CM Revanth: వివాదాలు వద్దు.. పరస్పర సహకారం అవసరం: సీఎం రేవంత్
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:26 PM
నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోకపోతే సమస్యలు పరిష్కారం కావని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్, జనవరి 9: కృష్ణా నది జల వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈ-సిటీలో సుజెన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా యూనిట్ ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రానికి పంచాయితీ కావాలా?, నీళ్లు కావాలా? అని అడిగితే తాను నీళ్లే కావాలని కోరుకుంటానని స్పష్టం చేశారు. వివాదం కావాలా?, పరిష్కారం కావాలా? అని అడిగితే పరిష్కారమే కావాలని కోరుకుంటానని ఆయన అన్నారు.
నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని, రాజకీయాలకు అతీతంగా సమస్యల పరిష్కారం కోసం అందరూ సహకరించాలని పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. మన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ఏపీ సీఎంకు విజ్ఞప్తి..
ఈ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu)కి విజ్ఞప్తి చేస్తూ.. కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు పెట్టవద్దని కోరారు. అడ్డంకుల వల్ల కేంద్ర ప్రభుత్వ నిధులు రావడం లేదని, రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వివాదం కోరుకోవడం లేదని.. పరిష్కారమే కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాలు కాదని.. ప్రజలు, రైతుల ప్రయోజనాల కోసమే ఆలోచిస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టీకరించారు.
చర్చలు కొనసాగుతాయి..
తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్రం సహకారం అవసరమన్నారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోకపోతే సమస్యలు పరిష్కారం కావని చెప్పుకొచ్చారు. ఇందుకోసం పక్క రాష్ట్రంతో చర్చలు కొనసాగుతాయని తెలిపారు. ఏపీ అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, మహారాష్ట్ర అయినా.. పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదని, పరస్పర సహకారమే కోరుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, మల్ రెడ్డి రంగారెడ్డి, కాలె యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కేటీఆర్‌పై గజ్జెల కాంతం షాకింగ్ కామెంట్స్
తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట
Read Latest Telangana News And Telugu News