కలిసి రండి.. తేల్చుకుందాం
ABN , Publish Date - Nov 27 , 2026 | 03:40 AM
‘‘తెలంగాణలో బీజేపీ ఎక్కడుంది!? ఎంతమంది వార్డు మెంబర్లు, ఎంతమంది సర్పంచులు, ఎన్ని మునిసిపాలిటీలు గెలిచారు!?
బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా రావద్దు
కలిసొస్తే అసెంబ్లీ సాక్షిగా లెక్కలు తేలుద్దాం
కృష్ణా నీటిని జగన్ రెడ్డికి తాకట్టు పెట్టిన కేసీఆర్
ఆంధ్రోళ్లు తరలిస్తుంటే గాడిద పళ్లు తోమారా?
ఉద్యమకారులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే
కేసీఆర్ నిజాం కంటే ధనవంతుడయ్యారు
వచ్చే ఏడాది మరో 25 వేల ప్రభుత్వ కొలువులు
అచ్చంపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మహబూబ్‌నగర్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘తెలంగాణలో బీజేపీ ఎక్కడుంది!? ఎంతమంది వార్డు మెంబర్లు, ఎంతమంది సర్పంచులు, ఎన్ని మునిసిపాలిటీలు గెలిచారు!? బీజేపీ లెక్కెంత? ఆ పార్టీ బిసాజ్ (స్థాయి) ఎంత? అధికారంలోకి వచ్చుడు కాదు కదా.. మా పార్టీ మీటింగుల వద్ద పల్లీ బఠానీలు అమ్ముకునే వారంత లేరు ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు! ఇక, బీఆర్‌ఎస్ బింకాలకు పోతోంది. వచ్చే ఎన్నికల్లో విడివిడిగా రావద్దు.. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి వస్తే అసెంబ్లీ సాక్షిగా లెక్కలు తేలుద్దాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దేశ రాజకీయ చరిత్రలో అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ బతికి ఉందని, కానీ, అధికారం కోల్పోతే బీజేపీ చచ్చిన పాముతో సమానమని దుయ్యబట్టారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో రూ.450 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ చీరలు, చేయూత పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. అనంతరం సభలో ప్రసంగించారు. ‘‘నిన్న మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చి పొంకనాలు కొట్టారు. ఆయన రాజీనామా చేసిన నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని బిహార్ ప్రజలు బండకేసి కొట్టారు. సొంత నియోజకవర్గంలో గెలవలేనోడు నాకు చెప్పేవారయ్యారా?’’ అని ఎద్దేవా చేశారు.
నీళ్లన్నీ జగన్‌రెడ్డికి తాకట్టు
ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన అచ్చంపేట లిఫ్టు, డిండి, ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, పాలమూరు- రంగారెడ్డి, బీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, జూరాలలో మిగిలిన పనులను కేసీఆర్ పదేళ్లు పడావు పెట్టారని, ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం చేస్తే తెలంగాణలో కూడా పాలమూరు ప్రజలను కృష్ణా నదిలో నిండా ముంచారని సీఎం విమర్శించారు. ‘‘కృష్ణా నీటిని జగన్‌రెడ్డికి తాకట్టు పెట్టారు. రోజమ్మ రొయ్యల పులుసు పెడితే తిని.. బలిసి.. రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్న వారికి నీళ్లపై మాట్లాడే నైతిక హక్కు ఉందా? ఈరోజు నీళ్లు ఆంధ్రాకు పోతున్నాయని మాట్లాడుతున్నారు కదా? ఇందుకు పదేళ్లలో లక్షల కోట్లు ఖర్చు చేసి కమీషన్లు మెక్కి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం కారణం కాదా? పదేళ్లలో పాలమూరు, అచ్చంపేట, డిండి, ఎస్‌ఎల్‌బీసీ పూర్తయ్యి ఉంటే ఆ నీళ్లు ఈ భూముల్లో పారేవి కదా? పాపాల భైరవుడిలా, మా పాలిట శనిలాగా పట్టి పీడించి.. బతుకులు ఎడారి కావడానికి కేసీఆర్ కారణం కాదా?’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. పదేళ్లలో పనులు చేసి ఉంటే రోజుకు 3 టీఎంసీలు తీసుకుంటే పాలమూరు సస్యశ్యామలంగా మారేదన్నారు. ఇదే పదేళ్లలో పోతిరెడ్డిపాడులో నీటి తరలింపు 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేలకు మారిందని, ముచ్చుమర్రి, మల్యాల, రాయలసీమ, హంద్రీనీవా ప్రాజెక్టులు పూర్తికావడంతో ఆంధ్రోళ్లు రోజుకు 11 టీఎంసీలను శ్రీశైలం నుంచి గజదొంగల్లా తరలిస్తుంటే మీరు గాడిద పళ్లు తోమారా? జగన్‌రెడ్డికి గులాంగిరీ చేశారా? అని మండిపడ్డారు.
