Share News

రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు: కేటీఆర్

ABN , Publish Date - Feb 11 , 2026 | 06:22 PM

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో గులాబీ పార్టీ శ్రేణులను ఉద్దేశిస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావు ఆసక్తికర ట్వీట్ చేశారు.

రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు: కేటీఆర్
Telangana Municipal Elections 2026

ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 11: తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ(బుధవారం) మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో గులాబీ పార్టీ శ్రేణులను ఉద్దేశిస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావు ఆసక్తికర ట్వీట్ చేశారు. అలానే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై కేటీఆర్ ఫైర్ అయ్యారు.


'మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా వీరోచితంగా పోరాడిన గులాబీ సైనికులందరికీ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకూ పురపాలక సమరంలో మీరు కనబరిచిన పోరాట స్ఫూర్తి బీఆర్ఎస్‌కు కొండంత బలాన్నిచ్చింది. పార్టీలో ఆకాశమంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. రెండేళ్ల పాలనలో ఘోరమైన పరిపాలనా వైఫల్యాలను మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్.. ఓటమి భయంతోనే ఈ ఎన్నికల్లో ఇంతటి దౌర్జన్య కాండకు దిగారు. కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో మొదలైన పరాభవం, పట్టణాల్లోనూ తప్పదనే ఆందోళనతోనే అడుగడుగునా రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు' అని కేటీఆర్(KTR) అన్నారు.


'సీఎం రేవంత్ రెడ్డి అక్రమంగా లూటీ చేసిన వేలకోట్ల ప్రజాధనంతో ప్రజాతీర్పునే మార్చాలన్న ఈ కుట్రలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. పోలీసు శాఖను అడ్డంపెట్టుకుని బీఆర్ఎస్ శ్రేణులపై సాగించిన వేధింపుల పర్వానికి, దాడులకు రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజలకిచ్చిన హామీలను, మొత్తంగా పరిపాలనను గాలికి వదిలేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన పాపం రేవంత్ రెడ్డిని ప్రతినిత్యం వెంటాడుతూనే ఉంటుంది' అంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌‌కు బండి సంజయ్ సూటిప్రశ్న

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ షురూ..

Updated Date - Feb 11 , 2026 | 07:08 PM