Share News

కమర్షియల్ గ్యాస్ ధర పెంపుపై మంత్రి ఉత్తమ్ సీరియస్..

ABN , Publish Date - May 01 , 2026 | 04:10 PM

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం అమాంతం పెంచిందని తెలంగాణ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి ఫైర్ అయ్యారు.

కమర్షియల్ గ్యాస్ ధర పెంపుపై మంత్రి ఉత్తమ్ సీరియస్..
Minister Uttam Kumar Reddy

హైదరాబాద్: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం అమాంతం పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందని తెలంగాణ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి ఫైర్ అయ్యారు. గ్యాస్ ధర పెంపుతో సామాన్యుడిపై పెను భారం మోపారంటూ ఆగ్రహించారు. 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరను రూ.993లకు అంటే సుమారు వెయ్యి రూపాయలకు పెంచడం దుర్మార్గమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.


ఒక్కసారిగా 30 నుంచి 35 శాతం పెంచడంతో హోటళ్లు, రెస్టారెంట్లతో సహా చిన్నచిన్న వీధి వ్యాపారులపైనా తీవ్ర ప్రభావం పడనుందని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసి 24 గంటలు పూర్తి కాగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తీవ్ర విమర్శలు గుప్పించారు. కమర్షియల్ గ్యాస్ ధర పెంపుతో సామాన్యుల జీవన ప్రమాణాలపై కోలుకోలేని దెబ్బ పడిందని మంత్రి ఆరోపించారు. మోదీ ప్రభుత్వం తక్షణమే స్పందించి ధరల పెంపు నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.


కాగా, కమర్షియల్ గ్యాస్ ధరను పెంచుతూ మోదీ సర్కార్ ఈరోజు ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. 19 కేజీల సిలిండర్‌పై ఏకంగా రూ.993 పెంచింది. దీంతో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో 19 కేజీల సిలిండర్ ధర రూ.3071.50కి చేరింది. కేంద్రం నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మోదీ ప్రభుత్వం యథావిధిగా ధరలు పెంచేసిందని ఆగ్రహిస్తున్నాయి. సామాన్యుడి నడ్డి విరిచేలా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణ డీజీపీ నియామకంపై హైకోర్టు ఏం చెప్పిందంటే..


Updated Date - May 01 , 2026 | 04:32 PM