Share News

అనుమానంతో పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ప్రియుడు!

ABN , Publish Date - Nov 22 , 2026 | 07:16 AM

ప్రియురాలిపై అనుమానంతో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి.. ఆమె ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

అనుమానంతో పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ప్రియుడు!

  • తీవ్ర గాయాలతో మహిళ మృతి

  • నల్లగొండ జిల్లా కనగల్‌లో ఘటన

కనగల్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రియురాలిపై అనుమానంతో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి.. ఆమె ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. నల్లగొండ జిల్లా నల్లగొండ మండలం తొరగల్లులో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన జరిగింది. ఏపీలోని పల్నాడు జిల్లా దుర్గి మండలం ముత్తుకూరుకు చెందిన మెగావత్‌ హనుమాన్‌నాయక్‌ కొంతకాలంగా తొరగల్లు గ్రామంలో నివాసముంటున్నాడు. ధాన్యం పట్టాలను కిరాయికి నడుపుతూ ఉపాధి పొందుతున్నాడు. హనుమాన్‌నాయక్‌ భార్య మరణించగా ఒంటరిగా ఉంటున్నాడు. నిడమనూరు మండలం సూరెపల్లిలో పట్టాలు కిరాయికి ఇచ్చిన సమయంలో ఆ గ్రామానికి చెందిన బొమ్మిశెట్టి రమణ(34) అనే మహిళతో హనుమాన్‌ నాయక్‌కు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది.


వివాహితైన రమణకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హనుమాన్‌నాయక్‌ను కలిసేందుకు రమణ శుక్రవారం తొరగల్‌కి వచ్చింది. అయితే, రమణకు మరొకరితో సన్నిహిత సంబంధం ఉన్నట్లు హనుమాన్‌నాయక్‌కు అనుమానం ఉంది. ఈ విషయమై శుక్రవారం రాత్రి ఇరువురి మధ్య గొడవ జరిగింది. విచక్షణ కోల్పోయిన హనుమాన్‌నాయక్‌ ఆమె ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి రమణ తీవ్రంగా గాయపడింది. కాలిన గాయాలతో రమణ కేకలు వేయగా చుట్టుపక్కల వారు గమనించి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రమణ అదే రోజు రాత్రి మృతి చెందింది. రమణ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

హెలికాప్టర్ల నుంచి తూటాల వర్షం.. కరుడుగట్టిన గ్యాంగ్‌‌స్టర్ అరెస్టు

పారిశ్రామిక విప్లవం కంటే ఏఐ విప్లవమే పెద్దది.. ఆంథ్రోపిక్ ఐపీఓపై ట్రంప్ ప్రశంసలు..

Updated Date - Nov 22 , 2026 | 07:32 AM