Woman IAS Defamation Case: మహిళా ఐఏఎస్‌పై అసభ్య కథనాలు.. సీసీఎస్ దూకుడు
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:58 AM
ఓ మహిళా ఐఏఎస్ అధికారిని కించపరుస్తూ కథనాలు ప్రసారం చేసిన కేసులో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్, జనవరి 14: తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిని(Woman IAS Defamation Case) కించపరిచేలా వార్తలు ప్రసారం చేసిన కేసులో సెంట్రల్ క్రైమ్ స్టేషన్(CCS) పోలీసులు దూకుడు పెంచారు. తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం తరఫున సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు నమోదు చేశారు సీసీఎస్ పోలీసులు. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఓ ఛానల్ ఇన్‌పుట్ ఎడిటర్‌తో పాటు ఇద్దరు రిపోర్టర్లను అరెస్ట్ చేశారు. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తుండగా ఇన్‌పుట్ ఎడిటర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
అలాగే.. మహిళా ఐఏఎస్‌ను కించపరిచే విధంగా 44 యూట్యూబ్ ఛానల్స్ కథనాలు ప్రసారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఆయా యూట్యూబ్ ఛానళ్లపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఛానల్స్ బాధ్యులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు సీసీఎస్ పోలీసుల సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే పలువురిని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పోలీసుల దూకుడుతో పలువురు యూట్యూబ్ ఛానల్స్ నిర్వాహకులు అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం.
కాగా.. సీఎం ఫొటో మార్ఫింగ్, మహిళా ఐఏఎస్‌పై అసభ్యకర కథనాలపై తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు 8 మంది సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి.సజ్జనార్ పర్యవేక్షణలో ఈ బృందం పనిచేస్తోంది. దర్యాప్తు వేగంగా పూర్తి చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీఅయ్యాయి. మరోవైపు మహిళా అధికారిపై అసభ్యకర కథనాలను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తీవ్రంగా ఖండించారు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ అసోసియేషన్లు కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యాయి. ఇలాంటి వార్తలు అధికారుల మనోభావాలను దెబ్బతీస్తాయని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
భర్త కోసం భార్య చైన్ స్నాచింగ్.. చివరకు..
ఏపీ వ్యాప్తంగా అంబరాన్నంటిన భోగి సంబరాలు
Read Latest Telangana News And Telugu News