ఖమ్మం జిల్లాలో బ్రిడ్జిని ఢీకొట్టి బోల్తా పడిన ప్రైవేట్ బస్సు..
ABN , Publish Date - Jun 08 , 2026 | 06:56 AM
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త లంకపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద తెల్లవారుజామున ఒక రోడ్డు ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే..
ఖమ్మం, జూన్ 08: జిల్లాలోని పెనుబల్లి మండలంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. మండల పరిధిలోని కొత్త లంకపల్లి సమీపంలో వేగంగా దూసుకొచ్చిన KVR ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న రైల్వే బ్రిడ్జిని బలంగా ఢీకొట్టి, బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లాలోని చెక్కపల్లి నుంచి దాదాపు 35 మంది ప్రయాణికులతో ఈ బస్సు హైదరాబాద్‌కు బయలుదేరింది. బస్సు కొత్త లంకపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి ప్రయాణికులను బస్సు నుంచి బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాద దాటికి బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కాగా, సమాచారం అందుకున్న వెంటనే పెనుబల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. రహదారిపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
గల్ఫ్‌లో మలయాళీ నర్సుల కష్టాలు.. పీఎం సాయం కోరిన సీఎం
హెడ్‌ఫోన్సా.. ఇయర్‌బడ్సా? చెవులకు ఏది మేలు.!