Kalvakuntla Kavitha: బీఆర్‌ఎస్‌కు నైతికత లేదు
ABN , Publish Date - Jan 06 , 2026 | 03:14 AM
బీఆర్‌ఎస్‌కు నైతికత లేదు. ఉద్యమ సమయంలో సొంతంగా అనేక కార్యక్రమాలు నిర్వహించాను. యువతను, మహిళలను ఆకర్షించాను. ఎన్నో పోరాటాలు చేశా. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో మొదటి బతుకమ్మ ఉత్సవాల నుంచే నాపై ఆంక్షలు మొదలయ్యాయి. నాపై కక్ష కట్టి.. .....
నాది ఆస్తుల కోసం పోరాటం అంటూ ప్రచారం చేస్తున్నారు. రాజకీయం కోసం కాంగ్రెస్ దాన్ని వాడుకుంటోంది. మా ఇలవేల్పు లక్ష్మీనర్సింహస్వామి మీద.. మాఇద్దరు పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. ఇది ఆస్తుల పంచాయితీ కాదు. ఆత్మ గౌరవం కోసమే నా పోరాటం.
- కవిత
ఉద్యమ సమయంలో ఎన్నో పోరాటాలు చేశా
జాగృతి ద్వారా యువత, మహిళలను ఆకర్షించా
తెలంగాణ బిల్లుకు ముందు ఢిల్లీలో ఆస్కార్ ఫెర్నాండేజ్‌తో కేసీఆర్ భేటీ ఏర్పాటు చేయించింది నేనే
ఉద్యమంలో కుటుంబాన్ని వదిలి మరీ కష్టపడ్డాను
తెలంగాణ వచ్చిన వెంటనే నాపై ఆంక్షలు మొదలు
నాపై కక్ష కట్టి.. కుట్ర చేసి బయటకు పంపారు
అవమాన భారంతో అన్ని బంధాలూ తెంచుకుని వచ్చా
బీఆర్‌ఎస్ నుంచి బయటకు రావడం సంతోషంగా ఉంది
పదేళ్ల పాలనలో ఆశలన్నీ అడియాసలు.. ఇళ్లూ ఇవ్వలేదు
ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వలేదు సరికదా.. అమరుల స్మారక స్తూపం నిర్మాణంలోనూ అవినీతికి పాల్పడ్డారు
నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్‌లైన్‌కు గండికొట్టారు
ఆస్తుల కోసం కాదు.. నాది ఆత్మ గౌరవ పోరాటం
అసెంబ్లీ ఎన్నికలనాటికి రాజకీయ పార్టీగా జాగృతి
వ్యక్తిగా సభ నుంచి వెళుతున్నా.. శక్తిగా తిరిగి వస్తా
మండలి వేదికగా కవిత వ్యాఖ్యలు.. కంటతడి
తెలంగాణలో ఏం పీకి కట్టామని జాతీయ స్థాయిలో పీకుతామంటూ బీఆర్‌ఎస్‌గా మార్చారని కేసీఆర్‌పై ధ్వజం
హైదరాబాద్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ‘‘బీఆర్‌ఎస్‌కు నైతికత లేదు. . ఉద్యమ సమయంలో సొంతంగా అనేక కార్యక్రమాలు నిర్వహించాను. యువతను, మహిళలను ఆకర్షించాను. ఎన్నో పోరాటాలు చేశా. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో మొదటి బతుకమ్మ ఉత్సవాల నుంచే నాపై ఆంక్షలు మొదలయ్యాయి. నాపై కక్ష కట్టి.. కుట్ర చేసి బయటకు పంపారు. అవమాన భారంతో అన్ని బంధాలు, బంధనాలు తెంచుకుని ఇంటి పార్టీ నుంచి బయటకు వచ్చాను. ఆ పార్టీ నుంచి బయటకు రావడం సంతోషంగా ఉంది’’ అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు.
