అసెంబ్లీకి వస్తే ఆధారాలతో సమాధానం చెప్పేవాడిని.. బీఆర్ఎస్‌పై రేవంత్ రెడ్డి ఫైర్
ABN , Publish Date - Oct 23 , 2026 | 08:40 PM
బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి వచ్చి ఉంటే వారి ఆరోపణలకు ఆధారాలతో సమాధానం చెప్పేవాడినని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్ల పాలనలో సహజ వనరుల దోపిడీ జరిగిందని ఆరోపించారు.
హైదరాబాద్, అక్టోబర్ 23: బీఆర్ఎస్ నేతలు నిజాలు చెబుతామని అంటూనే అసెంబ్లీకి రావడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. సభకు వచ్చి ఉంటే వారి ఆరోపణలకు ఆధారాలతో సమాధానం చెప్పేవాడినని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం తెలంగాణలోని సహజ వనరులను దోచుకుందని ఆరోపించారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తే.. ఆ ప్రయోజనాలను ప్రజలకు అందిస్తారని ఆశించామని, కానీ అందుకు భిన్నంగా జరిగిందని వ్యాఖ్యానించారు. యాదాద్రి నిర్మాణం వెనుక లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన సీఎం.. బీఆర్ఎస్ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. హరీశ్ రావు ఏపీ కాలేజీలకు పాలు అమ్ముతున్నారని, సంతోష్ విదేశీ మద్యం విక్రయిస్తున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు చెబుతున్న మాటల్లోని అసత్యాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఏర్పడాలని క్షుద్ర పూజలు చేసినవారు కూడా ఇప్పుడు నీతులు చెబుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. సంక్రాంతి తర్వాత నాయకులంతా నాలుగు నెలల పాటు గ్రామాల్లోనే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పట్టణాలను విడిచిపెట్టి గ్రామాలకు వెళ్లాలని..ఈ నాలుగు నెలల కాలంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధుల కదలికలను పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ చేతినిండా పని కల్పించడం.. ఎవరూ ఖాళీ కడుపుతో నిద్రపోకుండా చూడటం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజల మధ్య ఉండి పనిచేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో పెట్టుబడులే కాదు.. ఉత్పత్తి కూడా ప్రారంభించాలి: సీఎం చంద్రబాబు
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. వార్షిక పరీక్షల పూర్తి షెడ్యూల్ వివరాలివే...
భవానీ భక్తుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
Read Latest AP News And Telangana News And National News