ఆదేశాలిచ్చింది మీరేనా?
ABN , Publish Date - Feb 02 , 2026 | 02:46 AM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనధికార, అక్రమ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ అధికారులు ఆదివారం విచారించారు. నందినగర్‌లోని ఆయన నివాసంలో నాలుగున్నర గంటలకుపైగా ఈ విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా..
మావోయిస్టుల పేరిట ఫోన్లను ట్యాపింగ్ చేయించారా?
ఎన్నికల్లో గెలుపునకు ఆయుధంగా మార్చుకున్నారా?
రిటైరైన అధికారులను ఎందుకు కొనసాగించారు?
వ్యాపారుల్ని బెదిరించడం వల్లే ఎన్నికల బాండ్లు వచ్చాయా?
‘ఎమ్మెల్యేల కొనుగోలు’ ఆడియోలు మీకెలా వచ్చాయి?
మాజీ సీఎం కేసీఆర్‌పై సిట్ అధికారుల ప్రశ్నల వర్షం
నందినగర్‌లోని ఇంట్లో నాలుగున్నర గంటలు విచారణ
అవసరమైతే మరోసారి విచారిస్తామని సమాచారం!
ఆ సమయంలో ఇంట్లోనే కేటీఆర్.. లాయర్లకు అనుమతి నో
విచారణ అనంతరం సిట్ చీఫ్‌ను కలిసిన దర్యాప్తు బృందం
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనధికార, అక్రమ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ అధికారులు ఆదివారం విచారించారు. నందినగర్‌లోని ఆయన నివాసంలో నాలుగున్నర గంటలకుపైగా ఈ విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా.. ప్రభుత్వ అధినేతగా మీకు తెలిసే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందా? మావోయిస్టుల పేరిట కొన్నివేల మంది ఫోన్లను ట్యాపింగ్ చేయించారా? పదవీ విరమణ పొందిన అధికారులను కీలక బాధ్యతల్లో ఎందుకు కొనసాగించారు? పలు ఎన్నికల్లో గెలుపునకు ఫోన్ ట్యాపింగ్ మీకు ఒక ఆయుధంగా మారడం వల్లే దానిని కొనసాగించారా? ఫోన్ ట్యాపింగ్ వల్ల వచ్చిన సమాచారం ఆధారంగా బెదిరింపులకు పాల్పడటంతోనే బీఆర్‌ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు పెద్ద మొత్తంలో వచ్చాయా? అంటూ సిట్ అధికారులు కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. సిట్ విచారణ కోసం కేసీఆర్ ఆదివారం ఉదయమే ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి బయలుదేరి నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. అయితే కేసీఆర్‌ను సిట్ విచారించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో నందినగర్ ప్రాంతంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3గంటలకు విచారణ ప్రారంభించిన అధికారులు.. అందుకు కొద్దిసమయం ముందుగానే అక్కడికి వచ్చారు. కేసీఆర్ నివాసంలోని రెండో అంతస్తులోని ఒక గదిలో విచారణకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారు. రెండు ట్రంక్ పెట్టెల్లో కేసుకు సంబంధించిన అత్యంత కీలకమైన ఎలకా్ట్రనిక్ సాక్ష్యాధారాలను, కొన్ని రికార్డులను తీసుకుని వచ్చారు. కేసీఆర్ విచారణను ఆసాంతం.. ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ను విచారణ సమయంలో ఉండటానికి సిట్ అధికారు లు అనుమతి ఇచ్చారు. ఇంట్లో ఉన్న హరీశ్‌రావు తదితర నేతలను బయటకు పంపేశారు.
కేసీఆర్ న్యాయవాదులను అక్కడికి అనుమతించలేదు. అయితే, న్యాయవాద బృందంలోని రామచంద్రరావును మాత్రం కేటీఆర్‌తో కలిసి ఉండటానికి అనుమతించారు. విచారణ సందర్భంగా సిట్ అధికారులు ప్రధానంగా.. సీఎం ఆదేశాలు కిందిస్థాయికి ఏ విధంగా చేరుతాయనే విషయంపై ఆరా తీసినట్లు సమాచారం. అనధికార, అక్రమ ఫోన్ ట్యాపింగ్‌లో కీలకపాత్ర పో షించిన అప్పటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు, ఆయన బృందంలోని ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన వాంగ్మూలాలతోపాటు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎవరిపైనిఘా పెట్టాలనే దానిపై తమకు సీఎంవో నుంచి ఆదేశాలు వచ్చేవని రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్న నేపథ్యంలో ‘మీరు ఇలాంటి ఆదేశాలు ఇచ్చారా? రాధాకిషన్‌రావుకు మీ ఆదేశాలు ఏ విధంగా అందేవి?’ అని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. అంతేకాకుండా.. రాధాకిషన్‌రావు, ప్రభాకర్‌రావును పదవీ విరమణ తర్వాత కీలక హోదాల్లో కొనసాగించడానికి కారణమేంటని ప్రశ్నించగా.. ఆ నిర్ణయం పోలీసు ఉన్నతాధికారులు తీసుకుంటారని, తాను కాదని కేసీఆర్ బదులిచ్చినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ వల్ల వచ్చిన సమాచారం ఆధారంగా బెదిరింపులకు పాల్పడటంతోనే బీఆర్‌ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు పెద్ద మొత్తంలో వచ్చాయా? అన్న ప్రశ్నకు.. ఆ విషయాలు తనకు తెలియని, పార్టీకి కోశాధికారి, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉంటారని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.
ఆధారాలు చూపించి ప్రశ్నలు.