ప్రశ్నించడాన్ని నేర్పిన బీఆర్‌ఎస్ పార్టీయే తాను ప్రశ్నిస్తే కక్షగట్టిందని, కక్ష గట్టి.. కుట్ర చేసి పార్టీ నుంచి బయటకు పంపిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చాక మంచి జరుగుతుందని ప్రజలకు ఆశ ఉండేదని, కానీ, వారి ఆశలన్నింటినీ పదేళ్ల కాలంలో అడియాసలు చేశారని దునుమాడారు. ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వలేదు సరికదా.. తెలంగాణ కోసం పోరాడిన లక్షలాదిమంది ఉద్యమకారులకు బీఆర్‌ఎ్‌సలో ఇసుమంత గౌరవం కూడా దక్కలేదని మండిపడ్డారు. చివరికి, అమర వీరుల స్మారక స్తూపం, అంబేడ్కర్ విగ్రహం నిర్మాణంలోనూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన ఆమె ఆ పార్టీ ఎమ్మెల్సీ పదవికి గతంలోనే రాజీనామా పత్రాన్ని సమర్పించిన విషయం తెలిసిందే. దానిని ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ సోమవారం ఆమె మండలిలో ప్రసంగించారు. అనంతరం గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆయా సందర్భాల్లో ఆమె మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీపైనా.. తన తండ్రి కేసీఆర్‌పైనా, ఆయన పాలనపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. కొద్ది రోజులుగా తనలో దాచుకున్న ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా కంట తడి పెట్టుకున్నారు. టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎ్‌సగా మార్పు చేయడాన్ని తాను అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించానని, తెలంగాణలో ఏం పీకి కట్టామని, జాతీయస్థాయిలో పీకుతామంటూ బీఆర్‌ఎ్‌సగా మార్చారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవి ద్వారా చేయాల్సిన పనులకు కట్టుబాట్లు ఎదురయ్యాయని, అందుకే, ఇష్టపూర్తిగానే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
నా ఇద్దరు పిల్లలపై ఒట్టేసి చెప్తున్నా
‘‘నాది ఆస్తుల కోసం పోరాటం అంటూ ప్రచారం చేస్తున్నారు. రాజకీయం కోసం కాంగ్రెస్ దాన్ని వాడుకుంటోంది. మా ఇలవేల్పు లక్ష్మీనర్సింహస్వామి మీద.. మాఇద్దరు పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. ఇది ఆస్తుల పంచాయితీ కాదు. ఆత్మ గౌరవం కోసమే నా పోరాటం’’ అని కవిత స్పష్టం చేశారు. అమెరికా నుంచి 2004 ఆగస్టు లో వ్యక్తిగత పని మీద హైదరాబాద్ వచ్చిన తాను.. కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోకి వచ్చానని తెలిపారు. ఎంతోమంది ఉద్యోగాలకు రాజీనామా చేసి అప్పటికే ఉద్యమంలోకి వచ్చారని.. వారి స్షూర్తితో తానూ వచ్చానన్నారు. అప్పటికే టీఆర్‌ఎస్ రాజకీయ పార్టీగా ఎదిగిందని, కేసీఆర్ కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారని గుర్తు చేశారు. అయినా.. ‘‘నేను సొంతంగా జాగృతి సంస్థ ద్వారా యువతను, మహిళలను ఉద్యమంలోకి తీసుకువచ్చి అనేక కార్యక్రమాలు నిర్వహించా. మన ఆత్మగౌరవ ప్రతీకగా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు పలు కార్యక్రమాలు చేశా. మీడియా, సినిమాల్లో తెలంగాణ యాస, భాషకు జరుగుతున్న అవమానంపై పోరాటం చేశా. అప్పట్లో శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై సమగ్ర వివరాలు అందిస్తే అవన్నీ నిజమేనని కమిటీ ఫైనల్ రిపోర్ట్‌లో స్పష్టం చేసింది. ’’ అని వివరించారు. ప్రత్యేకించి తెలంగాణలోని సంస్థల్లో స్థానికులకు ఉద్యోగాలు రావాలని పోరాటం చేశానని చెప్పారు. వాస్తవానికి రాజకీయాల్లోకి రావాలని తాను అనుకోలేదని, అంతర్జాతీయ స్థాయిలో ఎన్‌జీఓను నడపాలనే ఆలోచనతో ఉన్నానని, కానీ, బీఆర్‌ఎస్ పార్టీ వాళ్లే పిలిచి నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ ఇచ్చారని తెలిపారు. ఏ మహిళ అయినా పిల్లలను వదిలి రాజకీయాల్లోకి రావాలంటే ఆలోచన చేస్తుందని, తాను కూడా 4 నెలలపాటు తన జీవిత భాగస్వామితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నానన్నారు. నిజామాబాద్ ప్రజలతోఉన్న సన్నిహిత సంబంఽధాలతోనే తనకు ఎంపీ టికెట్ ఇచ్చారని, ఫలితంగా అక్కడి మొత్తం ఎమ్మెల్యే స్థానాలను బీఆర్‌ఎస్ గెలుచుకుందని చెప్పారు.
