రాహుల్ పుట్టిన రోజున రైతు డిక్లరేషన్ బొందపెట్టిన రేవంత్ సర్కార్: హరీశ్ రావు
ABN , Publish Date - Jun 19 , 2026 | 05:45 PM
రాహుల్ గాంధీ పుట్టిన రోజున రైతు డిక్లరేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి బొందపెట్టారని హరీశ్ రావు విమర్శించారు. ధాన్యం ఏదైనా కనీస మద్దతు ధరతోపాటు బోనస్ కూడా ఇస్తామని నాడు రాహుల్ గాంధీ వరంగల్ వేదికగా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.
సిద్దిపేట, జూన్19: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదినం నాడు రైతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషం కక్కారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్‌లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారని గుర్తు చేశారు. ఆయన జన్మదినం రోజే ఆ డిక్లరేషన్‌ను తెలంగాణ సీఎం బొందపెట్టారని హరీశ్ రావు విమర్శించారు. ధాన్యం ఏదైనా కనీస మద్దతు ధరతోపాటు బోనస్ కూడా ఇస్తామని నాడు రాహుల్ గాంధీ వరంగల్ వేదికగా ప్రకటించారని గుర్తు చేశారు.
కేంద్రం చెప్పిందే కొంటాం.. ఎంత కొనమంటే అంతే కొంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) నిర్ణయించిన పంటలను మాత్రమే కొంటామంటే ఇక మీరెందుకు? అని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలను ఆయన నిలదీశారు. పేపర్ లెస్ కేబినెట్ అన్నారని.. కానీ మీది విశ్వాసం లేని కేబినెట్ అని రేవంత్ రెడ్డి మంత్రి వర్గాన్ని ఆయన అభివర్ణించారు. మీది విశ్వాసఘాతుక ప్రభుత్వమని రేవంత్ రెడ్డి సర్కారుపై నిప్పులు చెరిగారు.
పంట కొనుగోలుపై కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసిందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. తన బాధ్యత నుంచి తప్పించుకుంటోందంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం కొన్నా కొనకపోయినా.. అన్ని పంటలు కొన్నది కేసీఆర్ ప్రభుత్వమని ఆయన గుర్తు చేశారు. తన నిర్ణయం మార్చుకోవాలని రేవంత్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే హరీశ్ రావు సూచించారు. కేంద్రం ఎంఎస్‌పి ప్రకటిస్తుంది తప్ప మక్కలూ, జొన్నలు కొనదా? అని అసహనం వ్యక్తం చేశారు. పప్పు దినుసులు, వేరుశనగ 25 శాతం మాత్రమే కేంద్రం కొనుగోలు చేస్తుందన్నారు. అంటే మిగతా పంటను రైతులు బయట అమ్ముకోవాలా? అని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.
దళారుల దయా దాక్షిణ్యంపై రైతులు ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. 50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేంద్రం కొంటుందని.. మరి మిగతా పంటను రైతులు ఏం చేయాలని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలంటున్న రైతులకు ప్రభుత్వం భరోసా ఇస్తుందా? అని నిలదీశారు. తడి గుడ్డతో రైతుల గొంతును ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయన్నారు.
ఎకరాకు రెండు బస్తాలు మాత్రమే.. అదీ నెలకు ఒకటి చొప్పున ఇస్తారట అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులంటే మీకు ఎందుకు ఇంత చిన్నచూపు అని ప్రభుత్వంలోని మంత్రులను ఆయన సూటిగా ప్రశ్నించారు. యూరియా ఇచ్చే తెలివి కూడా లేదా? అని ప్రభుత్వ వైఖరిని ఆయన ఎండగట్టారు. మిర్చి రైతులు ఎకరాకు ఐదారు యూరియా బస్తాలు వాడుతారని.. మరి మీరు రెండే ఇస్తే మిగతావి ఎట్లా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
కేంద్రం 30 శాతం యూరియా ధరలు పెంచిందని వివరించారు. రెండు బస్తాల ఆలోచన విరమించుకోవాలని ప్రభుత్వానికి ఆయన హితవు పలికారు. 45 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయిల రైతు బంధు ఇస్తామన్నారని.. 90 రోజులు అయిందని ఇప్పటికీ రైతుల ఖాతాల్లో నగదు మొత్తం పడలేదన్నారు. ఎకరాకు రూ.15 వేలు అన్నారని చెప్పారు. 2024-25 వానాకాలం పంటకు ఒక్క రూపాయి ఇవ్వలేదని.. పూర్తిగా ఎగ్గొట్టారని ఆయన పేర్కొన్నారు.
రైతుబంధు కింద కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 5 పంటలకు రైతులకు రూ.29,358 కోట్లు బకాయి పడిందని ఆరోపించారు. రైతు బీమా ఆగలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చెప్పారని గుర్తు చేశారు. మరి ఈ ఏడాది జనవరి నుంచి నేటి వరకు రైతు బీమా ఆగిందా? లేదా చెప్పాలని మంత్రులను ఈ సందర్భంగా ఆయన బల్ల గుద్ది మరీ ప్రశ్నించారు. దీనిపై చర్చకు ఏ ఊరుకైనా పోదాం వస్తారా? అని మంత్రులకు హరీశ్ రావు సవాల్ విసిరారు.
మొత్తం రాష్ట్రంలో 7,600 మంది రైతులకు బీమా రాలేదని గణాంకాలతో సహా హరీశ్‌రావు వివరించారు. ఎందుకు బీమా రావడం లేదంటే.. ప్రభుత్వం ప్రీమియం కట్టలేదని రైతులు చెప్పారన్నారు. ఈ నేపథ్యంలో గురువారం మీరు కేబినెట్‌లో చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అన్ని పంటలు యథావిధిగా కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. తప్పుడు నిర్ణయం తీసుకున్నందుకు రైతులకు క్షమాపణ చెప్పాలని రేవంత్ సర్కార్‌ను హరీశ్ రావు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
యువతకు ప్రధాని మోదీ 24 కోట్ల ఉద్యోగాలు బాకీ: జగ్గారెడ్డి
రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
Read Latest Telangana News And Telugu News