తమ్ముడూ లేరా.. ఈ అక్కతో రాఖీ కట్టించుకో..
ABN , Publish Date - Aug 29 , 2026 | 11:01 AM
‘తమ్ముడూ లేరా.. ఈరోజు రాఖీ పండుగ. నీ అక్కతో రాఖీ కట్టించుకో..’ అని విలపిస్తూ ఆ సోదరి తన తమ్ముడి మృతదేహానికి రక్ష కట్టింది. ఈ దృశ్యాన్ని చూసి వారి తల్లిదండ్రులు, వారి కుటుంబమే కాదు.. బంధువులు, స్థానికులంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ హృదయవిదారక ఘటన..
మణుగూరు (ఆంధ్రజ్యోతి): ‘తమ్ముడూ లేరా.. ఈరోజు రాఖీ పండుగ. నీ అక్కతో రాఖీ కట్టించుకో..’ అని విలపిస్తూ ఆ సోదరి తన తమ్ముడి మృతదేహానికి రక్ష కట్టింది. ఈ దృశ్యాన్ని చూసి వారి తల్లిదండ్రులు, వారి కుటుంబమే కాదు.. బంధువులు, స్థానికులంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ హృదయవిదారక ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో శుక్రవారం జరిగింది. ఓ పాత వివాదం విషయంలో యువకుల మధ్య గురువారం ఉదయం జరిగిన ఘర్షణలో మణుగూరుకు చెందిన సింహాద్రి శివకుమార్ మృతిచెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఉండే శివకుమార్ రాఖీ పండుగ సందర్భంగా తన అక్కతో రాఖీ కట్టించుకునేందుకు ఇంటికి వచ్చి.. పట్టణంలోని ఎంకే గ్యాంగ్ జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు మృతదేహాన్ని గురవారం రాత్రి కుటుంబ సభ్యులకు అప్పగించారు. శుక్రవారం కుటుంబ సభ్యులు, బంధువులు శివకుమార్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం రాఖీ పండుగ కూడా కావడంతో శివకుమార్ అక్క విమల.. తమ్ముడి మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదించారు.
‘తమ్ముడు.. తమ్ముడు’ అని పిలుస్తూ శివకుమార్ అక్క విమల తన తమ్ముడి చేతికి రాఖీ కట్టి బోరున విలపించారు. ఆ దృశ్యాన్ని చూసిన తల్లి కుమారి, తండ్రి సింహాద్రి వీరభద్రాచారితో పాటు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మరో రెండు నెలల్లో తమ కుమారుడికి పెళ్లి చేద్దామనుకుంటే.. ఇలా హత్యకు గురవుతాడని ఊహించలేదని రోదించారు. శివకుమార్‌కు కొత్తదుస్తులు వేసి పెళ్లికొడుకుగా ముస్తాబు చేసి.. కళ్లారా చూసుకుని కుమారుడికి వీడ్కోలు పలికారు. తమకు మిగిలిన కడుపుకోత ఏ తల్లిదండ్రులకు రాకూడదని, దోషులకు కఠిన శిక్షలు వేయాలని విలపిస్తూ పోలీసులకు విన్నవించారు. అనంతరం కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు స్థానికులంతా కలిసి శివకుమార్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Also Read:
ఇల్లందులో ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. మతం మారాలంటూ
సైబర్ క్రైంలోనూ గోల్డెన్ అవర్ కీలకం..
మధ్య ఆసియాపై భారత్ ఫోకస్.. మోదీ కీలక పర్యటన