లారీలతో గద్వాల ఆర్టీవో ఆఫీసు దిగ్బంధం
ABN , Publish Date - Nov 28 , 2026 | 06:01 AM
గద్వాల ఆర్టీవో అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ లారీ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు పెద్ద సంఖ్యలో లారీలతో కార్యాలయాన్ని దిగ్బంధించారు.
అక్రమ వసూళ్లు, భారీ జరిమానాలపై లారీ యజమానులు, డ్రైవర్ల ఆగ్రహం
గద్వాల, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): గద్వాల ఆర్టీవో అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ లారీ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు పెద్ద సంఖ్యలో లారీలతో కార్యాలయాన్ని దిగ్బంధించారు. ఆర్టీవో అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సరుకులను తీసుకెళ్తున్న లారీలను ఆపి రేడియం స్టిక్కర్లు, పొల్యూషన్ సర్టిఫికెట్లు, పరిమిట్ల పేరుతో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని.. ప్రశ్నిస్తే భారీ జరిమానాలను వేస్తున్నారని లారీల డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని తొలుత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేయగా.. ఆయన ఇన్‌చార్జ్ ఆర్టీవో రాధికకు ఫోన్ చేసినప్పటికీ ఆమె స్పందించలేదు. దీంతో లారీ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు లారీలను తీసుకెళ్లి ఆర్టీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వారికి మద్దతుగా ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి కూడా అక్కడికి చేరుకోవడంతో అక్కడ గంట పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆర్టీవో అధికారులు ఎమ్మెల్యేతో చర్చలు జరిపారు. ఎక్కువ సంఖ్యలో వాహనాలు, లారీలను వ్యవసాయ పనులకే ఉపయోగించుకుంటారని.. అలాంటి వాటిపై కూడా నిబంధనల పేరుతో భారీగా జరిమానాలు ఎలా వేస్తారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఈ విషయాలపై ఎమ్మెల్యే నేరుగా రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌కుఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్