Share News

టెండర్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు..

ABN , Publish Date - May 01 , 2026 | 06:03 PM

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పలు టెండర్లపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. గత అసెంబ్లీ సమావేశాల వేళ తాను ప్రస్తావించిన హ్యామ్ రోడ్ల స్కామ్ ఇప్పుడు నిజమైందని అన్నారు.

టెండర్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు..
MLA Harish Rao

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పలు టెండర్లపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. గత అసెంబ్లీ సమావేశాల వేళ తాను ప్రస్తావించిన హ్యామ్ రోడ్ల స్కామ్ ఇప్పుడు నిజమైందని అన్నారు. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ శాఖల్లో 22 నుంచి 25 శాతం వరకు ఎక్సెస్‌ టెండర్లు వచ్చాయని ఆరోపించారు. ఆర్ అండ్ బీ శాఖలో రూ.11 వేల కోట్ల టెండర్లకు దాదాపు రూ.15 వేల కోట్ల వరకు వ్యయం పెరిగిందని, పంచాయతీ రాజ్ శాఖలో రూ.6 వేల కోట్ల టెండర్లు రూ.8 వేల కోట్లకు చేరుతున్నాయని విమర్శించారు.


ఈ రెండు శాఖల్లో కలిపి వేల కోట్ల రూపాయల అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పడుతోందని హరీశ్ రావు పేర్కొన్నారు. జాతీయ రహదారుల టెండర్లు తగ్గింపుతో (లెస్) జరిగితే.. రాష్ట్ర రహదారుల టెండర్లు మాత్రం ఎక్సెస్‌కు వెళ్తున్నాయని మండిపడ్డారు. టెండర్లలో 40 శాతం రాష్ట్ర ఖజానా నుంచి వెళ్తే మిగిలిన 60 శాతం కాంట్రాక్టర్లు బ్యాంకు రుణాల ద్వారా సమకూర్చుకుంటారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ రుణాలను 15 సంవత్సరాల పాటు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. అయితే, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం సావరిన్ గ్యారెంటీ ఇస్తోందని, దీని భారం చివరకు ప్రజలపైనే పడుతుందని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు.


బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో 5 శాతం కంటే ఎక్కువ ఎక్సెస్ టెండర్లు లేవని హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆర్ అండ్ బీ శాఖలో 34 ప్యాకేజీలు, పంచాయతీ రాజ్‌లో 17 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారని.. ఒకే కంపెనీకి 15 టెండర్లు దక్కబోతున్నాయని ఆరోపించారు. ఇక మొబిలైజేషన్ అడ్వాన్స్ అంశంపైనా ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల సమయంలో మొబిలైజేషన్ అడ్వాన్స్‌లను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎలా సమర్థిస్తున్నారని ప్రశ్నించారు. ఈ టెండర్లను వెంటనే రద్దు చేసి మళ్లీ పిలవాలని, అలాగే మొబిలైజేషన్ అడ్వాన్స్‌లనూ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


మరోవైపు రిటైర్ అయిన అధికారులకు ఎక్స్‌టెన్షన్‌లు ఇచ్చి తప్పుడు పనులు చేయిస్తున్నారని ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. దీనిపై పారదర్శకత అవసరమని, ప్రభుత్వం వెంటనే స్పందించి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

శంషాబాద్ ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. వివరాలు వెల్లడించిన ఎంపీ అరుణ..

Updated Date - May 01 , 2026 | 06:11 PM