Rajya Sabha MPs: తెలుగు రాష్ట్రాల నుంచి రిటైరవుతున్న పలువురు ఎంపీలు
ABN , Publish Date - Jan 09 , 2026 | 09:34 PM
తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు రాజ్యసభ సభ్యుల పదవి కాలం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. అందుకు సంబంధించిన బులెటిన్‌ను రాజ్యసభ సెక్రటరీ జనరల్ కార్యాలయం విడుదల చేసింది.
హైదరాబాద్, జనవరి 09: తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దల సభకు వెళ్లిన పలువురు ఎంపీలు ఈ ఏడాది రిటైర్ కానున్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపికైన బీఆర్ఎస్ నేత కె.ఆర్. సురేష్ రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిన ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ రిటైర్ కానున్నారు. ఏప్రిల్ 9వ తేదీతో వీరిద్దరి రాజ్యసభ సభ్యత్వ పదవి కాలం ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన నలుగురు రాజ్యసభ సభ్యుల పదవి కాలం.. ఈ ఏడాది జూన్‌తో ముగియనుంది. ఆ జాబితాలో వైసీపీ ఎంపీ ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డితోపాటు పరిమళ నత్వానీ ఉన్నారు. అలాగే వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌తోపాటు టీడీపీ ఎంపీ సానా సతీష్ పదవి కాలం సైతం జూన్‌తో ముగియనుంది.
శుక్రవారం దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీ రిటైర్‌మ్మెంట్ జాబితాతో కూడిన బులెటిన్‌ను రాజ్యసభ సెక్రటరీ జనరల్ కార్యాలయం విడుదల చేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. అనంతరం ఆ పార్టీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డిలతోపాటు రిలయన్స్ సంస్థకు చెందిన పరిమిళ నత్వానీలను వైసీపీ కోటాలో రాజ్యసభకు పంపింది. అలాగే బీద మస్తాన్ రావును కూడా పంపింది.
అయితే 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు వైసీపీకి రాజీనామా చేశారు. అనంతరం వారు టీడీపీలో చేరారు. దాంతో బీద మస్తాన్ రావుతోపాటు సానా సతీష్ ను రాజ్యసభకు టీడీపీ పంపింది. కానీ సానా సతీష్ పదవి కాలం కొద్ది రోజుల్లోనే ముగియనుంది. మరోవైపు తెలంగాణలో ఖాళీ కానున్న ఎంపీ స్థానం నుంచి మరోకరిని రాజ్యసభకు బీఆర్ఎస్ పంపనుంది.
అలాగే అభిషేక్ మను సింఘ్వీకి మరోసారి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాదిగా ఆయన ఉన్నారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టులు, వివిధ సమస్యలపై ఆయన సుప్రీంకోర్టులో వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై మను సంఘ్వీతో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముంబై వెళ్లి మరీ చర్చించిన విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం
ఆమె కారణంగానే రాజకీయాల్లోకి వచ్చా: వెంకయ్యనాయుడు
For More AP News And Telugu News