Share News

కేసీఆర్‌ పెట్టిన తిండి తిని ప్రశాంత్ రెడ్డి తండ్రీకూతుళ్లను విడదీశారు: కల్వకుంట్ల కవిత

ABN , Publish Date - Aug 31 , 2026 | 06:09 PM

బీఆర్ఎస్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పెద్ద కొడుకుగా ప్రశాంత్‌ రెడ్డి చెప్పుకుంటారని.. కానీ, మహాభారతంలో శకుని వంటి వ్యక్తి ఆయనని మండిపడ్డారు.

కేసీఆర్‌ పెట్టిన తిండి తిని ప్రశాంత్ రెడ్డి తండ్రీకూతుళ్లను విడదీశారు: కల్వకుంట్ల కవిత
Kalvakuntla Kavitha

నిజామాబాద్: బీఆర్ఎస్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పెద్ద కొడుకుగా ప్రశాంత్‌ రెడ్డి చెప్పుకుంటారని.. కానీ, మహాభారతంలో శకుని వంటి వ్యక్తి ఆయనని మండిపడ్డారు. జీవితంలో హరీశ్‌ రావు, సంతోశ్ కుమార్‌నైనా క్షమిస్తా.. కానీ ప్రశాంత్‌ రెడ్డిని మాత్రం క్షమించనని కవిత తేల్చి చెప్పారు. బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయిన రెండో రోజే కాంగ్రెస్‌ నాయకులను ఆయన కలిశారని ఆరోపించారు. కేసీఆర్‌ పెట్టిన తిండి తిని తండ్రీ, బిడ్డలను విడదీశారని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


నిజామాబాద్‌లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త శక్తి రావాల్సిందేనని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. 'నిజామాబాద్ కోడలిగా ఇక్కడ పని చేశా. నాకు మళ్లీ ఒక అవకాశం ఇవ్వండి. మీరే నా ధైర్యం' అని కవిత అన్నారు. రాజకీయాలు చేయాలనుకుంటే తాను ఎక్కడికైనా, ఏ పార్టీలోకైనా వెళ్లగలనని, కానీ ప్రజల కోసం పనిచేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. ఈ సందర్భంగా తనపై నమోదైన కేసులను ప్రస్తావిస్తూ కవిత భావోద్వేగానికి గురయ్యారు.


'ఎన్ని కేసులు పెట్టినా నేను తప్పు చేయలేదనే చెప్పా. నన్ను తీహార్ జైలులో ఎందుకు పెట్టారు?' అని కవిత ప్రశ్నించారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు కనికరం చూపకుండా పార్టీ నుంచి వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీగా ఉన్నాను కాబట్టే బాధతో కన్నీళ్లు వస్తున్నాయని అన్నారు. తనను పిరికిదాన్ని అనుకోవద్దని హెచ్చరించారు. జైలులో ఉన్న సమయంలో తన అత్తగారు అండగా నిలిచారని కవిత గుర్తు చేసుకున్నారు. మరోవైపు, కాళేశ్వరం ప్రాజెక్టుపైనా తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా నిజామాబాద్ జిల్లాలో ఒక్క ఎకరానికీ నీరు అందలేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో అవినీతి జరిగిందని, అప్పటి ఎమ్మెల్యేల ఆస్తులు పదేళ్లలో భారీగా పెరిగాయని విమర్శించారు.


ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో చేసిందేమీ లేదని కవిత ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం నిద్రపోతోందని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లాలోని ఐదు స్థానాల్లో తెలంగాణ రక్షణ సేన విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. రాష్ట్రానికి రూ.2లక్షల కోట్ల ఆదాయం వస్తోందని, అందులో రూ.లక్ష కోట్లు కేటాయిస్తే ఉచిత విద్య, వైద్యం అమలు చేయవచ్చని అన్నారు. సామాజిక న్యాయం జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తమ కార్యకర్తలను బెదిరించే రోజులు పోయాయని కవిత చెప్పుకొచ్చారు.


బోధన్‌ షుగర్ ఫ్యాక్టరీని మాజీ మంత్రి కేటీఆర్‌ స్నేహితుడైన కోరుట్ల ఎమ్మెల్యే కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కవిత ఆరోపించారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పైనా విమర్శలు గుప్పించారు. మాధవనగర్‌ రైల్వే బ్రిడ్జిని ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. అర్వింద్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు విఫలమవుతున్నాయని అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త శక్తికి ప్రజలు అవకాశం ఇవ్వాలని కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

మూసారాంబాగ్ హైలెవ‌ల్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

మాజీ ఓఎస్డీ సుమంత్ పిటిషన్‌పై వాదనలు.. విచారణ రేపటికి వాయిదా

Updated Date - Aug 31 , 2026 | 06:16 PM