అకాల వర్షాలతో నష్టాల్లో రైతులు.. ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్
ABN , Publish Date - May 09 , 2026 | 04:40 PM
రైతులు బాధపడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కోతల సీజన్ వచ్చినప్పుడల్లా రివ్యూ మీటింగ్‌లు పెట్టి రైతుల అవసరాలన్నీ తీర్చేవారని గుర్తుచేశారు.
సిద్దిపేట, మే 9: అకాల వర్షాల వల్ల రైతులు చాలా నష్టపోతున్నారని.. కానీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ మండిపడ్డారు. శనివారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లిపూర్ సొసైటీ వద్ద పొద్దు తిరుగుడు, వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు బాధపడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదని విమర్శించారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కోతల సీజన్ వచ్చినప్పుడల్లా రివ్యూ మీటింగ్‌లు పెట్టి రైతుల అవసరాలన్నీ తీర్చేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం సీఎంతో పాటు మంత్రులు కూడా రివ్యూ చేసిన పాపాన పోలేదని మండిపడ్డారు.
వడ్లు, పొద్దు తిరుగుడు, మక్కలు ఎలా కొనుగోలు చేస్తున్నారో చూడడానికి ఒక్క మంత్రి కూడా రైతుల దగ్గరికి రాలేదని మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి రైతుల కంటే ముఖ్యమైన పని మరేముంటుందని ప్రశ్నించారు. సిద్దిపేట, చిన్నకోడూరు మండలాల్లో సన్‌ఫ్లవర్ రైతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అని తేడా లేకుండా రైతులు పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పంట మార్పిడి చేయాలని చెబుతున్నారని.. పంట మార్పిడి చేస్తే కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు.
రేవంత్ రెడ్డికి రైతులపై పట్టింపు లేదని.. మూడు పంటలకు రైతుబంధు కూడా ఇవ్వలేదని హరీశ్ విమర్శించారు. ఢిల్లీకి లేఖలు రాయడం మాని, వెంటనే పండిన పంటను కొనుగోలు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా సూర్యాపేట, సిద్దిపేట, జాలి తదితర ప్రాంతాల్లో వడ్లను బి గ్రేడ్ పేరుతో, తరుగు పేరుతో రైతులకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. ‘రేవంత్ రెడ్డి.. మాటలు బంద్ చేసి ఐకేపీ సెంటర్ దగ్గరికి వెళ్లి రైతులతో నేరుగా మాట్లాడాలి. 40 రోజులుగా సన్‌ఫ్లవర్ కొనుగోలు చేయకపోవడంతో పంటకు చెదలు పడుతున్నాయి’ అని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
సీఎం రేవంత్‌కు పొలిటికల్ స్కోరింగ్ తప్ప స్టేట్ స్కోరింగ్ లేదు: హరీశ్
CURE, PURE, RARE మోడల్‌తో తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్
Read Latest Telangana News And Telugu News