ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు.. రేపటిలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం..
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:18 PM
తెలంగాణ అసెంబ్లీ వ్యవహారాల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మరోసారి చిక్కులు ఎదురయ్యాయి. కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, సెప్టెంబర్ 4: తెలంగాణ అసెంబ్లీ వ్యవహారాల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మరోసారి చిక్కులు ఎదురయ్యాయి. కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు జారీ చేసింది. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి రేపటిలోగా రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కమిటీ ఆదేశించింది. మార్చి 29న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి కడియం శ్రీహరితో కౌశిక్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ వ్యవహారంపై కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ అసెంబ్లీలో తీర్మానం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో గతవారం ఎథిక్స్ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన సమావేశమై.. ఘటనకు సంబంధించిన అంశాలపై చర్చించింది. కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంతో ఆయన వివరణపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.
ఈ ఆరోపణలను బీఆర్ఎస్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కౌశిక్ రెడ్డి ఎలాంటి తప్పూ చేయలేదని.. మాజీ మంత్రి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎథిక్స్ కమిటీ సమావేశంలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆధారాలు ఉంటే వాటిని పరిశీలించి.. తప్పు నిర్ధారణ అయితే చర్యలు తీసుకోవాలని బీజేపీ సభ్యులు కమిటీకి సూచించినట్లు సమాచారం. దీంతో కౌశిక్ రెడ్డి ఇచ్చే లిఖితపూర్వక వివరణ కీలకంగా మారింది. ఈనెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. సమావేశాలు ప్రారంభమయ్యేలోపే కౌశిక్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి:
రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు..
పదవి ఉన్నా లేకున్నా నా గౌరవం నాకుంది
Read Latest AP News And Telangana News And International News And Telugu News