భూమి రాలేదన్న బాధ.. గుండెపోటుతో రైతు మృతి
ABN , Publish Date - Oct 05 , 2026 | 06:39 AM
భూసమస్య పరిష్కారం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఓ పేద రైతు గుండె ఆగిపోయింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడలో ఈ విషాద ఘటన జరిగింది.
అధికారుల చుట్టూ తిరిగినా దక్కని ఫలితం
షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడలో ఘటన
షాబాద్, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): భూసమస్య పరిష్కారం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఓ పేద రైతు గుండె ఆగిపోయింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడలో ఈ విషాద ఘటన జరిగింది. తాళ్లపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 483లో వానరాసి యాదయ్య (55)కు 4ఎకరాల లావణి భూమి (డి.ఫారం పట్టా) ఉంది. ఈ భూమిని ప్రభు త్వం అభివృద్ధి పనుల నిమిత్తం స్వాధీనం చేసుకొని టీజీఐఐసీకి అప్పగించింది. పరిహారంగా హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో ఎకరాకు 800 గజాల చొప్పున ఇంటి స్థలం కేటాయించారు. అయితే యాదయ్యకు సంబంధించిన 4ఎకరాల భూమి ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లో లేదని ఇంటి స్థలం ఇవ్వలేదు.
భూమి వివరాలను సరిచేయడంతోపాటు తనకు రావాల్సిన ప్లాట్లు కేటాయించాలని కోరుతూ యాదయ్య పలుమార్లు షాబాద్ తహసీల్దార్, చేవెళ్ల ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరిగాడు. గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులతోనూ తన సమస్యను మొరపెట్టుకున్నాడు. అయినా ఫలితం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతి చెందాడు. కాగా, తాళ్లపల్లి రెవెన్యూ సర్వే నంబర్ 483కు సంబంధించిన భూ రికార్డుల్లో అవకతవకలు జరిగాయనే అనుమానాలు ఉన్నాయని గ్రామస్థులు తెలిపారు. సమగ్ర విచారణ జరిపి అర్హులైన రైతులకు న్యాయం చేయాలని సర్పంచ్ చెన్నయ్య, గ్రామస్థులు డిమాండ్ చేశారు. కాగా, అర్హులైన రైతులకు న్యాయం చేస్తామని షాబాద్ మండల తహసీల్దార్ అన్వర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి...
ఖర్గే వ్యాఖ్యలు ప్రజల విచక్షణను అవమానించడమే
పుట్టిన రోజునే నూరేళ్లు నిండాయ్!
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్‌కు చెందిన మహిళ మృతి
Read Latest AP News And Telugu News