ఓంకారేశ్వర ఆలయానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - Mar 28 , 2026 | 10:12 AM
రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా ఆలయ నిర్మాణానికి సీఎం శ్రీకారం చుట్టారు.
రంగారెడ్డి: గండిపేట మండలం మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా ఆలయ నిర్మాణానికి సీఎం శ్రీకారం చుట్టారు. అలాగే చేవెళ్లలోని ఎంకేపల్లి దగ్గర ఆధునిక గోశాలకు సైతం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కుటుంబసమేతంగా మంచిరేవు వీరభద్రస్వామి ఆలయం వద్ద గోపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
చారిత్రక వీరభద్రస్వామి ఆలయ సమీపంలో ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మిస్తున్నారు. రూ.700 కోట్లతో 8 ఎకరాల్లో దేవాలయం నిర్మాణం జరగనుంది. 100 అడుగుల ఎత్తుతో శివుడి విగ్రహాన్ని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణం ప్రత్యేకత..
కర్ణాటకలోని శృంగేరి శారదాపీఠం జగద్గురువుల సూచనలు, సలహాల మేరకు ఆలయ నిర్మాణ శైలిని రూపొందించారు. అత్యాధునిక హంగులతో ఆలయాన్ని నిర్మించనున్నారు. మెుత్తం 8 ఎకరాల విస్తీర్ణంలో రూ.663కోట్లతో ఓంకారేశ్వర స్వామి ఆలయం, ఇతర నిర్మాణాలను పూర్తి చేయనున్నారు. అలాగే 100 అడుగుల ఎత్తుతో శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్‌డీసీఎల్) ప్రణాళికలు రూపొందించింది. ఆలయం వద్ద 2 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్ వసతి కూడా కల్పించనున్నారు. అలాగే ఓంకారేశ్వరస్వామి ఆలయ గాలి గోపురం 100 అడుగుల ఎత్తున ఉండనుంది.
గాలి గోపురం నుంచి లోపలికి వెళ్తే చుట్టూ సాంస్కృతిక కార్యక్రమాలు, హోమాలు, పూజల నిర్వహణకు అవసరమైన మండపాలు ఉండేలా ప్రణాళికలు రచించారు. 207 అడుగుల పొడవైన ప్రధాన మండపాన్నీ ఏర్పాటు చేయనున్నారు. అక్కడే ఓంకారేశ్వర మందిరం ఉంటుంది. ఇక, గర్భాలయ గోపురాన్ని 14 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు.. 64 అడుగుల ఎత్తుతో ప్రత్యేకంగా నిర్మించనున్నారు. రామప్ప, యాదగిరిగుట్ట దేవాలయాల నిర్మాణంలో వాడిన రాతినే ఇక్కడా ఉపయోగించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎర్త్ అవర్.. హైదరాబాద్ వాసులకు జీహెచ్‌ఎంసీ పిలుపు
పెరిగిన పచ్చిమిర్చి, బెండ.. తగ్గిన వంకాయ, టమాటా