ప్రైవేట్ ఆసుపత్రులకు లబ్ధి చేకూరుస్తున్న ఎమ్మెల్యే: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఫైర్
ABN , Publish Date - Oct 31 , 2026 | 01:49 PM
ఇప్పటికైనా జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బందిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.
మహబూబ్‌నగర్, అక్టోబర్ 31: ఇప్పటికైనా జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బందిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం జడ్చర్లలో అంబేద్కర్ కళా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రి బాగా లేదంటూ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తద్వారా ప్రైవేట్ ఆస్పత్రులకు లబ్ధి చేకూరుస్తున్నారని ఎమ్మెల్యే వైఖరిని ఎండగట్టారు.
వైద్యులు, సిబ్బంది ఉంటే ఆసుపత్రికి పేషంట్స్ వస్తారా? లేక పేషంట్స్ వస్తే వైద్యులు వస్తారా? అని ఎమ్మెల్యేను ఆయన ప్రశ్నించారు. జడ్చర్ల, మిడ్జిల్ మండలాల పరిధిలోని 50 గ్రామాల ప్రజలు ఈ ఆసుపత్రికి వస్తారని వివరించారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిది బాధ్యతారాహిత్యం అని విమర్శించారు.
జడ్చర్ల నియోజకవర్గంలో సమస్యల పరిష్కారాన్ని వదిలేసి ఎటువంటి రాజకీయాలు నడుస్తున్నాయో చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. హుందాగా రాజకీయాలు చేయాలని చాలా సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చెప్పానని తెలిపారు. ఎమ్మెల్యే సంస్కారం ఏమిటనేది ప్రజలంతా చూస్తున్నారని అన్నారు.
జడ్చర్లకు మూడేళ్ల కిందట నీళ్లు వస్తే ఇప్పటికీ అదే వీడియో పెట్టి చూపిస్తున్నారంటూ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఎప్పుడూ నీళ్లు రాలేదని చెప్పారు. నీ స్వగ్రామంలోని అసైన్డ్‌ల్యాండ్‌ను డబుల్ బెడ్ రూం ఇళ్లకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటాయించామని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గుర్తు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాప్తాడులో విద్యార్థినిపై దాడి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
వెండి ధరలో భారీ పతనం.. ఒక్కరోజే రూ.10 వేల తగ్గుదల
For More TG News and Telugu News