నిర్మల్ జిల్లాలో విషాదం.. సుద్దవాగులో పడి ఇద్దరి మృతి..
ABN , Publish Date - May 01 , 2026 | 08:06 PM
నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి)లో తీవ్ర విషాదం నెలకొంది. స్థానిక సుద్దవాగులో పడి ఇద్దరు యువకులు మృతిచెందారు.
నిర్మల్ (ఆంధ్రజ్యోతి) మే 1: నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి)లో తీవ్ర విషాదం నెలకొంది. స్థానిక సుద్దవాగు(SRSP బ్యాక్ వాటర్)లో పడి ఇద్దరు మరణించారు. రిజ్వాన్, అషు అనే ఇద్దరు యువకులు సరదాగా ఈత కొట్టేందుకు సుద్దవాగు వద్దకు వెళ్లారు. వాగులోకి దిగిన వీరిద్దరూ నీటి లోతును సరిగా అంచనా వేయలేకపోయారు. లోపలికి వెళ్లిన నిమిషాల్లోనే ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
విషయం తెలుసుకున్న బాధిత కుటుంబాల సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతికి అందొచ్చిన కుమారులు మృతి చెందడంతో గుండెలవిసేలా రోదించారు. మరోవైపు మృతదేహాలను వెలికి తీసిన అధికారులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. గ్రామానికి చెందిన ఇద్దరు ఒకేసారి మృతిచెందడంతో నర్సాపూర్(జి)లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. నీటి వనరుల వద్దకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని స్థానికులు, యువతను అధికారులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
టెండర్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు..
సాఫ్ట్‌వేర్ సూసైడ్ కేసులో ట్విస్ట్.. భర్త చనిపోయిన నెల రోజులకే భార్య పెళ్లి..