కృష్ణా నదిలో 811 టీఎంసీల నీళ్లుంటే, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని చంద్రబాబు, ఉమా భారతి సమక్షంలో సంతకాలు చేసి మామా అల్లుళ్లు తెలంగాణకు మరణ శాసనం రాశారని మండిపడ్డారు. చంద్రబాబు మోచేతి నీళ్లు కేసీఆర్ తాగితే.. వైఎస్ఆర్ మోచేతి నీరు హరీశ్ రావు తాగారని, హరీశ్ రావు నిజమైన గురువు కేసీఆర్ కాదని, వైఎ్‌సఆర్ అని ఆరోపించారు. వార్డు మెంబర్ కాని హరీశ్‌ను మొదట మంత్రిని చేసి, తర్వాత ఎమ్మెల్యేను చేశారని, అందుకే మామను ప్రైవేటుగానైనా తిట్టే హరీశ్ రావు.. వైఎస్ఆర్, జగన్‌ను ఒక్క మాట అనరని విమర్శించారు.
సొంత చెల్లినే గెంటేసిన ఘనత వారిది
‘‘రాష్ట్రంలో ఓవైపు సొంత చెల్లెలికి వాటా ఇవ్వాల్సి వస్తుందని, పుట్టింటికి వస్తే బుక్కెడు బువ్వ పెట్టాల్సి వస్తుందని మెడ పట్టి నెట్టినవారు ఉన్నారు. మరోవైపు, కోటిమంది ఆడ బిడ్డలను సొంత ఆడబిడ్డల్లా చూసుకొని, చీర, సారె పెట్టే రేవంతన్న ఉన్నారు. వాళ్లకు నాకు పులికి- గుంట నక్కకు ఉన్న తేడా.. నక్కకు నాకలోకానికి ఉన్న తేడా ఉంది’’ అని రేవంత్ దుయ్యబట్టారు. పదేళ్లలో కేసీఆర్, కేటీఆర్, సంతోష్, హరీశ్ ఆస్తులు లక్షల కోట్లు దాటాయని, ఫామ్‌హౌజ్‌లు, టీవీలు, పేపర్లు, వ్యాపారాలు, హోటళ్లు, సారా, పాలు, గంజాయి, గుడుంబా వ్యాపారం.. ప్రతి దాంట్లో వారికి వాటా ఉందని ఆరోపించారు. అదే సమయంలో, బీఆర్‌ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించారు. ఇటీవల ఉద్యమకారుడు అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటే పొన్నం ప్రభాకర్‌ను పంపించి ఆదుకున్నామని చెప్పారు. తెలంగాణ రూ.8.11 లక్షల కోట్ల అప్పులపాలైతే.. కేసీఆర్ నిజాం కంటే ధనవంతుడయ్యారని ధ్వజమెత్తారు. పెళ్లం మొగుడు మాట్లాడుకుంటే ఫోన్లు వినడం, ఆంధ్రవాళ్లను బెదిరించి పాలు అమ్ముకోవడం, కమీషన్లు, అబద్ధాలు లేకపోతే వాళ్లు బతకలేరని విమర్శించారు.
