మెదక్‌లో పంట పొలాల్లో మొసలి కలకలం.. పరుగులు పెట్టిన రైతులు
ABN , Publish Date - Oct 29 , 2026 | 08:19 AM
మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం ఎనికెపల్లి గ్రామ శివారులో పంట పొలాల్లోకి భారీ మొసలి రావడంతో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే..
మెదక్, అక్టోబర్ 29: జిల్లాలోని పాపన్నపేట మండలం ఎనికెపల్లి గ్రామ శివారు పంట పొలాల్లో మొసలి కలకలం సృష్టించింది. మంజీరా నది నుంచి ఓ మొసలి పంట పొలాల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లిన రైతుకు మొసలి కనిపించడంతో ఒక్కసారిగా అప్రమత్తమయ్యాడు. పొలాల్లో మొసలి ఉండటాన్ని గమనించిన రైతు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో గ్రామ శివారులో మొసలి సంచారం విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
రైతు నుంచి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించారు. ఫారెస్ట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మొసలిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. పంట పొలాల్లో ఉన్న మొసలిని పట్టుకునేందుకు సిబ్బంది సుమారు గంటసేపు శ్రమించారు. చివరకు మొసలిని పట్టుకోవడంతో అక్కడి పరిస్థితి అదుపులోకి వచ్చింది. వ్యవసాయ పనుల కోసం పొలాల వద్దకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అప్రాధాన్య పోస్టుకు జయేశ్ రంజన్
ఆ జూనియర్ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి
Read Latest AP News And Telangana News