ఆ కీలక సమావేశం ఏర్పాటు చేయించింది నేనే
కొత్తగా వచ్చినవాళ్లు, ఉద్యమంతో సంబంధం లేని వాళ్లు సైతం తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర ఏమిటని ప్రశ్నిస్తున్నారని, అందుకే ఈ విషయాలు చెబుతున్నానని కవిత వ్యాఖ్యానించారు. గల్లీలోనే కాదు.. ఢిల్లీలో సైతం తాను ఉద్యమం చేశానన్నారు. 2013, 2014లో ఉద్యమంలో కీలక సంఘటనలు జరిగాయి. తెలంగాణ కోసంమాట్లాడాలని పిలిస్తే కుటుంబసమేతంగా ఢిల్లీ వెళ్లాం. రెండు నెలలపాటు అక్కడ ఏ కాంగ్రెస్ నాయకుడూ పలకరించలేదు. పట్టించుకోలేదు. అప్పుడు ఆస్కార్ ఫెర్నాండెజ్‌తో కేసీఆర్‌కు సమావేశం ఏర్పాటు చేయించా. ఆ మరుసటి రోజే సోనియా గాంధీ ఒక్క రోజులోనే ఏడెనిమిదిసార్లు కేసీఆర్‌తో సంప్రదింపులు జరిపారు’’ అని వెల్లడించారు. 2013 ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఉద్యమకారులంతా నిప్పుల కుంపటి మీద కూర్చున్నట్లు భయపడాల్సి వచ్చిందని, ఆంధ్రా లాబీ కారణంగా తెలంగాణ ఏర్పాటు ఎక్కడ ఆగిపోతుందోనని అంతా భయపడ్డామని గుర్తు చేశారు. దీపం చుట్టూ చేతులు పెట్టి కాపాడుకున్నట్లు తెలంగాణ ఏర్పాటు ఆగిపోకుండా కాపాడుకున్నామని, ఆ తర్వాతే పార్లమెంట్ ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు పాసయిందని, ఇందులో తన పాత్ర ఉందని స్పష్టం చేశారు.
తెలంగాణ ఏర్పడ్డాక నాపై ఆంక్షలు
బీఆర్‌ఎస్ 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడు తెలంగాణకు స్వీయ రాజకీయ అస్థిత్వం ఉంటుందని సంతోషపడ్డానని, ఆ తర్వాత కూడా విభజన అంశాలు, హైకోర్టు సాధన, కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అనుమతుల కోసం పోరాటం చేశానని కవిత వివరించారు. ఏ రోజూ పదవులు, రాజకీయం కోసం వెళ్లలేదని, ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో శక్తికి మించి పని చేసేందుకు కృషి చేశానని చెప్పారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న పెద్దపల్లి- నిజామాబాద్ రైల్వే లైన్‌ను ఎంపీగా ఎన్నికైన వెంటనే పూర్తి చేయించానని చెప్పారు. ‘‘జాగృతి పేరుతో 8 ఏళ్ల పాటు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించా. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో మొదటి బతుకమ్మ ఉత్సవాల నుంచే నాపై ఆంక్షలు మొదలయ్యాయి. మొదటి రోజు నుంచే కట్టడి చేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛను హరించారు. ఆ (బీఆర్‌ఎస్) పార్టీ చానల్ గానీ, పార్టీ పేపర్ గానీ ఎప్పుడూ నాకు మద్దతివ్వలేదు. అయినా ధైర్యంతో ముందుకు వెళ్లా’’ అని తెలిపారు.
