Share News

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం.. చర్చించిన అంశాలివే..

ABN , Publish Date - Sep 10 , 2026 | 07:35 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం.. చర్చించిన అంశాలివే..
CM Revanth Reddy

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడం వంటి అంశాలపై చర్చించారు. అలాగే ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణపైనా చర్చలు జరిగాయి.


బీఆర్‌ఎస్‌ కుట్రను తిప్పికొట్టారు

ఈ సందర్భంగా శాసనసభను సజావుగా సాగనివ్వకుండా ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ కుట్ర చేసిందని సీఎం రేవంత్‌ ఆరోపించారు. ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన అసెంబ్లీ కార్యకలాపాలను అడ్డుకునే వ్యూహం రూపొందించారని విమర్శించారు. అధికారం కోల్పోయినా వారు అహంకారం వీడలేదని మండిపడ్డారు. పోలీసు సిబ్బందిలో కేటీఆర్‌కు తాను కనిపించినట్టు ఉన్నానని, అంత ఆక్రోశంతో వారిపై ఆయన దాడులు చేశారని పేర్కొన్నారు. పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులపై అనుచితంగా వ్యవహరించారని, మహిళా అధికారుల ఎదుట చొక్కాలు విప్పి ఇబ్బంది కలిగించారని మండిపడ్డారు. శాసనసభాపతినీ అత్యంత అభ్యంతరకరంగా దూషించారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ నుంచి రాజకీయంగా ఎదిగి ఆ పార్టీకి నష్టం చేకూర్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని సీఎం విమర్శించారు. కాంగ్రెస్‌ అవకాశం ఇవ్వకపోతే సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రస్థాయి నాయకులుగా ఎదిగేవారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కుట్రలను బలంగా తిప్పికొట్టి ప్రభుత్వానికి అండగా నిలిచారంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను రేవంత్‌ రెడ్డి అభినందించారు.


ప్రజలు గమనిస్తున్నారు..

ఎమ్మెల్యేల వ్యక్తిగత పనితీరు వారి రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. ‘మీ ప్రవర్తన రెండోసారి గెలుపుపై ప్రభావం చూపుతుంది. మీ వ్యక్తిగత పనితీరే గెలుపు, ఓటములను నిర్ణయిస్తుంది’ అని హితవు పలికారు. ఈ సందర్భంగా శాసనసభలో చురుగ్గా పాల్గొని ప్రజా సమస్యలను ప్రస్తావించాలని సూచించారు. అసెంబ్లీ జరిగే అన్ని రోజుల్లో సభ్యుల హాజరు సంపూర్ణంగా ఉండాలని, నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను సభలో ప్రస్తావించాలని ఆదేశించారు. ప్రజలు అప్పగించిన పదవిని సక్రమంగా వినియోగించుకోకపోతే రాజకీయ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించారు.


కులగణనకు తెలంగాణ మోడల్‌ కావాలి..

దేశానికి తెలంగాణ చేపట్టిన కులగణన ఒక రోల్‌ మోడల్‌గా నిలిచిందని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ నమూనాలో దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేగా మరోసారి గెలవాలని భావించే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పరిరక్షణ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. దేశంలో వయోజనుల జనాభా 103 కోట్లుగా ఉంటే ఓటర్ల జాబితాలో 88 కోట్ల మంది మాత్రమే ఉన్నారని ఆరోపించారు. ఈ లెక్కలతో భారీగా ఓట్లు గల్లంతయ్యాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.


వెయ్యి రోజుల పాలనలో ఎన్నో కార్యక్రమాలు..

కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు సభ నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. వెయ్యి రోజుల పాలనలో పార్టీ ఎమ్మెల్యేలు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో చేపట్టిన కార్యక్రమాలను దేశంలో ఎక్కడా లేని విధంగా ముందుకు తీసుకెళ్లామని, వాటి ఫలితాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఇదిలా ఉండగా.. సభ్యులందరికీ వెసులుబాటు కల్పించేలా అత్యంత చారిత్రక భవనంలో శాసనమండలి నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. అసెంబ్లీలో సెంట్రల్‌ హాల్‌ను ప్రారంభించి దుద్దిళ్ల శ్రీపాదరావు పేరు పెట్టుకున్న విషయాన్నీ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.


ఈ వార్తలు కూడా చదవండి

రూ.1 లక్ష లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన సచివాలయం ఉద్యోగులు

ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లపై అసెంబ్లీలో చర్చ.. భట్టి విక్రమార్క ఏం చెప్పారంటే..

Updated Date - Sep 10 , 2026 | 07:49 PM