Share News

హైదరాబాద్‌లోనే విచారణ!

ABN , Publish Date - Jan 31 , 2026 | 04:32 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌లోనే విచారణకు రావాలని సిట్‌ స్పష్టం చేసింది. ఈ కేసులో విచారణ హైదరాబాద్‌లోనే జరుగుతోందని, కేసు హైదరాబాద్‌ పరిధిలోదని గుర్తు చేసింది.

హైదరాబాద్‌లోనే విచారణ!

  • ఇల్లా, పోలీస్‌ స్టేషనా మీరే తేల్చుకోండి

  • ఎర్రవల్లికి పోలీసులు రావడం కుదరదు

  • ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ

  • ఎక్కడికొస్తారో చెప్పాలని కేసీఆర్‌కు సిట్‌ నోటీస్‌

  • బంజారాహిల్స్‌ నందినగర్‌ ఇంటికి పోలీసులు

  • ఎవరూ లేకపోవడంతో గోడకు నోటీసులు

  • ఎర్రవల్లిలో కేసీఆర్‌తో కేటీఆర్‌, హరీశ్‌రావు భేటీ

  • కోర్టుకు వెళ్లే అవకాశాలపైనా నేతల చర్చ

  • స్టేషన్‌కు వెళ్తేనే లబ్ధి అంటున్న పార్టీ వర్గాలు

హైదరాబాద్‌, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌లోనే విచారణకు రావాలని సిట్‌ స్పష్టం చేసింది. ఈ కేసులో విచారణ హైదరాబాద్‌లోనే జరుగుతోందని, కేసు హైదరాబాద్‌ పరిధిలోదని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎర్రవల్లి ఫామ్‌హౌ్‌స లో విచారించడం కుదరదని తేల్చిచెప్పింది. ఫిబ్రవరి ఒకటిన ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన్ను విచారిస్తామని తెలిపింది. బంజారాహిల్స్‌ నందినగర్‌ ఇంట్లో కానీ, జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్లో కానీ అందుబాటులో ఉండాలని బీఆర్‌ఎస్‌ అధినేతను కోరింది. రెండింటిలో ఎక్కడ అందుబాటులో ఉంటారో తమకు సమాచారం ఇవ్వాలంటూ కేసీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసింది. శుక్రవారం రాత్రి 9 గంటలకు సిట్‌ బృందం నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి వెళ్లి అక్కడి సిబ్బందికి నోటీసులు అందించే ప్రయత్నం చేశారు. అయితే సిబ్బంది ఎవరూ అందుబాటులోకి రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి గోడకు నోటీసును అంటించారు. ‘‘పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో 2024లో క్రైం నె ంబర్‌ 243 కింద నమోదైన కేసు విచారణలో భాగంగా మీకు అందచేసిన నోటీసుకు మీరు పంపించిన జవాబు పరిశీలించాం.


ఎన్నికల అఫిడవిట్‌లోనూ, అసెంబ్లీ కార్యాలయం రికార్డుల్లోనూ గజ్వేల్‌ ఎమ్మెల్యేగా మీరు పేర్కొన్న నందినగర్‌ ఇంటి చిరునామాకే నోటీసు పంపించాం. మీరు ఎర్రవెల్లికి రమ్మని కోరినప్పటికీఅది సాధ్యం కాదు. కేసు విచారణ పరిధి దృష్ట్యా మీరు అధికారికంగా రికార్డుల్లో పేర్కొన్న నందినగర్‌ నివాసంలోనే విచారిస్తాం’’ అని నోటీసులో పేర్కొన్నారు. చట్టపరంగా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఈ నోటీసు జారీ చేస్తున్నామని తెలిపారు. కేసు విచారణలో అనేక ముఖ్యమైన ఎలకా్ట్రనిక్‌ ఆధారాలు, రికార్డులు ఉన్నాయని, ఇందులోని అత్యంత ముఖ్యమైన సమాచారం ఉందని, వీటిని తీసుకుని ఎర్రవెల్లికి రావడం సాధ్యం కాదని చెప్పారు. నందినగర్‌ నివాసంలోనే విచారణకు సిద్ధంగా ఉండాలని సిట్‌కు నేతృత్వం వహిస్తున్న ఏసీపీ వెంకటగిరి సూచించారు. సిట్‌ జారీ చేసిన నోటీసుపై కేసీఆర్‌ స్పందిస్తూ, తాను ప్రస్తుతం నందినగర్‌ నివాసంలో ఉండటం లేదని, ఎర్రవెల్లిలో ఉంటున్నానని తెలిపారు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సెక్షన్‌ 160 కింద సాక్షిగా విచారణకు రమ్మని సిట్‌ పంపిన నోటీసులో హైదరాబాద్‌లో తను కోరుకున్న చోట విచారణకు రమ్మని పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్‌ గురువారం సిట్‌ చీఫ్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం తాను నివసిస్తున్న ఎర్రవెల్లిలోనే విచారించాలని అందులో కోరారు. ఈ లేఖపై సిట్‌ అధికారులు శుక్రవారం న్యాయ సలహా తీసుకున్నారు. మరో నోటీసు జారీ చేయాలని నిర్ణయించారు. కేసీఆర్‌ కోరుకుంటున్నట్లు ఎర్రవెల్లిలో విచారణ చేయాల్సిన అవసరం లేదని, కేసు పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో నమోదైనందున దర్యాప్తు అధికారి హైదరాబాద్‌ పరిధిలోనే విచారణ సాగించాలని న్యాయనిపుణులు సూచించారు. ఆ మేరకు నందినగర్‌ నివాసం దగ్గర నోటీసు అంటించారు.


దాంతో ఎర్రవెల్లిలో విచారించాలన్న కేసీఆర్‌ విజ్ఞప్తిని తిరస్కరించినట్లు అయ్యింది. సిట్‌ తాజా నోటీసుకు బీఆర్‌ఎస్‌ లీగల్‌ టీంతో చర్చించిన తర్వాత కేసీఆర్‌ సమాధానం ఇవ్వనున్నారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 ప్రకారం 65 ఏళ్లు దాటిన వారిని విచారించాల్సిన పరిస్ధితులు ఉంటే వారు కోరుకున్న ప్రదేశానికి దర్యాప్తు అధికారి రావాల్సి ఉంటుందని, ఇందుకు పరిధులు ఏమీ ఉండవని కేసీఆర్‌ న్యాయ బృందం సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై ఏం చేయాలనే విషయమై కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌లు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఎర్రవల్లి ఫామ్‌హౌ్‌సలో ముగ్గురూ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. గతంలో కోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ సిట్‌కు లేఖ రాయాలని భావిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే కోర్టును ఆశ్రయించాలనే ఆలోచనలో బీఆర్‌ఎస్‌ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, కాళేశ్వరం విచారణ సమయంలో కేసీఆర్‌ స్వయంగా రావడం వల్ల పార్టీకి మేలు జరిగిందని, మున్సిపల్‌ ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ఈ కేసులో జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌కు వస్తే రాజకీయంగా మేలే జరుగుతుందని బీఆర్‌ఎ్‌సలో చర్చ జరుగుతోంది. ఇవన్నీ బేరీజు వేసుకొని శనివారం కేసీఆర్‌ సమాధానం ఇస్తారని సమాచారం. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌ విచారణ అత్యంత కీలకంగా మారనున్న క్రమంలో సిట్‌ అధికారులు ప్రతి విషయాన్ని ఒకటీకి రెండు సార్లు పరిశీలించిన తర్వాతే ముందడుగు వేస్తున్నారు.

Updated Date - Jan 31 , 2026 | 06:43 AM