China Manja: గొంతుకోసిన చైనా మాంజా.. వాహనదారుడు మృతి
ABN , Publish Date - Jan 14 , 2026 | 03:13 PM
చైనా మాంజా కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడి మెడకు చైనా మాంజా చుట్టుకుంది. మాంజా కారణంగా గొంతు కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది.
సంగారెడ్డి జిల్లా, జనవరి 14: సంగారెడ్డి మండలం పసల్వాడి గ్రామంలో భయానక ఘటన చోటుచేసుకుంది. చైనా మాంజా మెడకు తగిలి గొంతు కోసుకుపోవడంతో ఓ ద్విచక్రవాహనదారుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని బిహార్ రాష్ట్రానికి చెందిన అద్వైక్‌గా గుర్తించారు పోలీసులు. కొంతకాలంగా అతడు పసల్వాడిలోని ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే, ఇవాళ(బుధవారం) బైక్‌పై వెళ్తుండగా చైనా మాంజా రోడ్డుకు అడ్డంగా వెళాడుతోంది. అది కంటికి కనిపించకపోవడంతో ఒక్కసారిగా అతని గొంతుకు చుట్టుకుని కోసేసింది. ఈ ప్రమాదంలో తీవ్ర రక్తస్రావంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు.
అయితే, ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. మాంజా గొంతుకు లోతుగా కోసుకోవడంతో అద్వైక్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చైనా మాంజా వల్ల మనుషులు, పక్షులు, జంతువులు తీవ్ర ప్రమాదంలో పడుతున్నాయని ఇప్పటికే నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ చైనా మాంజా విక్రయాలు కొనసాగుతుండటంతో అనేక మంది గాయపడుతున్నారు.
కాగా.. తెలంగాణలో చైనా మాంజా విక్రయం, వినియోగం, రవాణా పూర్తిగా నిషేధించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో పోలీసులు ముమ్మరంగా దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో రూ.1.24కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు. చైనా మాంజా విక్రయిస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేసిన పోలీసులు దాదాపు 143 మందిని అరెస్టు చేశారు. వేలాదిగా బాబిన్లను పట్టుకున్నారు. అటు సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోనూ పోలీసులు తనిఖీలు చేసి.. చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. చైనా మాంజాను పూర్తిగా నిషేధించాలని.. ఎక్కడైనా ఈ మాంజాను విక్రయించినా, వినియోగించినా సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి...
అర్ధరాత్రి జర్నలిస్టుల అరెస్ట్ సరికాదు: జగ్గారెడ్డి
మహిళా ఐఏఎస్‌పై అసభ్య కథనాలు.. సీసీఎస్ దూకుడు
Read Latest Telangana News And Telugu News