Share News

మియాపూర్‌భూములు ప్రభుత్వానివే

ABN , Publish Date - Oct 30 , 2026 | 02:23 AM

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని 550 ఎకరాల 39 గుంటల విలువైన భూములు రాష్ట్ర ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది

మియాపూర్‌భూములు ప్రభుత్వానివే
SUPREMECOURT

  • 550 ఎకరాల 39 గుంటల స్థలంపై సుప్రీంకోర్టు తుది తీర్పు

  • 1949 నాటి జాగీర్ల రద్దు చట్టంతోనే అవి ప్రభుత్వ పరం

  • ఆ తర్వాత రెవెన్యూ అధికార్లతోకుమ్మక్కై కొందరి అక్రమాలు

  • పరిహారం తీసుకున్నాక ఏ హక్కులూ ఉండవు

  • సుప్రీంకోర్టు స్పష్టీకరణ

న్యూఢిల్లీ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని 550 ఎకరాల 39 గుంటల విలువైన భూములు రాష్ట్ర ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సర్వే నంబర్లు 100, 101 పరిధిలోని సదరు భూములపై హక్కులు కోరుతూ బండారి రామచందర్‌తో పాటు ఇతర ప్రైవేటు వ్యక్తులు, కోఆపరేటివ్‌ సొసైటీలు దాఖలు చేసిన పలు సివిల్‌ అప్పీళ్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ వివాదంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు 2003 ఏప్రిల్‌ 16న ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం గురువారం 44 పేజీల తుది తీర్పును వెలువరించింది. మియాపూర్‌ పరిధిలోని సర్వే నంబరు 100లో 277 ఎకరాల 5 గుంటలు, సర్వే నంబరు 101లో 273 ఎకరాల 34 గుంటలు.. మొత్తం 550 ఎకరాల 39 గుంటల భూమికి సంబంధించి దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. ఈ భూములపై హక్కులు కోరుతూ పలువురు వ్యక్తులు, హౌసింగ్‌ సొసైటీలు పలు రకాల క్రయవిక్రయ పత్రాలు, వారసత్వ పత్రాలతో కోర్టులను ఆశ్రయించారు. అయితే, 1912 నాటి రీ సర్వే రికార్డులు, సేత్వార్‌, క్లాస్సర్‌ రిజిస్టర్లను పరిశీలిస్తే ఈ భూములన్నీ స్పష్టంగా ‘సర్కారీ పోరంబోకు’ భూములుగానే నమోదై ఉన్నాయని సుప్రీంకోర్టు తీర్పులో వెల్లడించింది.


నిజాం ఫర్మానా.. జాగీర్ల రద్దు చట్టం

గతంలో నిజాం పాలన కాలంలో ఏర్పాటైన ‘రైల్లీ కమిషన్‌’ నివేదిక ఆధారంగా 1929లో నిజాం నవాబు ఫర్మానా జారీ చేశారు. దాని ప్రకారం మియాపూర్‌ సహా నాలుగు గ్రామాలను రఫీమున్నీసాబేగం వారసులకు కేటాయించినప్పటికీ నిజాం ముందస్తు అనుమతి లేకుండా ఆ ఆస్తులను విక్రయించడం, తనఖా పెట్టడం లేదా దానం చేయడం చెల్లదు. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. 1949లో అమల్లోకి వచ్చిన ‘జాగీర్ల రద్దు రెగ్యులేషన్‌’ ప్రకారం సమస్త జాగీర్లు, పైగాలు ప్రభుత్వ పరిపాలన కిందకు చేరాయని తెలిపింది. జాగీర్ల రద్దు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా 1950-1953 మధ్యకాలపు పహాణీలలో, ఎలాంటి ఆధారాలు లేకుండానే రహీమున్నిసా బేగం పేరును పట్టేదారుగా చేర్చారు. ఆమె వారసులమని చెప్పుకుంటూ కొందరు.. ప్రైవేటు వ్యక్తులకు, సొసైటీలకు భూములు విక్రయించారు. 1982 భూకబ్జా నిరోధక చట్టం కింద ప్రత్యేక కోర్టులో నమోదైన వివిధ కేసుల్లో .. ప్రభుత్వాన్ని ఒక కక్షిదారుగా చేర్చకుండా పొందిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. ప్రభుత్వాన్ని పార్టీగా చేర్చిన ఇతర కేసుల్లో ఇవి పోరంబోకు భూములని, కబ్జాదారులుగా మారిన ప్రైవేటు వ్యక్తులకు వీటిపై ఎలాంటి హక్కులూ లేవని తీర్పు ఇచ్చింది.

జాగీర్‌తో యాజమాన్య హక్కు రాదు

‘జాగీర్‌’ లేదా ‘పైగా’ కేటాయింపు అనేది కేవలం భూమి శిస్తు వసూలుకు లేదా సైనిక నిర్వహణకు ఇచ్చిన తాత్కాలిక హక్కు మాత్రమేనని, అది ఆస్తిపై శాశ్వత యాజమాన్య హక్కును (టైటిల్‌) కల్పించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1949 జాగీర్ల రద్దు చట్టం సెక్షన్‌ 4, 5, 6 నిబంధనల ప్రకారం జాగీర్ల వ్యవస్థ పూర్తిగా రద్దయిందని, ఆయా భూములపై సర్వహక్కులూ ప్రభుత్వానికే సంక్రమిస్తాయని తేల్చిచెప్పింది. పూర్వ జాగీర్దారుల వారసులు నష్టపరిహారం లేదా అలవెన్సులకు మాత్రమే అర్హులవుతారని, అంతేతప్ప ప్రభుత్వ భూములను విక్రయించే హక్కు వారికి లేదని స్పష్టం చేస్తూ అప్పీళ్లను కొట్టేసింది.


