Share News

స్వాతంత్ర్య దినోత్సవం వేళ సీఎం రేవంత్ 420 మాటలు మాట్లాడారు: మాజీ మంత్రి హరీశ్ రావు..

ABN , Publish Date - Aug 15 , 2026 | 06:55 PM

గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఖండించారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు.

స్వాతంత్ర్య దినోత్సవం వేళ సీఎం రేవంత్ 420 మాటలు మాట్లాడారు: మాజీ మంత్రి హరీశ్ రావు..
MLA Harish Rao

సిద్దిపేట: గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఖండించారు. ఈరోజు (శనివారం) సంగారెడ్డిలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. దేశంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజునా చిల్లర మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి మరొకరు ఉండరని విమర్శించారు. సిద్దిపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 4:20 గంటలకు ప్రసంగం ప్రారంభించి 420 మాటలు మాట్లాడారని మండిపడ్డారు. ఆయన తన ప్రసంగంలో ఉమ్మడి మెదక్ జిల్లా గురించి ఒక్క మాటా మాట్లాడలేదని ధ్వజమెత్తారు. రేవంత్ చేతకానితనం వల్లే సింగూరు ఖాళీ అయిందని ఆరోపించారు. కామారెడ్డి జిల్లాకు మంచినీళ్లు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి బాగుపడాలని గత ప్రభుత్వం సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను ప్రారంభిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని మూలన పడేసిందని నిప్పులు చెరిగారు.


జహీరాబాద్‌లో బసవేశ్వర విగ్రహం ప్రారంభించి ఏడాది అయిందని, ఆ రోజు ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలయ్యాయా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లాలో ఈ మూడేళ్లలో ఒక్క రోడ్డు అయినా వేశారా? అని నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో 6 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చారని అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని, కానీ నేడు సంగారెడ్డిలో రేషన్ కార్డులు ఇవ్వలేదని చెబుతున్నారని ఆగ్రహించారు. నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడే రేవంత్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తే రేవంత్ నియామక పత్రాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు.


ఎంపీ రాహుల్ గాంధీని పిలిచి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, మాట తప్పినందుకు నిరుద్యోగులకు రేవంత్ క్షమాపణలు చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. గన్‌మెన్లు లేకుండా అశోక్ నగర్‌కు వస్తావా? అంటూ ఈ సందర్భంగా మాజీ మంత్రి సవాల్ విసిరారు. మరోవైపు, రెండేళ్ల ఫీజురీయింబర్స్‌మెంట్ ఎప్పుడూ ఇస్తారో చెప్పాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వని ఆ కాలేజీలు, విద్యార్థుల భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారని మండిపడ్డారు. అలాగే, రైతుల గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు.


కేసీఆర్ హయాంలో వరుసగా మూడేళ్లలో రూ.14,656 కోట్లు, రూ.14,721 కోట్లు, రూ.14,721 కోట్లు చొప్పున రైతు బంధు ఇచ్చారని పేర్కొన్నారు. 2024-25లో రేవంత్ ఇచ్చింది రూ.5,057 కోట్లేనని మండిపడ్డారు. 2025-26లో రూ.11 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన దానికంటే రూ.15 వేల కోట్లు రేవంత్ తక్కువ ఇచ్చారని విమర్శించారు. రేవంత్ రెడ్డి సొంత ఊరికి వెళ్లి రుణమాఫీ అయ్యిందో, లేదో అక్కడి రైతులను అడగాలన్నారు. ఆ రైతులు రుణమాఫీ అయ్యిందని చెబితే తాను రాజీనామా చేస్తానని, అవ్వలేదని చెబితే రేవంత్ రెడ్డి రాజీమానా చేస్తారా? అని సవాల్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

నిరుపేదలకు రేషన్ కార్డుల్లో విప్లవాత్మక మార్పులు: మంత్రి ఉత్తమ్ కుమార్

త్వరలోనే ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి..

Updated Date - Aug 15 , 2026 | 07:08 PM