ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తప్పుగా మాట్లాడుతున్నారు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
ABN , Publish Date - Sep 10 , 2026 | 09:29 PM
రెడ్డి సామాజిక వర్గాన్ని, తనను కించపరుస్తూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేశారంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్లకు నీతి, జాతి లేదని మల్లన్న తప్పుగా మాట్లాడుతున్నారని, ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి తనపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
నల్లగొండ జిల్లా: తనను, రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరుస్తూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేశారంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహించారు. రెడ్లకు నీతి, జాతి లేదని మల్లన్న తప్పుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సభకు తాను వెళ్తే ఎలా తప్పవుతుందని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి సభకు తాను వెళ్లడాన్ని మల్లన్న జీర్ణించుకోలేకపోతున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఎప్పుడు తమ జిల్లాకు వచ్చినా తాను వెళ్లానని, నల్గొండ సభ రోజు అందుబాటులో లేకపోవడంతో హాజరు కాలేకపోయానని చెప్పారు. అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి వద్దకు వెళ్తానని, అంత మాత్రాన మంత్రి పదవి కోసం కుమ్మక్కైనట్లా? అని సూటిగా ప్రశ్నించారు. తనకు మంత్రి పదవి ఇచ్చేది ఏఐసీసీ అని, తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేతిలో పెట్టినట్లు చెప్పుకొచ్చారు.
కాగా, ఈ నెల 5న నకిరేకల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ జరిగింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశిస్తూ రెడ్డి సామాజిక వర్గానికి నీతి, జాతి లేదంటూ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పలు జిల్లాల రెడ్ల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు చౌటుప్పల్ రెడ్డి సంక్షేమ సంఘం తీవ్రంగా స్పందించింది. గురువారం నాడు చౌటుప్పల్ డీఎస్పీకి ఆ సంఘం నేతలు వినతిపత్రం సమర్పించారు. రెడ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లన్నపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరారు.
అదేవిధంగా వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్‌లో తీన్మార్ మల్లన్నపై రెడ్డి సంఘం నేతలు ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాలు, బహిరంగ సభల్లో తమ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం.. చర్చించిన అంశాలివే..
ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లపై అసెంబ్లీలో చర్చ.. భట్టి విక్రమార్క ఏం చెప్పారంటే..