పొలాలు, వ్యక్తిగత ఆస్తులకే మినహాయింపు

జాగీర్ల రద్దు చట్టంలో పేర్కొన్న మినహాయింపులను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఆ చట్టంలోని రెగ్యులేషన్‌ 17 ప్రకారం జాగీర్దార్లు స్వయంగా సేద్యం చేసుకునే పొలాలకు (ఖుద్కాష్ట్‌), రెగ్యులేషన్‌ 18 ప్రకారం వారి సొంత ఆస్తులకు మాత్రమే రక్షణ ఉంటుందని తెలిపింది. అయితే ఆ ఆస్తులు, పొలాలు తమవేనని నిరూపించుకోవాల్సిన బాధ్యత హక్కును కోరుతున్న వ్యక్తులపైనే ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. మియాపూర్‌ భూముల విషయంలో అలాంటి ఆధారాలేవీ లేవని తెలిపింది. అతియత్‌ విచారణ చట్టం-1952 ప్రకారం జారీ చేసే ‘మున్తఖబ్‌’ లేదా ‘వసికా’ పత్రాలు.. జాగీర్ల రద్దుకు పరిహారంగా ప్రభుత్వం నుంచి ఒకేసారి అందే నష్టపరిహారం (కమ్యుటేషన్‌) కోసం మాత్రమే ఉపయోగపడతాయని పేర్కొంది. పూర్వ జాగీర్దారులు లేదా వారి వారసులు ఇప్పటికే ప్రభుత్వం నుంచి పరిహారం తీసుకున్నారు కాబట్టి ఆయా భూములపై ఎలాంటి యాజమాన్య హక్కులూ కోరడానికి వారికి ఏమాత్రం అర్హత లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం

విచారణ సందర్భంగా ఖైసరుద్దీన్‌ ఖాన్‌ వారసులు ‘నోటి మాటగా ఇచ్చిన బహుమతి’ (ఓరల్‌ గిఫ్ట్‌) ద్వారా తమకు భూములు వచ్చాయని వాదించగా, రహీమున్నిసా బేగం వారసులు తమకు వీలునామా, వేలం ద్వారా హక్కులు సంక్రమించాయని వాదించారు. మొయినుద్దౌలా భార్య వారసులు ఇవి ‘జత్‌ జాగీర్‌’ భూములని పేర్కొన్నారు. ఈ వాదనలన్నింటినీ సుప్రీంకోర్టు తిరస్కరించింది. కింది కోర్టుల్లో ప్రస్తావించని, నిరాధార అంశాలను ఇక్కడ కొత్తగా లేవనెత్తడం చెల్లదని తెలిపింది. 1949లోనే ఈ భూములు ప్రభుత్వ పరిధిలోకి వచ్చినప్పటికీ.. 1950-1953 మధ్య పహాణీలలో రహీమున్నిసా బేగం పేరును చేర్చడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.


ఎలాంటి ఆధారాలు, ఉత్తర్వులు లేకుం డా రెవెన్యూ రికార్డులలో పేర్లు నమోదు చేయ డం మోసపూరిత చర్య అని, అది చట్టరీత్యా చెల్లదని పేర్కొంది. 1953లో క్షేత్రస్థాయి పరిశీలన చేసినప్పుడు కూడా ఆ భూములన్నీ రాళ్లు, రప్పలతో కూడిన బంజరు భూములుగానే ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయని గుర్తుచేసింది.

అప్పీళ్లన్నీ కొట్టివేత

ప్రభుత్వ భూములను కాజేయడానికి కొందరు వ్యక్తులు, అధికారులతో కుమ్మక్కై రికార్డులను సృష్టించారని, వీటికి చట్టబద్ధత ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ భూములు ఇప్పటికే హైదరాబాద్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (హుడా)కు బదిలీ అయిన విషయాన్ని సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. అత్యంత విలువైన ప్రభుత్వ భూములను హస్తగతం చేసుకునేందుకు ప్రైవేటు వ్యక్తులు పక్కా కుట్ర చేశారని, వారి వాదనల్లో ఎలాంటి చట్టబద్ధత లేనందున, సానుభూతితో ఊరట కల్పించలేమని తెలిపింది. ఈ అంశంపై గతంలో హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం, ప్రత్యేక కోర్టులు ఇచ్చిన తీర్పులు సరిగ్గా ఉన్నాయని, వాటిలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. పిటిషనర్లు దాఖలు చేసిన అన్ని అప్పీళ్లను, మధ్యంతర పిటిషన్లను కొట్టివేస్తూ.. ఆ భూములపై సర్వహక్కులూ తెలంగాణ ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం.. ఇంట్లో పాతిపెట్టిన మూడు డ్రమ్ముల్లో భారీగా నగదు..!

ఢిల్లీ టీటీడీలో వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవాలు

Updated Date - Oct 30 , 2026 | 02:24 AM