రేవంత్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాం: కేటీఆర్
ABN , Publish Date - May 04 , 2026 | 01:43 PM
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుని చచ్చే వరకు వేధిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. శనగ పంట వచ్చి నెల రోజులైనా ఇప్పటి వరకు ఆ పంటను ప్రభుత్వం కొనుగోలు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంగారెడ్డి, మే 04: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుని చచ్చే వరకు వేధిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. శనగ పంట వచ్చి.. నెల రోజులైనా ఇప్పటి వరకు ఆ పంటను ప్రభుత్వం కొనుగోలు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా ఇప్పటి వరకు సరిగా ఇవ్వలేదన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో కేటీఆర్ మాట్లాడుతూ.. అన్ని పంటలు కొనుగోలు చేస్తామని చెప్పి రైతులను ఈ ప్రభుత్వంలోని నేతలు పచ్చి మోసం చేశారని విమర్శించారు.
సీఎం కేసీఆర్ హయాంలో 11 సార్లు రైతు బంధు వేశారని కేటీఆర్ గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు చేయవద్దని ఈ ప్రభుత్వం ఆలోచన అని చెప్పారు. రాష్ట్రంలో ఏ పంట కూడా సరిగ్గా కొనుగోలు చేయడం లేదంటూ ప్రభుత్వ తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు. 95 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేయాల్సి ఉండగా.. కేవలం 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనుగోలు చేశారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలు ఇప్పటికి ప్రారంభించ లేదన్నారు. ధాన్యం దళారుల పాలు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ కుండ బద్దలు కొట్టారు.
సివిల్ సప్లై కార్పొరేషన్‌లో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపించారు. అందుకే ఈ ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని వివరించారు. సీఎం, మంత్రులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎప్పుడైనా సందర్శించారా..? అని ఈ సందర్భంగా రైతులను ఆయన సూటిగా ప్రశ్నించారు. సీఎంకి భూముల కొనుగోళ్లు, రియల్ ఎస్టేట్‌పై ఉన్న శ్రద్ధ రైతు సమస్యలపై లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వడదెబ్బ, పిడుగులు, గుండెపోటు తదితర కారణాలతో రైతులు చనిపోతుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
మంత్రి దామోదర రాజనర్సింహ రాసిన లేఖతో రైతులపై ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో తెలుస్తోందన్నారు కేటీఆర్. రాబోయే వారం రోజుల్లో అన్ని కొనుగోలు కేంద్రాలు తిరిగి రైతులకు ధైర్యం చెబుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. అవసరం అయితే తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడతామన్నారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ఆ క్రమంలో ఈ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తామని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేరళం పీసీసీ కార్యాలయంలో మిన్నంటిన సంబరాలు.. వీడియోలు వైరల్
ఏఐఏడీఎంకేతో విజయ్ చేతులు కలుపుతారా?
For More TG News And Telugu News