడులకు పిల్లలు ఆసక్తి చూపించడం లేదు. ఈ సమస్యను విశ్లేషించి.. ప్రీ స్కూల్స్ విధానాన్ని అమలు చేస్తున్నాం. ఇందులో నర్సరీ, యూకేజీ, ఎల్‌కేజీ నుంచి తరగతులు ఉంటాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్‌తో పోషకాహారం అందిస్తున్నాం’’ అని తెలిపారు.
త్వరలో 5 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలు ఉద్యోగాల కోసమే జరిగాయని, రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. కేసీఆర్ ఆ సమస్యను పరిష్కరించలేదని సీఎం రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం టీఎ్‌సపీఎస్సీని పునరావాస కేంద్రంగా మార్చిందని విమర్శించారు. ఒక ఆర్‌ఎంపీ డాక్టర్‌ను కమిషన్ సభ్యుడిగా పెట్టి గ్రూప్-1 అభ్యర్థులు, ఇంజనీర్లు, డాక్టర్లను ఇంటర్వ్యూ చేయించిన ఘనత కేసీఆర్‌దని ఎద్దేవా చేశారు. తాను సీఎం అయ్యాక యూపీఎస్సీ విధానాలను అధ్యయనం చేసి, కేవలం 15 నెలల్లోనే దేశంలోనే అత్యధికంగా 67,760 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. త్వరలోనే 5 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ‘‘మా యువత ఇప్పుడు ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో వైట్ కాలర్ ఉద్యోగాలు పోతున్న నేపథ్యంలో, బ్లూ కాలర్ ఉద్యోగాల సృష్టికే ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ ఏర్పాటు చేశాం. టాటా కంపెనీతో రూ.2400 కోట్ల ఒప్పందంతో ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చాం. తెలంగాణలో ఇప్పుడు ఒకే ఒక్క అంబాసిడర్ కారు ఉంది. అది కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉంది. వాళ్ల ఎన్నికల గుర్తు.. అంబాసిడర్ కారు. దాన్ని రిపేర్ చేయాలన్నా అక్కడికే వెళ్లాలి’’ అని వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.
ఆదాయం దక్షిణాదిది.. ఆధిపత్యం వాళ్లదా!?
‘‘దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి పన్నుల రూపంలో ఇచ్చేది ఎక్కువ.. తిరిగి పొందేది తక్కువ. కానీ, ప్రస్తుతం రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, హోం మంత్రి... అంతా ఉత్తరాది వారే ఉన్నారు. మేం పన్నులు కట్టి ఢిల్లీకి సలాం కొట్టాలా? మేం సెకండ్ గ్రేడ్ సిటిజన్స్‌గా బతకలేం’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ల పేరుతో రాజకీయ గిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ సీట్ల పెంపు (డీలిమిటేషన్)ను మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపెట్టడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. కేంద్రం చెప్పినట్లు పార్లమెంట్ సీట్లు పెంచితే.. జనాభా నియంత్రణ పాటించిన కేరళ వంటి రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు 20 నుంచి 30కి మాత్రమే పెరుగుతాయని, అదే జనాభా పెరిగిన ఉత్తరప్రదేశ్‌లో 80 నుంచి 120 సీట్లకు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం సరైంది కాదని, కష్టపడి పనిచేసే దక్షిణాది రాష్ట్రాలను శిక్షించవద్దని కోరారు. కేంద్రానికి నిజంగా మహిళలపై చిత్తశుద్ధి ఉంటే.. రాబోయే 2027 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసి చూపించాలని సవాల్ విసిరారు. పెట్టుబడుల విషయంలోనూ కేంద్రం వివక్ష చూపుతోందని, తమ వద్దకు వచ్చే పెట్టుబడులను గుజరాత్‌కు తరలించేలా ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. అక్కడికి పెట్టుబడులు సహజంగా రావడం లేదని, బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు.
నేను ప్రజలకు సేవకుడిని..
గత పాలకులు తమను తాము రాజులుగా భావించారని, తాను మాత్రం ప్రజలకు సేవ చేసే సేవకుడిగానే భావిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జూలై నాలుగో తేదీకి తాను ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తవుతాయని, ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానని, కష్టపడే తత్వమే తన పెట్టుబడి అని తెలిపారు.
మీడియా నా బ్యాక్ ఆఫీస్.. భయం లేదు!
