Share News

ఆర్టీసీ కండక్టర్, ఇన్‌స్పెక్టర్ మధ్య టికెట్ వివాదం.. వెలుగులోకి సంచలన విషయాలు..

ABN , Publish Date - May 01 , 2026 | 03:05 PM

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ వద్ద టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల మధ్య ఘర్షణలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కండక్టర్ తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు రూ.20 వేలు లంచం అడిగినట్లు ఇన్‌స్పెక్టర్‌పై తప్పుడు ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది.

ఆర్టీసీ కండక్టర్, ఇన్‌స్పెక్టర్ మధ్య టికెట్ వివాదం.. వెలుగులోకి సంచలన విషయాలు..
Raikode RTC Employees Issue

సంగారెడ్డి జిల్లా: రాయికోడ్ వద్ద టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల మధ్య ఘర్షణలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కండక్టర్ తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు రూ.20 వేలు లంచం అడిగినట్లు టికెట్ ఇన్‌స్పెక్టర్‌పై తప్పుడు ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. తనపై జరిగిన దాడి గురించి రాయికోడ్ పోలీసులను ఇన్‌స్పెక్టర్‌ ఆశ్రయించగా కేసు నమోదు అయ్యింది. ఈ సందర్భంగా తాను తప్పుడు ఆరోపణలు చేసినట్లు కండక్టర్ ఒప్పుకున్నట్లు సమాచారం.


హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును చెకింగ్ నిమిత్తం రాయికోడ్ వద్ద టికెట్ ఇన్‌స్పెక్టర్ ఆపారు. ఈ సందర్భంగా కండక్టర్, టికెట్ ఇన్‌స్పెక్టర్ మధ్య వివాదం చెలరేగింది. ఓ ప్రయాణికుడితో కలిసి ఇన్‌స్పెక్టర్‌పై కండక్టర్ దాడికి పాల్పడ్డాడు. టికెట్ లేకుండా బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని చెకింగ్ అధికారి గుర్తించారని.. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు కండక్టర్ ఆరోపించాడు. అనంతరం చెప్పుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది.


అయితే, ఈ దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ ప్రయాణికుడికి మహాలక్ష్మి టికెట్‌ను కండక్టర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చెకింగ్ సమయంలో పురుష ప్రయాణికుడికి ఫ్రీ టికెట్ ఎలా ఇచ్చావని కండక్టర్‌ను అధికారి ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో తనపై చర్యలు తీసుకుంటారనే భయంతో అతనిపై కండక్టర్ లంచం ఆరోపణలతో దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడి ఘటనపై రాయికోడ్ పోలీసులకు టికెట్ ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు చేయగా కండక్టర్‌పై కేసు నమోదు అయ్యింది. ఈ సందర్భంగా పోలీసులు ప్రశ్నించగా.. తాను క్షణికావేశంలో దాడి చేశానని.. క్షమించాలని కండక్టర్ కోరాడు. మరోవైపు ఘటనపై ఆర్టీసీ అధికారులు సీరియస్ అయ్యారు. దాడి ఘటనపై విచారణ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఫార్మా ల్యాబ్‌లో పేలిన రియాక్టర్.. 9 మందికి గాయాలు

Updated Date - May 01 , 2026 | 03:13 PM