ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం.. ఇంట్లో పాతిపెట్టిన మూడు డ్రమ్ముల్లో భారీగా నగదు..!
ABN , Publish Date - Oct 29 , 2026 | 09:04 PM
ప్రయాగ్‌రాజ్ సమీపంలోని ఓ గ్రామంలో ఇంట్లో పాతిపెట్టిన మూడు డ్రమ్ముల్లో భారీగా నగదు బయటపడటం సంచలనం రేపుతోంది. పక్కా సమాచారంతో అనుమానితుల నివాసానికి చేరుకున్న పోలీసులు.. రూ.500 నోట్ల కట్టలతో నిండిన డ్రమ్ములను చూసి షాక్ అయ్యారు.
ఉత్తర్‌ప్రదేశ్, అక్టోబర్ 29: ప్రయాగ్‌రాజ్ సమీపంలోని ఓ గ్రామంలో ఇంట్లో పాతిపెట్టిన మూడు డ్రమ్ముల్లో భారీగా నగదు బయటపడటం సంచలనం రేపుతోంది. పక్కా సమాచారంతో అనుమానితుల నివాసానికి చేరుకున్న పోలీసులు.. రూ.500 నోట్ల కట్టలతో నిండిన డ్రమ్ములను చూసి షాక్ అయ్యారు. మారుమూల పల్లెలో కోట్ల రూపాయల నగదు బయటపడటంతో గ్రామస్థులు సహా పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే నగదును స్వాధీనం చేసుకుని, నిందితుల కుటుంబ సభ్యుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ప్రయాగ్‌రాజ్‌కు సుమారు 45 కిలోమీటర్ల దూరంలోని బరైపూర్‌లో వెలుగుచూసింది.
పోలీసులకు ఎలా తెలిసింది?
బరైపూర్ వాసులైన రాకేశ్ యాదవ్, రాజేశ్ యాదవ్ అనే సోదరులకు చెందిన ఇంట్లో భారీగా నగదు దాచినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నవాబ్‌గంజ్, సొరావ్ పోలీస్ స్టేషన్లకు చెందిన బృందాలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి. మొదట ఇంట్లో సాధారణ తనిఖీలు చేపట్టగా.. ఎలాంటి నగదు ఆనవాళ్లు కనిపించలేదు. అనంతరం ఓ గది నేలలో మట్టిని ఇటీవల తవ్వినట్లు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అక్కడ తవ్వకాలు జరిపించారు. దీంతో భూమిలో పాతిపెట్టిన మూడు డ్రమ్ములు బయటపడ్డాయి. వాటిని తెరిచి చూడగా రూ.500 నోట్ల కట్టలు కనిపించాయి.
ఉద్యోగాలు వదిలి తిరిగొచ్చాక పెరిగిన ఆస్తులు
పోలీసుల కథనం ప్రకారం, నిందితులిద్దరూ గతంలో పుణెలో పనిచేసేవారు. 2020లో కరోనా మహమ్మారి సమయంలో ఉద్యోగాలు వదిలి స్వగ్రామానికి తిరిగివచ్చారు. ఆ తర్వాత కొద్దికాలంలోనే వారి ఆర్థిక పరిస్థితి, జీవనశైలిలో గణనీయమైన మార్పు కనిపించింది. వారు గ్రామంలో, పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయడంతో పాటు ట్రాక్టర్‌ను కూడా కొన్నారు. వారి ఆస్తులు, ఖర్చులు అకస్మాత్తుగా పెరగడంపై గ్రామస్థుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల సోదరులకు, గ్రామస్థులకు మధ్య జరిగిన వివాదంతో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
నగదు ఎక్కడి నుంచి వచ్చింది?
మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నగదు ఎక్కడి నుంచి వచ్చింది? దానికి ఏదైనా నేరంతో సంబంధం ఉందా? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు నిందిత సోదరుల కుటుంబ సభ్యుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, అనుమానితుడు తన వాంగ్మూలాలను పదేపదే మారుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖతో పాటు సంబంధిత ఆర్థిక దర్యాప్తు సంస్థలకు కూడా తెలియజేశారు. మూడు డ్రమ్ముల్లో కోట్ల కొద్దీ నగదు బయటపడిన ఘటన ఇప్పుడు స్థానికంగా పెను సంచలనంగా మారింది. అయితే, నగదు మొత్తం ఎంతనేది అధికారుల లెక్కింపు తర్వాత వెల్లడికానుంది.
ఈ వార్తలు కూడా చదవండి
రాజేష్ ఖన్నా కేసులో బాలీవుడ్ నటికి ఎదురుదెబ్బ!
ఢిల్లీ టీటీడీలో వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవాలు