Share News

ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లపై అసెంబ్లీలో చర్చ.. భట్టి విక్రమార్క ఏం చెప్పారంటే..

ABN , Publish Date - Sep 10 , 2026 | 03:44 PM

తెలంగాణలో ఫ్లోటింగ్‌ సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రిజర్వాయర్లపై సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు విద్యుత్‌, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా అధ్యయనం చేస్తున్నాయని చెప్పారు. సోలార్‌ పవర్‌పై అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు ప్రశ్నలు లేవనెత్తగా డిప్యూటీ సీఎం భట్టి వివరణ ఇచ్చారు.

ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లపై అసెంబ్లీలో చర్చ.. భట్టి విక్రమార్క ఏం చెప్పారంటే..
Deputy CM Bhatti Vikramarka

హైదరాబాద్‌: తెలంగాణలో ఫ్లోటింగ్‌ సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రిజర్వాయర్లపై సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు విద్యుత్‌, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా అధ్యయనం చేస్తున్నాయని చెప్పారు. నాగార్జునసాగర్‌, శ్రీశైలం సహా పలు రిజర్వాయర్లను పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా సభ్యులు సోలార్‌ పవర్‌పై ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి వివరణ ఇస్తూ కీలక విషయాలను వెల్లడించారు.


ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు తమ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందని తెలిపారు. అయితే, దీనికి అధిక వ్యయం ప్రధాన సవాల్‌గా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల కారణంగా ఒక్క మెగావాట్‌కు రూ.1.30 కోట్ల అదనపు భారం పడుతోందని తెలిపారు. కేంద్రం నిబంధనలు సడలిస్తే పెట్టుబడులు మరింత పెరుగుతాయని భట్టి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్‌ డిమాండ్‌ 19 వేల మెగావాట్లకు చేరిందని.. పారిశ్రామిక వృద్ధితో డిమాండ్‌ భారీగా పెరుగుతోందన్నారు. మరోవైపు, విద్యుత్‌ సబ్సిడీల కోసం ఏటా రూ.19 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.


అలాగే, సోలార్‌, పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులపైనా కాంగ్రెస్‌ సర్కార్‌ దృష్టి పెట్టిందని ఉప ముఖ్యమంత్రి భట్టి పేర్కొన్నారు. ఈ మేరకు అమ్రాబాద్‌లో 80 గ్రామాల సోలరైజేషన్‌కు పైలట్‌ ప్రాజెక్టు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆయా గ్రామాల్లో మైక్రో గ్రిడ్‌ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు, గిరిజన ప్రాంతాల్లో సోలార్‌ విద్యుత్‌ను ప్రోత్సహిస్తామని చెప్పారు. ఇందుకోసం ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రైతులు, ప్రజలు సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు. అలాగే, సోలార్‌ విద్యుత్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యేలకు భట్టి విక్రమార్క సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్

ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ

Updated Date - Sep 10 , 2026 | 03:47 PM