నిజామాబాద్ బస్వాపూర్ గ్రామ శివారులో చిరుత సంచారం
ABN , Publish Date - Jun 27 , 2026 | 03:03 PM
నిజామాబాద్ జిల్లా జుక్కల్ మండల పరిధిలోని బస్వాపూర్ శివారులో చిరుత సంచరిస్తున్న విషయం తెలిసి గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.
నిజామాబాద్, జూన్ 27: జుక్కల్ మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులో మేత మేస్తున్న గొర్రెల గుంపులోకి వచ్చిన చిరుత.. ఓ మేకపిల్లను ఎత్తుకెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు అక్కడ కనిపించిన అడుగుజాడలను పరిశీలించి అవి చిరుత పాదాలేనని నిర్ధారించారు.
ఈ నేపథ్యంలో రైతులు, పశువుల కాపరులు, గ్రామ ప్రజలు ఒంటరిగా పొలాలు, అటవీ ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో అప్రమత్తంగా ఉండాలని, చిరుత కనిపించినా లేదా ఆనవాళ్లు గుర్తించినా వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రామ పరిసరాల్లో చిరుత సంచారం నేపథ్యంలో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అటవీ శాఖ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైతే చిరుతను బంధించేందుకు తగిన చర్యలు చేపడతామని తెలిపారు.
ఇవి కూడా చదవండి...
అమెరికాకు తగిన బుద్ధి చెబుతాం.. దాడులపై ఇరాన్ ఆగ్రహం..
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం: మంత్రి పొన్నం
Read Latest Telangana News And Telugu News