తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. వివరాలు వెల్లడించిన ఎంపీ అరుణ..
ABN , Publish Date - May 01 , 2026 | 05:20 PM
నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణకు తొలిసారి వస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. మే 10వ తేదీన హైదరాబాద్‌కు ప్రధాని రానున్నట్లు ఎంపీ వెల్లడించారు.
మహబూబ్ నగర్: నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణకు తొలిసారి వస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. మే 10వ తేదీన హైదరాబాద్‌కు ప్రధాని రానున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారని ఎంపీ అరుణ వెల్లడించారు. పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. సమ్మక్క, సారక్క గిరిజన విశ్వవిద్యాలయం పనులను కూడా ప్రారంభిస్తారని ఎంపీ తెలిపారు.
పాలమూరు జిల్లాలో పలు జాతీయ రహదారుల పనులనూ ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తారని ఎంపీ అరుణ వెల్లడించారు. ఈ సభకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయని ఎంపీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఆమె ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని.. తెలంగాణలో ప్రధాని మోదీ తాజా పర్యటన అందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనా ఎంపీ స్పందించారు. ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అరుణ ధీమా వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్‌లో బీజీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఎంపీ అరుణ ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని ఆమె ఆగ్రహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఇండి కూటమి పార్టీలు వ్యతిరేకించి ద్రోహం చేశాయన్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత పార్టీకి ఉనికి ఉండదన్నారు అరుణ. గతంలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టి వేరే పార్టీలో ఎలా విలీనం చేశారో.. కవిత పరిస్థితి అలాగే ఉంటుందన్నారు. తండ్రి పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని కవిత చూస్తున్నారని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
కమర్షియల్ గ్యాస్ ధర పెంపుపై మంత్రి ఉత్తమ్ సీరియస్..
ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు