Khammam Girl Marries Paris Native: ఎల్లలు దాటిన ప్రేమ.. ఖమ్మం అమ్మాయి, పారిస్ అబ్బాయి పెళ్లి..
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:29 PM
ప్రశాంతి అనే యువతి ఖమ్మంలో బీటెక్ పూర్తి చేసింది. తర్వాత ఎంఎస్ చదివేందుకు ఫ్రాన్స్ వెళ్లింది. అక్కడ ఆమెకు పారిస్ నగరానికి చెందిన తోటి విద్యార్థి నాతన్ క్రిస్టోఫ్ జూబర్ట్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొంతకాలానికి ప్రేమగా మారింది..
ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతి ఉన్నత చదువుల కోసం ఫ్రాన్స్ దేశం వెళ్లింది. అక్కడ తనతో పాటూ చదువుకునే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొంత కాలానికి బలమైన స్నేహంగా మారింది. చదువులు పూర్తయిన తర్వాత ఇద్దరూ ఒకే చోట ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో చేరిన తర్వాత స్నేహం.. ప్రేమగా మారింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని అర్థం చేసుకున్నారు. కులం, మతం, ప్రాంతం, దేశం వేరైనా సరే పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి పీటలు ఎక్కారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మహ్మదాపురానికి చెందిన వెంకన్న, ఎల్లమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకన్న వ్యవసాయం చేస్తూ కుమార్తెలను చదివిస్తున్నారు. పెద్ద కుమార్తె ప్రశాంతి ఖమ్మంలో బీటెక్ పూర్తి చేసింది. తర్వాత ఎంఎస్ చదివేందుకు ఫ్రాన్స్ వెళ్లింది. అక్కడ పారిస్ నగరానికి చెందిన తోటి విద్యార్థి నాతన్ క్రిస్టోఫ్ జూబర్ట్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొంతకాలానికి ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇందుకోసం తమ పెద్దల్ని ఒప్పించారు. వరుడు ఇండియాలోనే వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. దీనికి అమ్మాయి కుటుంబం ఓకే చెప్పింది. ఇద్దరూ పెద్దల సమక్షంలో ఖమ్మం పట్టణంలోని ఓ మందిరంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. భారతీయ సంప్రదాయం అంటే ఇష్టపడే వరుడి కుటుంబసభ్యులు.. భారతీయ వస్త్రధారణతో సందడి చేస్తూ ఉత్సాహంగా గడిపారు. నాతన్ వ్యక్తిత్వం చాలా మంచిదని, అందుకే అతడిని ఇష్టపడ్డానని వధువు ప్రశాంతి అంటోంది. ఇక వీరిద్దరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి..
కైట్ ఫెస్టివల్.. ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..
అమెరికాను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు.. ఇరాన్ అగ్రనేత వార్నింగ్..