మావోయిస్టుల పేరిట కొన్నివేల మంది ఫోన్లను ట్యాపింగ్ చేయించారా? అంటూ సిట్ అధికారులు ప్రశ్నించగా.. అనుమతులు ఇచ్చేది తాను కాదని, ట్యాపింగ్‌కు సంబంధించి చట్టబద్ధమైన వ్యవస్ధ పనిచేస్తుందని కేసీఆర్ చెప్పినట్లు, రివ్యూ కమిటీ అనుమతు లు ఇస్తుందన్న విషయం మీకూ తెలుసు కదా! అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అనధికారికంగా, అక్రమ పద్ధతుల్లో నిఘా కొనసాగడం, ఫోన్ ట్యాపింగ్‌కు పా ల్పడటం ప్రభుత్వ అధినేతగా మీకు తెలిసే జరిగిందా? మీ అనుమతి లేకుండా ఇంత విస్తృత స్థాయిలో ఫోన్ ట్యాపింగ్‌కు అధికారులు సాహసిస్తారా? అనే ప్రశ్నలను సైతం సిట్ అధికారులు సంధించినట్లు సమాచారం. అయితే వారు ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశాలుంటాయనే విషయంపై కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాతే విచారణకు హాజరైనందున.. ఆయన నుంచి ఆశించిన విధంగా సమాధానాలు వచ్చే అవకాశం లేదనే చర్చ పోలీసు వర్గాల్లో సాగుతోంది. ఈ నేపథ్యంలో.. సిట్ అధికారులు పూర్తిస్థాయి సాక్ష్యాలు, డిజిటల్ ఆధారాలు, వాంగ్మూలాలను చూపించి ప్ర శ్నించినట్లు తెలిసింది. ఈ ఆధారాల్లో రాజకీయనేతలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలకు సంబంధించి ఎస్‌ఐబీ రూపొందించిన ప్రొఫైల్స్‌లో కొన్నింటిని కేసీఆర్‌కు చూపించినట్లు సమాచారం. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ నేతలు సంతో్‌షరావు, కేటీఆర్, హరీశ్‌రావును విచారించిన సందర్భం గా సేకరించిన కొన్ని ఆధారాలనూ కేసీఆర్ ముందు ప్రస్తావించినట్లు తెలిసింది.
ట్యాపింగ్‌ను ఎన్నికల్లో వాడుకున్నారా?
‘‘2018 ఎన్నికల సమయంలో ప్రారంభమైన అనధికార ఫోన్ ట్యాపింగ్ మీకు ఒక ఆయుధంగా మారడం వల్లే ఆ తర్వాత కూడా దీనిని కొనసాగించారా? రిటైరయిన అధికారులను పదవుల్లో ఇందుకే కొనసాగించారా? పార్లమెంట్ ఎన్నికలు, మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికలు, 2023 ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా వార్‌రూంలు ఏర్పాటు చేసి అనధికారికంగా వేలాది ఫోన్లు ట్యాపింగ్ చేసిన విషయం మీ ఆదేశాలతోనే జరిగిందా? లేక ఇందులో కేటీఆర్, హరీశ్‌రావు, సంతో్‌షల పాత్ర ఉందా?’’ అనే ప్రశ్నలను సైతం సిట్ అధికారులు కేసీఆర్‌కు సంధించినట్లు తెలిసింది. కేసీఆర్ విచారణ కొనసాగుతున్న క్రమంలో దర్యాప్తు తీరును సిట్ చీఫ్, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పర్యవేక్షించారు. దర్యాప్తు అధికారులతో ఆయ న ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. కేసీఆర్ ఇస్తున్న సమాధానాలు తెలుసుకుంటూ మరికొన్ని ప్రశ్నలకు సంబంధించి సూచనలు జారీ చేసినట్లు సమాచారం. కాగా, సాయంత్రం 6.30 గంటలకు విచారణ అధికారులు కేసీఆర్‌కు టీ బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత 7.45 ప్రాంతంలో విచారణ ముగించారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని చెప్పినట్లు తెలిసింది. విచారణ బృందంలో కేసు దర్యాప్తు అధికారి, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, డీఐజీ విజయకుమార్, డీసీపీ నారాయణరెడ్డి, అదనపు ఎస్పీలు కేఎస్ రావు, రవీందర్‌రెడ్డి, ఏసీపీ శ్రీధర్ ఉన్నారు. విచారణ ముగిసిన తర్వాత వారు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకుని సిట్ చీఫ్ సజ్జనార్‌కు కేసీఆర్‌ను విచారించిన తీరును వివరించారు. ఇక ఈ కేసులో తుది చార్జిషీట్ దాఖలుకు అవసరమైన సాక్ష్యాధారాలను సిద్ధం చేసుకోవడానికి ముందు మరోసారి కేటీఆర్, హరీశ్‌రావు, సంతో్‌షరావులను సిట్ అధికారులు విచారించవచ్చని తెలుస్తోంది. సిట్ విచారణ అనంతరం కేసీఆర్ బయటకు వచ్చి పార్టీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం రాత్రి 8.30 గంటల సమయంలో నందినగర్ నివాసం నుంచి బయలుదేరి తిరిగి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు.
ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియో రికార్డులను మీకు ఎవరిచ్చారు?
గతంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి చోటుచేసుకున్న ఫాంహౌస్ వ్యవహారంపైనా కేసీఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ‘‘ఈ వ్యవహారం బయటపడిన సమయంలో మీరు విలేకరుల సమావేశం పెట్టి సీఎం హోదాలో కొన్ని ఆడియో రికార్డులను బహిరంగపరిచారు. వాటిని మీకు ఎవరిచ్చారు? ఆ కేసులో నిఘా, ఫోన్ ట్యాపింగ్ కొనసాగించాలని మీరే ఆదేశించారా?’’ అనే ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.