పరిపాలనలో కామన్ సెన్స్ అతి ముఖ్యమని, బ్యూరోక్రాట్ల మైండ్ సెట్‌ను తాను సులభంగా అర్థం చేసుకోగలనని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతి 10 రోజులకోసారి ప్రెస్‌మీట్ పెట్టి కేసీఆర్ అనుకూల మీడియా సహా అందరి ప్రశ్నలకు సమాధానమిస్తానన్నారు. వ్యతిరేక వార్తలపై స్పందిస్తూ.. ‘‘నేను జర్నలిస్టులను దూషించను. వ్యంగ్యంగా సమాధానమిస్తా. నెగెటివ్ వార్తల్లో నిజముంటే అధికారులతో మాట్లాడి సరిదిద్దుకుంటా. మీడియాను నా బ్యాక్ ఆఫీస్ సమాచారంగా భావిస్తాను. నెగెటివ్ వార్తలన్నా భయం లేదు’’ అని చెప్పారు. తనకు ఏఐ అంటే భయం లేదని, ఎందుకంటే, అది రాజకీయ నాయకుడి స్థానాన్ని భర్తీ చేయలేదని వ్యాఖ్యానించారు.
రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా..
‘‘గతంలో మహారాష్ట్ర తర్వాత తెలంగాణలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగేవి.. కారణం అప్పులు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రూ.20,616 కోట్ల రుణాలను మాఫీ చేసి 25,035 రైతు కుటుంబాలను ఆదుకున్నాం. అందుకే, 2024-25లో తెలంగాణలో రైతు ఆత్మహత్యలు లేవని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌సీఆర్‌బీ నివేదించింది’’ అని సీఎం రేవంత్ వివరించారు. కేంద్రం మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకొంటున్నా.. తాము మాత్రం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని, రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నామని వివరించారు.
జీఎస్టీ ఆదాయం అదుర్స్
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జీఎస్టీ ఆదాయం పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘అరవింద్ సుబ్రమణ్యం సలహాలతో, పన్నులు పెంచకుండా కేవలం అవినీతి, లీకేజీలను అరికట్టడం ద్వారా గతంలో రూ.3,500 కోట్లుగా ఉన్న నెలవారీ జీఎస్టీ రాబడిని ఇప్పుడు రూ.4,000 కోట్లు దాటించాం. ఆరు నెలల్లోనే రూ.5,000 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది’’ అని వెల్లడించారు. గత ప్రభుత్వం 11 నుంచి 11.5 శాతం భారీ వడ్డీలకు తెచ్చిన రూ.2 లక్షల కోట్ల స్వల్పకాలిక అప్పులను, తాము 7-8 శాతం తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలుగా పునర్‌వ్యవస్థీకరిస్తున్నామని చెప్పారు.
నా నినాదం చైనా+1
‘‘మేం పొరుగు రాష్ట్రాలతో పోటీ పడడం లేదు. ప్రపంచంతో పోటీ పడుతున్నాం. ఎందుకు పొరుగు రాష్ట్రాలతో పోటీ పడాలి!? మేం చైనా, జపాన్, సౌత్ కొరియా, జర్మనీతో పోటీ పడుతున్నాం. మేం వాళ్లతోనే పోటీ పడతాం. నా నినాదం ‘చైనా+1’. నేను 15 ఏళ్ల క్రితమే చైనా వెళ్లా. ఉత్తమ పద్ధతులను నేర్చుకోవడానికి త్వరలోనే చైనా పర్యటిస్తా. నేర్చుకోవడానికి నాకు ఎలాంటి అహం లేదు. సాగునీటి ప్రాజెక్టు వద్ద అసిస్టెంట్ ఇంజినీర్ నుంచైనా నేర్చుకుంటా’’ అని స్పష్టం చేశారు. 2034 నాటికి ట్రిలియన్ డాలర్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా ‘తెలంగాణ రైజింగ్’ ప్రణాళికను సిద్ధం చేశామని, రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఏటా రూ.2000 కోట్ల ఆదాయం నష్టపోతున్నా ఈవీ వాహనాలపై ట్యాక్స్ రద్దు చేశామన్నారు. తెలంగాణకు ఓడరేవు సౌకర్యం కోసం ఏపీ సీఎం చంద్రబాబు, పీఎం మోదీతో మాట్లాడి 12 వరుసల రహదారితో మచిలీపట్నం పోర్టును అనుసంధానిస్తున్నామని, రోడ్లు, రైలు, ఓడరేవు, విమానాశ్రయంతో అనుసంధానించడమే తమ వృద్ధికి కారణమవుతుందని తెలిపారు.