ఫాంహౌస్ డ్రగ్స్ కేసుపైసిట్
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:43 AM
డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయి పంచాయితీ పేరిట ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనాలు సృష్టించింది.
సుధీర్‌బాబు నేతృత్వంలో 9 మందితో ఏర్పాటు
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక మలుపు
ఫాంహౌస్ సమావేశం అజెండా ఏమిటి?
పోలీసులపై కాల్పులు జరపాల్సిన అవసరమేమొచ్చింది?
ఎవరినైనా తప్పించే ప్రయత్నాలు జరిగాయా?
3 నెలల్లో దర్యాప్తు పూర్తికి డీజీపీ ఆదేశం
‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన దుబాయి కోణంపైనా దర్యాప్తు
హైదరాబాద్, మార్చి 17(ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయి పంచాయితీ పేరిట ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనాలు సృష్టించింది. పలువురు పెద్దల బినామీ కేదార్ దుబాయిలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం, ఆ సమయంలో అక్కడ ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొన్న బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కొందరు పెద్దల కోసం మొయినాబాద్‌లోని తన ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేసిన వైనంపై ఆంధ్రజ్యోతి సంచలన కథనాన్ని ప్రచురించింది. దీంతో, ఈ దుబాయి కోణం సహా కేసు మూలాలు వెలికి తీయడానికి ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్‌బాబు ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేసు దర్యాప్తును మూడు నెలల్లో పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలని డీజీపీ ఆదేశించారు. ఈ నేరం జరగడానికి దారి తీసిన పరిస్థితులు, డ్రగ్స్ పార్టీ మూలాలు, ఎవరెవరికి ఇందులో సంబంధాలున్నాయి? డ్రగ్స్ పార్టీకి వచ్చిన వారెవరైనా పోలీసుల రాకను గమనించి పారిపోయారా? పోలీసులను బెదిరించడానికి కాల్పులు జరపాల్సిన అవసరం ఏమిటి? కాల్పులు ఆపవద్దు ఏదైనా నేను చూసుకుంటానని పెద్దగా అరిచిందెవరు? రోహిత్‌రెడ్డికి ఆ పార్టీకి హజరైన ఇతర వ్యాపారులకు ఉన్న సంబంధాలేంటి? అనే అంశాలపై సిట్ అధికారులు ఆరా తీయనున్నారు. డ్రగ్స్ పార్టీని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఏర్పాటు చేసినపుడు ఎవరెవర్ని ఆహ్వానించారు? అనే విషయమై తేల్చుకోవడానికి అక్కడికి వచ్చిన వారి ఫోన్ చాట్‌లను సిట్ బృందం పరిశీలించనుంది. తుపాకీ కాల్పుల ద్వారా పోలీసులను కొద్ది నిమిషాలు నిలువరించిన క్రమంలో కొందరు పెద్దలు అక్కడి నుంచి పారిపోయారని సోషల్‌మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపైనా సిట్ అధికారులు దృష్టి సారించనున్నారు. న్యూఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అమిత్ శర్మ, పబ్స్ యజమాని అర్జున్‌రెడ్డి, డ్రగ్స్ తీసుకుని వచ్చిన బెంగళూరు న్యాయవాది కౌశిక్ రవిలతో రోహిత్‌రెడ్డికి, ఏపీకి చెందిన ఎంపీ మహేశ్‌కు ఉన్న సంబంధాలను సిట్ అధికారులు పరిశీలించనున్నారు. సిట్‌లో చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్, గ్రేహౌండ్స్ గ్రూపు కమాండర్ రవీందర్‌రెడ్డి, షాద్‌నగర్ డీసీపీ శిరీష, ఈగల్ టీం డీఎస్పీలు బుచ్చయ్య, హరీశ్‌చంద్రారెడ్డి, మొయినాబాద్ ఎస్‌హెచ్‌ఓ మల్లికార్జునరెడ్డి, మోకిలా ఎస్సై కోటేశ్వరరావు, శంషాబాద్ ఎస్‌వో సాదత్ అలీలు ఉన్నారు.