మంత్రం వేయించుకోవడానికి వెళ్తూ అనంతలోకాలకు
ABN , Publish Date - Nov 23 , 2026 | 03:37 AM
వికారాబాద్ సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నొప్పి నివారణకు నాటు వైద్యునితో మంత్రం వేయించుకుందామని ఆటోలో బయలుదేరిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు రోడ్డు ప్రమాదానికి బలైపోయారు.
ఎదురెదురుగా వస్తున్న లారీ, ఆటో ఢీ
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు సహా నలుగురి మృతి..
వికారాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
వికారాబాద్, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): వికారాబాద్ సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నొప్పి నివారణకు నాటు వైద్యునితో మంత్రం వేయించుకుందామని ఆటోలో బయలుదేరిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు రోడ్డు ప్రమాదానికి బలైపోయారు. ఎదురుగా వస్తున్న లారీని ఆటో ఢీకొట్టిన ఘటనలో ఆటోడ్రైవర్‌తోపాటు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వికారాబాద్ జిల్లా పెండ్లిమడుగు గ్రామానికి చెందిన చంద్రమ్మ(55), ఇతర కుటుంబసభ్యులు ఎప్పట్లానే ఆదివారం ఉదయం నిద్రలేచారు. కుటుంబసభ్యులంతా ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. చంద్రమ్మ కాలు మీద నుంచి ఏదో పరుగు పాకగా ఆమె నొప్పితో బాధపడింది.
నాటు వైద్యునితో మంత్రం వేయిస్తే నొప్పి తగ్గిపోతుందనే నమ్మకంతో చంద్రమ్మ, ఆమె తల్లి పార్వతమ్మ(70), కోడలు సరిత(30) కలిసి గ్రామానికి చెందిన నాగేశ్(28) ఆటోలో కేరెళ్లికి బయలుదేరారు. ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో వికారాబాద్ సమీపంలోని రామలింగేశ్వరాలయం దాటిన తరువాత మొదటి ఘాట్ రోడ్డులోని ఓ మూల మలుపు వద్ద అదుపుతప్పిన వీరి ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జు అవ్వగా.. అందులోని నాగేశ్, చంద్రమ్మ, పార్వతమ్మ, సరిత అక్కడికక్కడే మరణించారు. ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా స్వయంగా పరిశీలించారు. కాగా, ఎనిమిది నెలల క్రితం ఇదే రోడ్డులో మూల మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ఈ వార్తలూ చదవండి
పార్టీకి నష్టపరిచేలా మాట్లాడితే చర్యలు.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
పది లక్షల పుస్తకాల సేకరణే లక్ష్యం!