మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం మాదే: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Feb 10 , 2026 | 02:59 PM
రేపు తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరుగనున్నాయి.. వీటిలో 80 శాతం అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మంత్రి పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 10: రాష్ట్రంలో రేపు జరుగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్ విజయం తధ్యం
రాష్ట్రవ్యాప్తంగా రేపు (ఫిబ్రవరి 11) జరగనున్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 శాతం స్థానాలను కైవసం చేసుకుంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. గడిచిన రెండేళ్లలో ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చామని, అందుకే ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను దీవించబోతున్నారని ఆయన పేర్కొన్నారు.
ఆర్థిక క్రమశిక్షణ - ప్రజా సంక్షేమం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని 8 లక్షల 19 వేల కోట్ల అప్పుల్లో ముంచిందని పొంగులేటి విమర్శించారు. ప్రస్తుతం నెలకు 6,300 కోట్ల రూపాయలు కేవలం అప్పుల జమకే కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమం కుంటుపడకుండా చూస్తున్నామన్నారు.
వరి వేస్తే ఉరి అనిన కాలం పోయి, నేడు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తున్నామని గుర్తుచేశారు. విద్యార్థుల కోసం డైట్, కాస్మెటిక్ ఛార్జీల పెంపుతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు - గృహ నిర్మాణ పథకం
'గత పాలనలో దొరలు బొమ్మలు చూపించారు తప్ప ఇళ్లు ఇవ్వలేదు' అని విమర్శిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే పార్టీలకు అతీతంగా 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని మంత్రి పొంగులేటి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని, పట్టణాల్లో ఇళ్ల స్థలాలు లేని పేదల కోసం G+3 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్‌పై ఉక్కుపాదం
ఫోన్ ట్యాపింగ్ అంశంపై మంత్రి తీవ్రంగా స్పందించారు. 'నేను అధికారులతో మాట్లాడిన టెలి కాన్ఫరెన్స్ విషయాలు బయటకు వస్తున్నాయంటే, ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని అర్థమవుతోంది. ఏ ఫామ్ హౌస్ నుండి ఇది జరుగుతుందో ఆధారాలు ఉన్నాయి.' అని మంత్రి తెలిపారు.
సామాన్యుల నుంచి సొంత కుటుంబ సభ్యుల (అల్లుడు, కూతురు) ఫోన్ల వరకు ట్యాప్ చేయించారని మంత్రి ఆరోపించారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ఆధారాలతో ఉన్నాయని, చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు.
సీఎం రేసులో లేను
ప్రతిపక్ష నేతలు అసభ్య పదజాలంతో హీనంగా మాట్లాడుతున్నారని, వారికి ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని పొంగులేటి మండిపడ్డారు. తాను సీఎం రేసులో లేనని, కేవలం కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తను మాత్రమేనని పొంగులేటి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నా జన్మలో ఇదో అద్భుత ఘట్టం: బండ్ల గణేశ్
మున్సిపల్ ఎన్నికలు... సెలవు ప్రకటించిన సర్కార్..
For More AP News And Telugu News