Share News

నేటి నుంచి అసెంబ్లీ

ABN , Publish Date - Mar 16 , 2026 | 04:13 AM

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.45 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ప్రసంగిస్తారు.

నేటి నుంచి అసెంబ్లీ

  • గవర్నర్‌ ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

  • గవర్నర్‌, సీఎం చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

  • తర్వాత బీఏసీ భేటీ.. 20న భట్టి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం

  • 6 గ్యారెంటీలకు చట్టబద్ధతపై ప్రైవేటు మెంబర్‌ బిల్లు: కేటీఆర్‌

  • మూసీ అభివృద్ధిపై చర్చ పెడతామన్న సీఎం.. డ్రగ్స్‌ కట్టడి అంశమూ చర్చకు వచ్చే అవకాశం

  • నేడు సీఎల్పీ సమావేశం

హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.45 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ప్రసంగిస్తారు. ప్రసంగానికి ముందు.. అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం పక్కన ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్‌ శుక్లా ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి, శాసనసభ స్పీకర్‌, మండలి చైర్మన్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. గవర్నర్‌ ప్రసంగం ముగిసిన తర్వాత సభ మంగళవారానికి వాయిదా పడనుంది. ఆ తర్వాత స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన శాసనసభ బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) భేటీ అవుతుంది. బడ్జెట్‌ సమావేశాలకు సంబంధించిన అజెండా ఈ సమావేశంలో ఖరారు కానుంది. మంగళ, బుధ వారాల్లో.. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైన చర్చ, సమాధానం ఉంటాయి. 19న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని విరామం ఇవ్వనున్నారు. ఆ తర్వాత రోజు.. అంటే 20న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది. అయితే రంజాన్‌ పండుగ ఏరోజు వస్తుందన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల 31లోపు బడ్జెట్‌పైన, శాఖల పద్దులపైన చర్చలను పూర్తి చేసి ద్రవ్య వినిమయ బిల్లునూ ప్రభుత్వం ఆమోదించుకోనుంది. ఆ తర్వాత సమావేశాలను కొనసాగించాలా లేక ముగించాలా అన్నది బీఏసీ భేటీలో నిర్ణయించనున్నారు. కాగా.. ఈ బడ్జెట్‌ సమావేశాలకు మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. శాసనమండలి బడ్జెట్‌ సమావేశాలు పునరుద్ధరించిన శాసనమండలి హాల్లో జరగనున్నాయి. ఇటీవలే ఈ హాల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా.. బడ్జెట్‌ సమావేశాలకు గవర్నర్‌ శుక్లాను రాష్ట్రప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి ఆహ్వానించారు.


వాడీవేడిగా సమావేశాలు

పలు అంశాలపై చర్చకు అధికార, ప్రతిపక్షాలు అస్త్ర, శస్త్రాలతో సిద్ధమవుతున్న నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. ముఖ్యం గా ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధతపైన ప్రైవేటు మెంబర్‌ బిల్లు పెడతామంటూ ఇటీవల బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని బీజేఎల్పీ భేటీ కూడా నిర్ణయించింది. ఇలా ఒకే అంశంపైబీఆర్‌ఎస్‌, బీజేపీలు శాసనసభ వేదికగా సర్కారును నిలదీయనుండటం ఆసక్తికరంగా మారింది. అయితే కౌంటర్‌గా.. బీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలను.. పదేళ్ల పాలనలో అవి ఏ మేరకు అమలయ్యాయన్నదానిపైన.. ఆ ఆ పార్టీని నిలదీసేందుకు అధికార కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. ఇదే వేదికగా.. మోదీ ఎన్నికల హామీల అమలుపైనా ప్రశ్నించే అవకాశం ఉందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీటితోపాటు.. పలు ప్రజా సమస్యలు, రైతులు, ఉద్యోగుల సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీ సిద్ధమవుతున్నాయి. ఆయా అంశాలపై సమాధానం ఇచ్చేందుకు అధికార పక్షం కూడా సమాయత్తమవుతోంది. ఇక.. మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌‌పై ఈగల్‌ టీమ్‌ దాడి, మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డితో పాటు పలువురు డ్రగ్స్‌ తీసుకున్నట్లుగా తేలిన నేపథ్యంలో రాష్ట్రంలో డ్రగ్స్‌ కట్టడిపైనా చర్చ చేపట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ పార్టీని ఇరుకున పెట్టేందుకు వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చే ఆస్కారం ఉందంటున్నారు. ఇక మూసీ అభివృద్ధి ప్రణాళికపైనా శాసనసభలో చర్చ పెట్టి విపక్షాల అభిప్రాయాలను తీసుకుంటామని సీఎం రేవంత్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రణాళికను తప్పుపడుతూ కేటీఆర్‌ ఇప్పటికే ఒక ప్రజెంటేషన్‌ ఇచ్చారు. బీజేపీ సైతం ఈ ప్రాజెక్టును తప్పుపడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మూసీ అభివృద్ధి ప్రణాళికపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడిగా చర్చ జరిగే ఆస్కారం ఉంది.


వ్యూహ రచనకు భేటీ..

అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను నిర్ణయించుకునేందుకు.. సీఎం రేవంత్‌ అధ్యక్షతన కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్షం సోమవారం భేటీ కానుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే ఈ సమావేశంలో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ ఘటన నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం ఆత్మరక్షణలో పడిందని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. అలాగే రైతుబంధు నిధులను విడుదల చేయనున్న నేపథ్యంలో వివిధ అంశాలకు సంబంధించి.. బీఆర్‌ఎస్‌‌పై ఎదురుదాడికి దిగాలనే వ్యూహాన్నే అనుసరించాలన్న భావనలో ఉంది. కాగా.. సమావేశాల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై ఆదివారం అసెంబ్లీ భవనంలోని కమిటీ హాల్‌లో సమీక్షాసమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అధ్యక్షత వహించారు. సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులూ సమన్వయంతో పనిచేయాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ సూచించారు. ఈసారి నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు ఒకే ప్రాంగణంలో జరుగుతున్నందున అదనపు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు తక్షణమే సమాధానాలు పంపాలని అధికారులను, సమావేశాల సమయంలో ధర్నాలు, ‘చలో అసెంబ్లీ’ వంటి కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన కోరారు. సభలు సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారం అందిస్తామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. శాఖల మధ్య సమన్వయం కోసం ప్రతి శాఖ నుంచీ ప్రత్యేక అధికారిని నియమిస్తామని వెల్లడించారు.

కీలక బిల్లులకూ ఆమోదం..!

జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన ప్రభుత్వం. దీనికి సంబంధించిన బిల్లును ఈ సమావేశాల్లోనే ఆమోదించనునన్నట్లు తెలుస్తోంది. అలాగే ముగ్గురు పిల్లలు ఉన్నా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించేలా పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన బిల్లును ఈ సమావేశాల్లోనే పెట్టి ఆమోదించనున్నట్లు చెబుతున్నారు. తల్లి దండ్రులను ప్రభుత్వ ఉద్యోగులు సరిగా చూసుకోకుంటే వారి వేతనాల నుంచి 10-15 శాతం మేర నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసే ఉద్దేశంతో రూపొందించిన బిల్లును ఈ సమావేశాల్లోనే ఆమోదించనున్నట్లు చెబుతున్నారు. ఫామ్‌ హౌస్‌ యాక్టుపైనా ఈ సమావేశాల్లోనే చర్చించనున్నారు.

Updated Date - Mar 16 , 2026 | 04:13 AM