భూత్పూర్‌లోని పౌల్ట్రీఫారంపై ఈగల్ ఫోర్స్ దాడి.. అల్ఫ్రాజోలం స్వాధీనం
ABN , Publish Date - Jul 19 , 2026 | 06:28 PM
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లోని పౌల్ట్రీ ఫారంపై ఈగల్ ఫోర్స్, నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో అక్రమంగా తయారు చేస్తున్న కిలోకు పైగా అల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, జులై 19: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లోని పౌల్ట్రీ ఫారంపై ఈగల్ ఫోర్స్, నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో అక్రమంగా తయారు చేస్తున్న కిలోకు పైగా అల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి మొత్తం 35 మందిని గుర్తించారు. వారిలో 12 మందిని అరెస్ట్ చేశారు. మరో 23 మంది పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్‌లో వారిపై క్రైమ్ నెం.20/2026 కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు మలేలా జయప్రకాశ్ గౌడ్‌ను ఈగల్ ఫోర్స్ గుర్తించింది. 2025లో ఇదే కేసులో అతడు అరెస్టయ్యాడు. ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. అనంతరం బెయిల్‌పై విడుదలై.. మళ్లీ డ్రగ్స్ తయారు చేయడం ప్రారంభించినట్లు ఈగల్ ఫోర్స్ గుర్తించింది. అలాగే ఇదే కేసులో కృష్ణయ్య గౌడ్ కీలక నిందితుడుగా ఉన్నారని తెలిపింది. అతడు కూడా పరారీలో ఉన్నాడని పేర్కొంది. అతడు పలుమార్లు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడని వెల్లడించింది.
తాటి కల్లులో కల్తీ కోసం ఈ అల్ప్రాజోలం తయారు చేస్తున్నట్లు ఈ దర్యాప్తులో నిందితులు వెల్లడించారని ఈగల ఫోర్స్ తెలిపింది. పౌల్ట్రీ పారంలో ఈ అల్ఫ్రాజోలం తయారీ యూనిట్‌ను ధ్వంసం చేసింది. ఇక పరారీలో ఉన్న వారిలో రసాయనాల సరఫరాదారులు, వ్యాపారులు కూడా ఉన్నట్లు గుర్తించింది. జీడిమెట్ల, ప్రశాంత్‌నగర్, ఫతేనగర్, బాలానగర్ ప్రాంతాల నుంచి ఈ రసాయనాల సరఫరా చేసినట్లు కనుగొంది. డ్రగ్స్ తయారీకి అవసరమైన రసాయనాలు సరఫరా చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఈగల్ ఫోర్స్ వివరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎల్‌నినో ఎఫెక్ట్: తెలంగాణలో జలసిరిపై మంత్రి సీతక్క ఫోకస్
రైతులకు నీళ్లు ఇచ్చేదాకా.. వదిలిపెట్టం: హరీశ్ రావు
For More TG News And Telugu News