రాహుల్ గాంధీని కలిశా.. మంత్రి పదవి కోరా: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి..
ABN , Publish Date - May 16 , 2026 | 06:11 PM
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కలిసినట్లు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ కేబినెట్‌లో తనకు అవకాశం కల్పించాలని కోరినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
ఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కలిసినట్లు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ కేబినెట్‌లో తనకు అవకాశం కల్పించాలని కోరినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ మేరకు రాహుల్ గాంధీకి వినతిపత్రం అందించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ కేబినెట్‌లో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయని.. రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదని రామ్మోహన్ రెడ్డి చెప్పారు.
గతంలో రంగారెడ్డి జిల్లాకు ముగ్గురు నుంచి ఆరుగురు మంత్రులు ఉండేవారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. డీలిమిటేషన్‌లో భాగంగా జిల్లాలో 44 అసెంబ్లీ నియోజకవర్గాలు, 8 పార్లమెంట్ స్థానాలకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ కారణంగానే తాను మంత్రి పదవి ఆశిస్తున్నట్లు చెప్పారు. తమ కుటుంబం మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే పని చేస్తోందని.. బూత్ స్థాయి నుంచి తాను పని చేసినట్లు గుర్తు చేశారు. నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశానని.. పార్టీ అధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యంతో కృషి చేసినట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు మంత్రి పదవి కోసం రాహుల్ గాంధీకి వినతి సమర్పించగా సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు మంత్రి పదవి వచ్చేలా రాహుల్ గాంధీతో మాట్లాడి అవకాశం కల్పిస్తారని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రాణాల మీదకు తెచ్చిన ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం
మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో దారుణం.. వృద్ధుల దారుణ హత్య..