ఆర్‌ఎస్ ప్రవీణ్ భద్రతపై ప్రభుత్వ విప్ దయాకర్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 27 , 2026 | 08:51 PM
బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత అంశంపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని అన్నారు.
హైదరాబాద్, జూన్ 27: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భద్రతపై అనుమానాలు అవసరం లేదు అని అన్నారు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తన వ్యక్తిగత భద్రత విషయంలో అనవసర అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదన్నారు దయాకర్. ఆయన భద్రతకు సంబంధించి అవసరమైన నిర్ణయాలు పోలీసు శాఖ తీసుకుంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తన భద్రతను తగ్గించుకున్నారని దయాకర్ తెలిపారు. సీఎం కాన్వాయ్‌లో గతంలో ఉండే జామర్, అంబులెన్స్ వంటి వాహనాలు ప్రస్తుతం లేవని, మొత్తం మూడు వాహనాలతోనే ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్నారని చెప్పారు. అంతేకాకుండా, సీఎం ప్రయాణాలకు ప్రత్యేక ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
దేశంలో ప్రస్తుతం నక్సల్స్ ముప్పు లేదని కేంద్ర ప్రభుత్వమే ప్రకటిస్తోందని దయాకర్ గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత భద్రత అంశాన్ని ప్రస్తావిస్తున్నారని విమర్శించారు. ఒకవేళ తనకు అదనపు భద్రత అవసరమని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భావిస్తే, సంబంధిత పోలీసు శాఖకు అధికారికంగా విజ్ఞప్తి చేసుకోవచ్చని దయాకర్ సూచించారు. భద్రత కల్పించాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశాన్ని పూర్తిగా భద్రతా సంస్థలే అంచనా వేసి నిర్ణయం తీసుకుంటాయని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
ఫిఫా ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన కాబో వెర్డె
హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు యత్నం.. గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్ అరెస్ట్