తెలంగాణలో ఏం పీకామని...
టీఆర్‌ఎ్‌సను బీఆర్‌ఎ్‌సగా మార్చాలన్న నిర్ణయాన్ని తాను అంగీకరించలేదని కవిత చెప్పారు. తెలంగాణలో ఏమి పీకి కట్టామని.. జాతీయ స్థాయిలో పీకుతామని వ్యాఖ్యానించారు. పదేళ్లలో రూ.1.89 లక్షల కోట్లు ఖర్చు చేసి 14 లక్షల ఎకరాలకే నీళ్లు ఇచ్చారని, అవే డబ్బులతో 25 లక్షలమంది పేదలకు ఇళ్లు ఇవ్వవచ్చునని వ్యాఖ్యానించారు. ఉద్యమకారుల సమస్యలు కేసీఆర్‌కు చేరకుండా అడ్డుగోడ కట్టారని విమర్శించారు. ఏ పార్టీ అయినా రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలని, బీఆర్‌ఎ్‌సలో ఆ స్ఫూర్తితో లేదని విమర్శించారు. ఉద్యమ ద్రోహులకు బీఆర్‌ఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని తూర్పారబట్టారు.
కేసీఆర్‌పై కక్షతోనే జైలుకు...
కేసీఆర్‌పై కక్షతో తనను జైల్లో పెట్టారని, ఆ సమయంలో పార్టీ తనకు అండగా నిలవలేదని, వదిలేసిందని, ఈడీ, సీబీఐలతో మూడేళ్లు తానే పోరాడానని కవిత వెల్లడించారు. ఘోష్ కమిషన్ విచారణ సందర్భంగా కేసీఆర్‌ను ఎన్నో మాటలు అంటే ఒక్క బీఆర్‌ఎస్ నాయకుడూ మాట్లాడలేదని, జాగృతి ద్వారా తానే పోరాడానని గుర్తు చేశారు.
అన్యాయంగా పార్టీ నుంచి వెళ్లగొట్టారు
హరీశ్ రావు పేరు చెప్పిన రెండు గంటల్లోనే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, ఉరి తీసేవాళ్లను సైతం చివరి కోరిక ఏమిటని అడిగే గొప్ప దేశం మనదని, కానీ, తనను మాత్రం అన్యాయంగా పార్టీ నుంచి వెళ్లగొట్టారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి కేవలం ఎనిమిది పేజీల రాజ్యాంగం ఉందని, అదో పెద్ద జోక్ అని కవిత అభివర్ణించారు. ‘‘నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు రాత్రికి రాత్రే డిసిప్లినరీ యాక్షన్ కమిటీ పుట్టుకొచ్చింది. నోటీసులు ఇవ్వకుండా, నా వివరణ అడగకుండా సస్పెండ్ చేశారు. నా సస్పెన్షన్‌పై న్యాయపరంగా సవాల్ చేయొచ్చు. కానీ, నైతికత లేని బీఆర్‌ఎ్‌సపై చాలెంజ్ చేయను. ఆ పార్టీకి దూరమవుతున్నందుకు సంతోషంగా ఉన్నా’’ అని కవిత వ్యాఖ్యానించారు.
