Share News

మిర్యాలగూడలో ట్యాంకర్ బీభత్సం.. అంబులెన్స్ సిబ్బందికి సహాయం చేస్తూ ఒకరి మృతి..

ABN , Publish Date - Sep 18 , 2026 | 08:55 AM

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఓ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. నందిపాడు బైపాస్ వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ట్యాంకర్.. కారు, అంబులెన్స్ సహా నాలుగు వాహనాలను ఢీకొట్టింది.

మిర్యాలగూడలో ట్యాంకర్ బీభత్సం.. అంబులెన్స్ సిబ్బందికి సహాయం చేస్తూ ఒకరి మృతి..
Miryalaguda Tanker Accident

నల్లగొండ: మిర్యాలగూడలో ఓ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. నందిపాడు బైపాస్ వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ట్యాంకర్.. కారు, అంబులెన్స్ సహా నాలుగు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.


స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే పోలీసులకు, అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది.. బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఓ వ్యక్తి సహాయం చేస్తున్నాడు. అందరూ కలిసి గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లోకి ఎక్కిస్తున్నారు. అయితే, అదే సమయంలో అతివేగంగా వచ్చిన ట్యాంకర్ అదుపుతప్పింది. అంబులెన్స్ సహా అక్కడున్న నాలుగు వాహనాలను ఢీకొట్టింది. దీంతో అంబులెన్స్ సిబ్బందికి సాయం చేస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.


ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతుడిని ఆంధ్రప్రదేశ్‌లోని పొన్నూరుకు చెందిన శ్రీనివాసరావుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ట్యాంకర్ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా? లేదా ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రీతిరెడ్డి పుట్టిన రోజు ఫ్లెక్సీలో.. కేసీఆర్‌, కేటీఆర్‌ ఫొటోలు లేవెందుకు?

ఒకవైపు హత్యలు..మరోవైపు దొంగతనాలు..ఈ నగరానికి ఏమైంది?

Updated Date - Sep 18 , 2026 | 08:55 AM