ముఖం చెల్లక ఫాంహౌజ్‌కే పరిమితం
‘‘దేశంలో అధికారం కోసం వచ్చిన పార్టీలు ఏవీ బతకలేదు. అధికారం పోయిన వెంటనే చచ్చిపోయాయి. జనతా పార్టీ కూడా అధికారం కోసం వచ్చి.. అది పోయిన తర్వాత చచ్చిపోయింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ 2023లో అధికారం కోల్పోతే ప్రజల్లోకి రాలేక, ముఖం చెల్లక ఆ పార్టీ నాయకుడు ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారు. తెలంగాణ ఏర్పడితే ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తామంటే కల్వకుర్తి, పాలమూరు- రంగారెడ్డి, ప్రాణహిత- చేవెళ్ల పూర్తి చేస్తారని అనుకున్నాను. కానీ, కేసీఆర్ మాత్రం ఫుల్, హాఫ్, క్వార్టర్ ఎత్తుడు పోసుడు అని అనుకున్నారు. అధికారంలోఉంటే దోచుకోవడం, కొడుకు, అల్లుడు, బిడ్డకు పంచిపెట్టడం, అధికారం పోతే ప్రజల్లోకి రాకుండా.. సమస్యలపై మాట్లాడకుండా, కార్యకర్తలకు అండగా ఉండకుండా, ఫామ్‌హౌజ్‌కు పోయి పండుకునే నాయకుడు కేసీఆర్’’ అని దుయ్యబట్టారు. సంతకం పెట్టి దోస్తు పుట్టిన రోజు ఉంటే పార్టీ చేసుకున్నారని పోలీసులపై ఉన్నతాధికారులు వేటు వేశారని, మరి, 34 నెలల్లో రూ.2 కోట్ల వేతనం పొంది.. 300 మంది పోలీసుల రక్షణ తీసుకొని కేసీఆర్ ప్రజల్లోకి రావడం లేదని, అసెంబ్లీకి వచ్చి మాట్లాడటం లేదని మండిపడ్డారు. ఆయన్ను ఎలా శిక్షించాలో ప్రజలే చెప్పాలని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కావాలంటే గడ్డం కాదు.. గుండె ధైర్యం ఉండాలని, నిటారుగా నిలబడే శక్తి ఉండాలని కేటీఆర్‌ను ఎద్దేవా చేశారు. ఈ 34 నెలల్లో తాను సెలవు తీసుకోలేదని, రోజుకు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నామో.. ఎంతమందిని కలుస్తున్నామో గమనించాలని ప్రజలను కోరారు. కంటి మీద కునుకు లేకుండా విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నామన్నారు.సభలోమంత్రులు జూపల్లి, వాకిటి, సీతక్క, అడ్లూరి తదితరులు పాల్గొన్నారు.
మరో 25 వేల కొలువులు
వచ్చే ఏడాది భర్తీ చేయనున్నాం: రేవంత్
‘‘ప్రజా ప్రభుత్వంలో 112 మంది పేద బిడ్డలను గ్రూప్ 1లో డీఎస్పీలను చేశాం. 562 మందికి ఆర్డీవో కేడర్ జాబ్‌లు ఇచ్చాం. గ్రూప్ 2, 3, 4 ఉద్యోగాలు భర్తీ చేశాం. కానిస్టేబుళ్లు, టీచర్ల నియమాకాలు చేశాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 75 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. రాబోయే సంవత్సరంలో 25 వేల ఉద్యోగాలు ఇస్తాం’’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల 7,500 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని, తొందర్లోనే 2 వేల హోం గార్డు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నామని తెలిపారు. వెరసి, లక్ష ఉద్యోగాలు పూర్తి చేయబోతున్నామన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ నెల 30 నుంచి లోక్‌సభ సమావేశాలు.. తెరపైకి పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులు?
రాహుల్ గాంధీ ఫొటో పెడితే బ్లాక్ చేస్తున్నారు.. మెటాపై కోర్టుకెక్కిన కాంగ్రెస్