అవినీతి.. నీళ్లు, నిధులకు గండి
తెలంగాణలో అవినీతి లేని పారదర్శక విధానాన్ని చూడాలనుకున్నామని, కానీ జరగలేదని కవిత వ్యాఖ్యానించారు. పార్టీలో, ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని కవిత వెల్లడించారు. కొంతమంది ప్రజా ప్రతినిధులు చేస్తున్న అవినీతిని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు లేవని వివరించారు. ‘‘అమరజ్యోతి, సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం, కలెక్టరేట్ల నిర్మాణంలో అవినీతి జరిగింది. సిద్దిపేట, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లు ఒక్క వర్షానికే మునిగిపోయాయి. నిజాన్ని సూటిగా మాట్లాడితే నన్ను నిర్లక్ష్యం చేశారు. ఉద్యమకారులకు గుర్తింపు కాదు కదా.. వారికి కనీసం పెన్షన్ కూడా ఇవ్వలేదు. 1969 ఉద్యమకారులనూ గుర్తించలేదు. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్‌లైన్‌కు గండికొట్టేశారు. ఇసుక దందాల కారణంగా నేరెళ్ల లాంటి దురాగతాలు జరిగాయని, అయినా అప్పట్లో చర్యలు తీసుకోలేదని తెలిపారు. కేసీఆర్ కూతురిగా ఆయనను అడిగే ధైర్యం తనకుందని, తాను అడిగిన ఒకటి, రెండు చేయకపోయినా పర్వాలేదని, కానీ, కొంతమంది వరుసగా దురాగతాలకు పాల్పడినా పట్టించుకోలేదని తప్పుబట్టారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలతో తెలంగాణకు నష్టమని కేసీఆర్ ఉద్యమ సమయంలో అన్నారని, సీఎంను కూడా కాంట్రాక్టు పద్ధతిలో పెడతారా? అని అప్పట్లో ప్రశ్నించేవారని, కానీ, తెలంగాణ వచ్చాక కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయకపోగా పెంచి పోషించారని తప్పుబట్టారు. ధర్నా చౌక్‌ను తీసేయాలని నిర్ణయించినప్పుడు తాను వ్యతిరేకించానని, తెలంగాణ వచ్చాక ధర్నా చౌక్ ఎందుకని.. అన్ని సమస్యలనూ పరిష్కరిస్తామని కేసీఆర్ చెప్పారని, కానీ, అవేవీ అమలు కాలేదని తప్పుబట్టారు.
తెలంగాణ ప్రజల కోసం పని చేస్తూనే ఉంటా
ఇప్పుడు తన దారి వేరైనా లక్ష్యం మాత్రం ఒక్కటేనని, తెలంగాణ ప్రజలు బాగుండాలని, వారి కోసం తాను పని చేస్తూనే ఉంటానని కవిత స్పష్టం చేశారు. తాను నిజం, నైతికత వైపు నిలబడి ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం సభలో ప్రతిపక్షం లేదని, భవిష్యత్తులో తాము ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తామని చెప్పారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల నాటికి జాగృతి రాజకీయ పార్టీగా మారుతుంది. తెలంగాణ కోసమే కొట్లాడే కొత్త పార్టీ ఇప్పుడు అవసరం. వ్యక్తిగా బయటకు వెళ్తున్నా. శక్తిగా మళ్లీ వస్తా. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలను చేరాలని విజ్ఞప్తి చేస్తున్నా. నా ప్రయత్నానికి మీ మద్దతు కావాలి. నిరుద్యోగులు, మహిళలు ఆశీర్వదించాలి. వామపక్షాలు, మావోయిస్టు సానుభూతిపరులు, ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేసే పార్టీ రావాలనుకుంటున్న వారు మద్దతివ్వాలి. నిరుద్యోగులకు కొత్త ఉపాధి అవకాశాలు రావాలంటే నాతోపాటు పోరాడండి. ఆదివాసీ, గిరిజన, దళిత, మైనార్టీ బిడ్డలకోసం పోరాటం చేసే పార్టీ కావాలి. ఒక ఆడబిడ్డగా ముందడుగు వేస్తున్నా.. నన్ను ఆశీర్వదించండి. తెలంగాణ ఆడబిడ్డలకు పౌరుషం ఎక్కువ. ఏదీ కావాలని అడగం. కానీ, మనల్ని అవమానిస్తే ఊరుకోం’’ అని కవిత వ్యాఖ్యానించారు. దేవుడి దయతో గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతామన్న నమ్మకం ఉందని, కచ్చితంగా ఓ కొత్త రాజకీయ వ్యవస్థను నిర్మిస్తానని అన్నారు. రాష్ట్రంలో మహిళా ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం తక్కువగాఉందని, అది 0.0003 శాతమేనని వివరించారు. ఆడవాళ్లకు కష్టాలు వస్తే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. అన్ని పార్టీలూ రాజ్యాంగాలను మార్చుకుని మహిళలను ప్రోత్సహించాలని కోరారు.