త్వరలోనే ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - Aug 15 , 2026 | 05:24 PM
తెలంగాణలో 1.06 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో వీటిని రూపొందించినట్లు పేర్కొన్నారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.
సంగారెడ్డి: తెలంగాణలో 1.06 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో వీటిని రూపొందించినట్లు పేర్కొన్నారు. దేశంలో సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. పేదలకు రూ.14,800 కోట్లతో ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నట్లు సీఎం చెప్పుకొచ్చారు. ఈ రోజు (శనివారం) సంగారెడ్డిలో పర్యటించిన రేవంత్ రెడ్డి.. నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం పదేళ్లపాటు రేషన్ కార్డులు ఇవ్వలేదు. మేం అధికారంలోకి వచ్చాకే ఇవ్వడం ప్రారంభించాం. రేషన్ విషయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని ఎవరూ తినేవారు కాదు.. పైగా పక్కదారి పట్టేవి. పేదల ఆకలి తీర్చేదే ఈ స్మార్ట్ రేషన్ కార్డు. అసలు రేషన్ షాపులు తెచ్చిందే కాంగ్రెస్. పేదలకు కూడు, గూడు, గుడ్డ ఉండాలని ఇందిరమ్మ ఆలోచన చేశారు. వారికి సంక్షేమం అందించడం మా బాధ్యత. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదు.. రెండూ ఒక్కటే. గతంలో ఆ పార్టీలు ఎప్పుడైనా సన్నబియ్యం ఇవ్వాలని ఆలోచించాయా?. రేషన్ కార్డు అనేది పేదల ఆత్మగౌరవం. వారికి ప్రతినెలా 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తున్నాం. దీని వల్లే మార్కెట్‌లో బియ్యం ధరలు తగ్గాయి.
రైతులకు ఎవరేం చేశారో అసెంబ్లీలో చర్చకు కేసీఆర్ సిద్ధమా?. పదేళ్లలో మీరేం చేశారో.. రెండున్నరేళ్లలో మేమేం చేశామో చర్చిద్దాం. అతి తక్కువ అప్పుల్లో తెలంగాణ రైతులు ఉన్నారని కేంద్రం చెబుతోంది. కేంద్రం చెప్పేది బీజేపీ నేతలకు కనిపించడం లేదా?. రైతులు పండించిన వడ్లకు రూ.90 వేల కోట్లు బదిలీ చేశాం. ఉచిత విద్యుత్ కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేశాం. గత పాలకులు బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లు నొక్కారు. గతంలో పాలపిట్ట చీరలు ఇచ్చాం.. ఈసారి చిలకపచ్చ చీరలు ఇస్తాం. ఆడబిడ్డలకు ఉచిత బస్సు కోసం రూ.11 వేల కోట్లు ఖర్చు చేశాం. ఆనాడు డబుల్ బెడ్‌రూమ్ అంటూ డబ్బా కొట్టారు. పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు రాలేదు కానీ వారికి మాత్రం ఫామ్‌హౌస్‌లు వచ్చాయి. మేము 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తున్నాం. తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరేలేదు. కొత్తగా 2.5 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేశాం. అర్హులైన చేనేత, గీత కార్మికులందరికీ పెన్షన్లు ఇస్తాం.
ఐదేళ్లపాటు మహిళలకు మంత్రి పదవి ఇవ్వని వారు నేడు మహిళల గురించి మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రాలేదు. త్వరలోనే ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. అగ్గిపెట్టె రావు, అఘోరా రావులు వస్తారు.. జాగ్రత్త. వీళ్లకు అగ్గిపెట్టెలు దొరకవు కానీ అమాయక యువతను మాత్రం బలిచేశారు. శవాలపై పెట్టుబడులు పెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారు. మాట ఇస్తే మట్టిలో కలిసే వరకు నిలబడి ఉంటా. ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు చిత్తశుద్ధితో ఉన్నాం. దుర్మార్గులు, దుష్టులు మాయమాటలతో వస్తారు. యువత అప్రమత్తంగా ఉండాలి. మాయమాటలను నమ్మొద్దు. బీఆర్ఎస్ వాళ్లు చేసిన అప్పులకు రూ.75 వేల కోట్ల వడ్డీ కడుతున్నాం. రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రజల అవసరాలే పరమావధిగా పాలన సాగిస్తున్నాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
నిరుపేదలకు రేషన్ కార్డుల్లో విప్లవాత్మక మార్పులు: మంత్రి ఉత్తమ్ కుమార్