దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన బాధ్యతలు చేపట్టారు: జస్టిస్ ఎన్వీ రమణ
ABN , Publish Date - Sep 26 , 2026 | 08:26 PM
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వల్లే మన దేశం ఇప్పుడు ఈ స్థాయిలో ఉందని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దేశం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారని ఆయన గుర్తుచేశారు.
ఇంటర్‌నెట్ డెస్క్: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వల్లే మన దేశం ఇప్పుడు ఈ స్థాయిలో ఉందని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దేశం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారని ఆయన గుర్తుచేశారు. నాడు ఆయన తీసుకున్న చర్యల వల్లే మన దేశం కష్టాల నుంచి గట్టెక్కిందని చెప్పారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ విప్రో సర్కిల్ వద్ద డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశానికి మన్మోహన్ చేసిన సేవలను, రాజ్యాంగ విలువలపై ఆయనకున్న నిబద్ధతను జస్టిస్ రమణ కొనియాడారు. మన్మోహన్‌ను ఆర్థిక సంస్కరణల దార్శనికుడిగా అభివర్ణించారు. ఆయన చేపట్టిన సరళీకృత ఆర్థిక విధానాల వల్లే నేడు ఇలాంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లు ఏర్పడి అంతటి అభివృద్ధి సాధించాయన్నారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక పరిజ్ఞానం తెలిసే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆయనకు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించారని గుర్తుచేశారు.
రాజ్యాంగ విలువల పరిరక్షకుడు
దేశ ప్రధానిగా రాజ్యాంగ నిబంధనలకు, ప్రజాస్వామ్య విలువలకు మన్మోహన్ సింగ్ ఎల్లప్పుడూ పెద్దపీట వేశారని జస్టిస్ రమణ ప్రశంసించారు. విద్యా హక్కు, సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ పథకం వంటివి మన్మోహన్ సింగ్ తెచ్చినవే అని జస్టిస్ రమణ తెలిపారు. ఎకనామిక్స్ టైమ్స్ ఆయనను ఎకానమిక్ ఫైటర్‌గా అభివర్ణించిందని చెప్పారు. ఆధునిక తెలంగాణ ఆర్థిక వ్యవస్థ రూపకల్పనలో ఆయన సంస్కరణలు కీలక పాత్ర పోషించాయని రమణ కొనియాడారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్డీఏ స్పష్టత
మద్యం షాపుల్లో సీసీ టీవీ కెమెరాలు.. ట్రాకింగ్ విధానంతో పంపిణీ: మంత్రి కొల్లు రవీంద్ర