గోవాను డ్రగ్స్ హబ్‌గా మార్చారు.. బీజేపీపై సీఎం రేవంత్ ఫైర్
ABN , Publish Date - Oct 11 , 2026 | 09:31 PM
గోవాలో బీజేపీ పాలనపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో భూములు మిగలవని, గోవాను డ్రగ్స్ హబ్‌గా మార్చారని ఆరోపించారు.
హైదరాబాద్, అక్టోబర్ 11: గోవాలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో భూములు మిగలవని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ పాలనలో గోవా సర్వనాశనమైందని, రాష్ట్రాన్ని డ్రగ్స్ హబ్‌గా మార్చారని ఆరోపించారు. యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో చాలామంది డ్రగ్స్ బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘నషాముక్త్ భారత్’ గురించి మాట్లాడుతున్నారని, అలాంటప్పుడు గోవాలో డ్రగ్స్ సమస్యను ఎందుకు అరికట్టడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు రవాణా అవుతున్న డ్రగ్స్ కూడా గోవా నుంచే వస్తున్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. యువత భవిష్యత్తును కాపాడాలంటే నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంతో పాటు మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గోవా భూములను కాపాడుకోవాలని, అక్కడి సహజ వనరులు, ప్రజల ప్రయోజనాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని అన్నారు.
బీజేపీకి విభజన రాజకీయాలు అలవాటుగా మారాయని రేవంత్‌రెడ్డి విమర్శించారు. గోవాలో ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ.. గతంలో ఒకసారి తప్పు జరిగిందని, మరోసారి కూడా జరిగిందని వ్యాఖ్యానించారు. 2027లో గోవాలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగం, డ్రగ్స్ సమస్యలు తొలగిపోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రజల భవిష్యత్తు, యువత ఉపాధి, రాష్ట్ర భూముల పరిరక్షణ కాంగ్రెస్ ప్రాధాన్యాలని తెలిపారు.
బీజేపీని రావణుడితో పోలుస్తూ.. ఆ పార్టీని ఓడించాలంటే రాముడి లాంటి కాంగ్రెస్ అవసరమని వ్యాఖ్యానించారు. గోవా ప్రజలు బీజేపీ పాలనను గమనించి, రాబోయే ఎన్నికల్లో మార్పు దిశగా నిర్ణయం తీసుకోవాలని రేవంత్‌రెడ్డి కోరారు. బీజేపీ పాలనపై విమర్శలు గుప్పిస్తూ, గోవాను డ్రగ్స్ సమస్య నుంచి బయటపడేసి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
లోక కల్యాణం కోసం నిత్య పెళ్లికొడుకుగా...
అధికమాసం...నవరాత్రి బ్రహ్మోత్సవాలివి...
Read Latest AP News And Telangana News